Sunday, January 18, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపులుల లెక్కింపునకు విస్తృత ఏర్పాట్లు

పులుల లెక్కింపునకు విస్తృత ఏర్పాట్లు

- Advertisement -

రేపటి నుంచి ఫీల్డ్‌ డేటా సేకరణ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
దేశవ్యాప్తంగా ప్రతి నాలుగేండ్లకు ఒకసారి నిర్వహించే ఆల్‌ ఇండియా టైగర్‌ ఎస్టిమేషన్‌ (ఏఐటీఇ)-2026 కార్యక్రమానికి రాష్ట్ర అటవీ శాఖ పూర్తి స్టాయిలో సన్నద్ధమవుతోంది. పులుల సంఖ్యతో పాటు అటవీ జీవ వైవిధ్యంపై సమగ్ర అంచనా వేసే ఈ జాతీయ కార్యక్రమాన్ని రాష్ట్రంలో సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఏఐటీఇ-2026లో భాగంగా 2026 జనవరి 19 నుంచి 25 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,053 అటవీ బీట్‌లలో ఫీల్డ్‌ డేటా సేకరణ చేపట్టనున్నారు. ఈ సర్వేలో టైగర్‌ రిజర్వులు, వన్యప్రాణి అభయారణ్యాలు, రిజర్వ్‌ ఫారెస్టులు సహా ఇతర అటవీ ప్రాంతాలు కూడా కవర్‌ అవుతాయి.

పులుల సంచారం ఉన్న ప్రాంతాలతో పాటు, వాటి ఆహార జంతువులు నివసించే ప్రాంతాలపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. ఏఐటీఈ కార్యక్రమాన్ని జాతీయ టైగర్‌ సంరక్షణ అథారిటీ (ఎన్టీసీఏ), వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూఐఐ) రూపొందించిన మార్గదర్శ కాలకు అనుగుణంగా అమలు చేయనున్నారు. శిక్షణ పొందిన అటవీ సిబ్బంది, వాలంటీర్లు ఫీల్డ్‌లో ట్రాన్సెక్ట్‌ లైన్లు ఏర్పాటు చేసి, పులులు, ఇతర వన్యప్రాణుల పరోక్ష గుర్తులు అయిన పాదముద్రలు, మల నమూనాలు తదితర గుర్తులను నమోదు చేస్తారు. అలాగే ఆహార జంతువుల సాంద్రత, అటవీ నివాస స్థితి, మానవ కార్యకలాపాల ప్రభావాన్ని కూడా మొబైల్‌ యాప్‌ల ద్వారా రికార్డు చేయనున్నారు.

ప్రజల భాగస్వామ్యం కీలకం
ఏఐటీఇ-2026లో ప్రజల భాగస్వామ్యం ప్రధాన భూమిక పోషిస్తున్నది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 1,129 మంది వాలంటీర్లు ముందుకు వచ్చారని అధికారులు తెలిపారు. అదనంగా డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌, హైటైకోస్‌, యానిమల్‌ వారియర్స్‌, డెక్కన్‌ బర్డర్స్‌, ఫ్రెండ్స్‌ ఆఫ్‌ స్నేక్స్‌ సొసైటీ వంటి ప్రముఖ స్వచ్ఛంద సంస్థలు సైతం సుమారు 430 మంది శిక్షణ పొందిన సభ్యులతో ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నాయి. వాలంటీర్లను జిల్లాల వారీగా, అటవీ విభాగాల అవసరాలను బట్టి పంపిణీ చేసి, అటవీ శాఖ సిబ్బంది పర్యవేక్షణలో ఫీల్డ్‌ డేటా సేకరణలో పాల్గొనేలా చర్యలు తీసుకున్నారు.

ఈ విధంగా సేకరించిన డేటా ఆధారంగా తదుపరి దశలో కెమెరా ట్రాపింగ్‌, శాస్త్రీయ విశ్లేషణలు చేపట్టి పులుల సంఖ్యతో పాటు ఇతర వన్యప్రాణుల స్థితిగతులపై సమగ్ర నివేదికను సిద్ధం చేయనున్నారు. ఈ కార్య క్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలు, లాజిస్టిక్స్‌, సాంకేతిక మద్దతు, విభాగాల మధ్య సమన్వయం వంటి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసినట్టు అటవీ శాఖ అధికారులు తెలిపారు. పులుల సంర క్షణలో శాస్త్రీయ విధానాలకు మరింత బలం చేకూరడంతో పాటు, వన్యప్రాణి సంరక్షణలో తెలంగాణ రాష్ట్రం తీసుకుంటున్న ముందడుగులు జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు పొందనుందని ఆశాభావంతో అధికారులున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -