Saturday, April 11, 2026
E-PAPER
Homeజాతీయంవిస్తృత చర్చలు, సంప్రదింపులు జరపాలి

విస్తృత చర్చలు, సంప్రదింపులు జరపాలి

- Advertisement -

మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనపై సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో డిమాండ్‌
జనగణనతో ముడిపెట్టడం సరికాదని అప్పుడే చెప్పాం
రెండేండ్లయినా ఇప్పటికీ అడుగు ముందుకు పడలేదు
తాజా ప్రతిపాదనలు అసెంబ్లీ ఎన్నికల్లో లబ్దికోసమే…
మోడీ సర్కార్‌కు రాజకీయ సంకల్పం లేదు

న్యూఢిల్లీ : పార్లమెంట్‌లోనూ, రాష్ట్రాల చట్టసభల్లోనూ మహిళలకు మూడో వంతు సీట్లను తప్పనిసరిగా రిజర్వ్‌ చేయడానికి సీపీఐ(ఎం) కట్టుబడి వుంది. అందుకే 2023లో ప్రతిపాదిత నారీ శక్తి వందన్‌ అభియాన్‌లో మహిళా రిజర్వేషన్‌ను జనగణనతో, నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడాన్ని తాము వ్యతిరేకించినప్పటికీ బిల్లు ఆమోదం పొందేందుకు మద్దతిచ్చామని తెలిపింది. మూడో వంతు సీట్లను మహిళలకు రిజర్వ్‌ చేసేందుకు రాజ్యాంగంలో 108వ సవరణ ఆమోదానికి కూడా మద్దతిచ్చామని సీపీఐ(ఎం) పేర్కొంది. ఈ మేరకు సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో శుక్రవారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేసింది. జనగణనతో ముడిపెట్టడం వల్ల జాప్యం జరుగుతుందని, 2024 ఎన్నికల్లోనే కాకుండా 2029 ఎన్నికల్లో కూడా మహిళలకు వారి హక్కు అయిన మూడో వంతు సీట్లు నిరాకరించబడతాయని ఆ సమయంలోనే తాము చెప్పామని పొలిట్‌బ్యూరో గుర్తుచేసింది.

”ఇప్పటికి రెండేండ్ల తర్వాత కూడా నియోజకవర్గాల పునర్విభజన కమిషన్‌ను ఏర్పాటుచేయలేదు. ముందుగా హామీ ఇచ్చినట్టు జనగణననూ ప్రారంభించలేదు. అఖిలపక్ష సమావేశం జరపాలని పదే పదే డిమాండ్‌ చేసినా, ఇప్పటికీ ప్రతిపక్షాలతో ఎలాంటి చర్చలు జరపకుండానే మోడీ ప్రభుత్వం మళ్లీ కొత్త ప్రతిపాదనలతో మరోసారి ముందుకు వచ్చింది. ఎన్నికల్లో లబ్ది పొందాలనే సంకుచిత రాజకీయ ఉద్దేశ్యంతో అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయంలో ఇటువంటి ప్రతిపాదన తీసుకురావడం తీవ్ర అభ్యంతరకరం. ఆమోదయోగ్యం కాదు” అని పొలిట్‌బ్యూరో స్పష్టం చేసింది. 2011 జనగణన ప్రాతిపదికగా నియోజకవర్గాల పునర్విభజన ద్వారా పార్లమెంట్‌లో, అసెంబ్లీల్లో సీట్ల సంఖ్యను పెంచాలన్న మరో లక్ష్యంతో ఈ మహిళా రిజర్వేషన్‌ను తాజాగా ముడిపెట్టడమే ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ప్రతిపాదనగా వుంది.

ఇది అనేక సమస్యలను లేవనెత్తింది. వీటిని ముందుకు నెట్టలేం. అన్ని రాష్ట్రాలతో చర్చలు, సంప్రదింపులు జరపాల్సిన అవసరం వుంది. సీట్ల సంఖ్య పెరగడం వల్ల తలెత్తే పర్యవసానాలకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలతోనూ విస్తృతంగా చర్చలు, సంప్రదింపులు జరిపేందుకు వీలుగా ఆ ప్రతిపాదనలను వాయిదా వేయాలని సీపీఐ(ఎం) డిమాండ్‌ చేస్తోంది. మహిళల రిజర్వేషన్లను జనగణన, నియోజకవర్గాల పునర్విభజనల నుంచి విడగొట్టేందుకు సవరణ తీసుకురావాల్సిన అవసరం వుంది, అప్పుడు 2029 సార్వత్రిక ఎన్నికల్లో మహిళల రిజర్వేషన్‌ను అమలు చేయవచ్చని సీపీఐ(ఎం) పునరుద్ఘాటించింది. అయితే, అలా చేయడానికి అవసరమైన రాజకీయ సంకల్పం మోడీ ప్రభుత్వానికి లేదని స్పష్టంగా తెలుస్తోందని పొలిట్‌బ్యూరో వ్యాఖ్యానించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -