Sunday, April 12, 2026
E-PAPER
Homeహెల్త్బయటి యుద్ధాలు - మన లోపలి యుద్ధాలు

బయటి యుద్ధాలు – మన లోపలి యుద్ధాలు

- Advertisement -

బయట నుంచి చూస్తే ఒక ఇల్లు ఎంత అందంగా కనిపించినా… ఆ ఇంటి లోపల ఎలాంటి సమస్యలు జరుగుతున్నాయో బయటివారికి తెలియదు. అలాగే… మనిషి బయటకి నవ్వుతూ కనిపించినా, అతని మనసులో ఎలాంటి యుద్ధం జరుగుతుందో మనకు కనిపించదు.
ఈ రోజు ప్రపంచం ఇరాన్‌ లాంటి దేశాల్లో జరుగుతున్న యుద్ధాలను చూస్తోంది… కానీ మన ఇంట్లోనే జరుగుతున్న నిశ్శబ్ద మానసిక యుద్ధాలను గమనించడం మరిచిపోతోంది.
బయట యుద్ధానికి సైరన్‌ ఉంటుంది… మనసు యుద్ధానికి నిశ్శబ్దమే శబ్దం.
సెల్‌ఫోన్‌ స్క్రీన్‌ చూసి లోపల ఎన్ని మెసేజ్‌లు ఉన్నాయో ఎలా చెప్పలేమో… మనిషి ముఖం చూసి అతని మనసులో ఏం జరుగుతుందో కూడా అర్థం చేసుకోవడం అంత సులువు కాదు.
ఈ రోజు ప్రపంచం బయట యుద్ధాల గురించి మాట్లాడుతోంది. ఉదాహరణకు ఇరాన్‌లో యుద్ధం జరుగుతుందంటే మనం వార్తల్లో చూస్తాం… ఆందోళన పడతాం. కానీ అదే సమయంలో ఒక పెద్ద నిజం మరిచిపోతాం. ప్రపంచంలో జరిగే యుద్ధాల కంటే ప్రమాదకరమైనవి మన ఇళ్లలో, మన మనసుల్లో జరుగుతున్న ‘మానసిక యుద్ధాలు’.
బయట బాంబులు పేలితే శబ్దం వినిపిస్తుంది… కానీ మనసులో బాధ పేలితే శబ్దం వినిపించదు.
పిల్లలకు చదువుల ఒత్తిడి…
యువతకు ఉద్యోగ భయం…
పెద్దలకు బాధ్యతల భారం…

ఇవి అన్నీ కలిసి ప్రతి ఇంట్లో కనిపించని యుద్ధాలను సష్టిస్తున్నాయి. బయట యుద్ధంలో శత్రువు కనిపిస్తాడు… కానీ మనసు యుద్ధంలో శత్రువు మన ఆలోచనలు.
చాలా సార్లు మనం ఒకరికొకరు దగ్గరగా ఉంటాం… కానీ మనసులు దూరంగా ఉంటాయి. ఫోన్లు చేతిలో ఉన్నాయి, మాటలు ఎక్కువయ్యాయి… కానీ మనసు నుంచి వచ్చే మాటలు తగ్గిపోయాయి.
అందుకే ఒకే ఇంట్లో ఉండి కూడా ఒంటరిగా ఫీల్‌ అవుతున్న వాళ్లు పెరుగుతున్నారు.
ఇలాంటి సమయంలో ఒకరికొకరు అండగా ఉండాలి. కానీ కొన్నిసార్లు మనమే తెలియకుండానే ఎదుటివారిపై ఒత్తిడి పెడతాం. చిన్న విషయానికైనా వెంటనే స్పందించాలని ఆశించడం, వాళ్ల భావాలను అర్థం చేసుకోకపోవడం… ఇవి సంబంధాల్లో అలసటను పెంచుతాయి. ఇది మహిళల సమస్య కాదు… మగవారి సమస్య కాదు…
ఇది ప్రతి మనిషి జీవితంలో ఉండే నిజం. ఒకరి మీద ఒకరు ఆధారపడటం తప్పు కాదు… కానీ అర్థం చేసుకోకుండా ఆధారపడటమే సమస్య.
‘నువ్వు వినడం లేదు’ అన్న బాధ… ‘నువ్వు అర్థం చేసుకోవడం లేదు’ అన్న నిరాశ…
ఇవి చిన్న చిన్న చీలికలుగా మొదలై, పెద్ద మానసిక దూరాలుగా మారిపోతాయి.
డిప్రెషన్‌ అనేది నిశ్శబ్ద యుద్ధం. అది బయట కనిపించదు… కానీ లోపల మనిషిని నెమ్మదిగా కూలదీస్తుంది.
ఎప్పుడూ సైలెంట్‌గా ఉండటం…
ఇష్టమైన పనులు వదిలేయడం…
ఒంటరిగా ఉండాలని అనిపించడం…

నిద్రలో మార్పులు…ఇవి అలసత్వం కాదు. సహాయం కోసం వచ్చే సంకేతాలు.
అప్పుడు మనం చేయాల్సిందేమిటంటే పెద్ద పరిష్కారాలు కాదు…
చిన్న చర్యలు.
”మాట్లాడండి… చాలు!” ఒకసారి నిజంగా అడగండి..
”నీకు ఏం అనిపిస్తోంది?”
”నేను నీతోనే ఉన్నాను” అని చెప్పండి.
అది ఒక వ్యక్తికి యుద్ధం నుంచి బయటపడే మొదటి అడుగు కావచ్చు.
చిన్న విరామాలు… కుటుంబంతో గడిపే సమయం… స్నేహితులతో హదయపూర్వకంగా మాట్లాడటం…
ఇవి మనసుకు ఆక్సిజన్‌ లాంటివి. అయినా మార్పు కనిపించకపోతే, మానసిక నిపుణుల సహాయం తీసుకోవడం అవసరం. అది బలహీనత కాదు. బాధ్యత.
ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా మనం ఆపలేం…
కానీ మన ఇంట్లో జరుగుతున్న మానసిక యుద్ధాన్ని మాత్రం ఆపగలం. చివరగా గుర్తుంచుకోవాల్సింది ఒకటే.. మనిషి మనసు… మనిషి జీవితం…

డా|| హిప్నో పద్మా కమలాకర్‌,
9390044031
కౌన్సెలింగ్‌, సైకో థెరపిస్ట్‌, హిప్నో థెరపిస్ట్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -