Saturday, February 7, 2026
E-PAPER
Homeకరీంనగర్అతివలే కీలకం..

అతివలే కీలకం..

- Advertisement -

జిల్లా పురపాలికల్లో మహిళల ఓట్లు అధికం
ఓటు చైతన్యంలోనూ పై చేయి
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల

రాష్ట్రంలో అతిపెద్ద మరమగల వస్త్రోత్పత్తి పరిశ్రమ.. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయం… పారిశ్రామిక… ఆధ్యాత్మిక విశిష్టలతో అభివృద్ధివైపు అడుగులు వేస్తున్న పట్టణాలు. జిల్లాలో ఈ రెండు పట్టణాల్లో పురపోరు రసవత్తరంగా మారింది. రెండు పురపాలికల్లోని మహిళల ఓట్లు అభ్యర్థుల గెలుపు ఓటములు నిర్ణయించనున్నాయి . జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ పురపాలక సంఘాల్లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల మొదలు పార్లమెంట్, గ్రామపంచాయతీ ఎన్నికల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మహిళలు అధికంగా ఓటింగ్ లో పాల్గొన్నారు. ఇదే తరహా పురపాలక ఎన్నికల్లో పురుషుల కంటే మహిళల ఓటింగ్ శాతం పెరిగితే.. అభ్యర్థుల గెలుపోటములు నిర్ణయించేది మహిళలే అవుతారు.

2009 నుంచి పెరుగుతున్న మహిళా ఓటర్లు..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో అసెంబ్లీ పార్లమెంట్, గ్రామపంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపును ప్రభావితం చేయడంలో మహిళలు కీలకంగా మారారు. జిల్లాలో 2009 నుంచి ఓటర్ల జాబితాలో మహిళ ఓటర్ల పెరుగుదల మొదలైంది. పుర ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటరు ముసాయిదా లో రెండు పట్టణాల్లో పురుష ఓటర్ల కంటే మహిళ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. అతివలు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకుంటున్నారు. గ్రామ పంచాయితీ పోరులోనూ రిజర్వేషన్ స్థానాలు కన్నా మహిళలే ఎక్కువ పదవులు దక్కించుకున్నారు. సిరిసిల్ల, వేములవాడ పురపాలక పదవీకాలం ముగిసే వరకు ఈ పట్టణాల్లో మహిళలే చైర్మన్లుగా ఉన్నారు.

సిరిసిల్ల ,వేములవాడ వార్డుల్లో కూడా మహిళలే..
పురపాలికల్లో బేసి సంఖ్యలో వార్డులు ఉంటే ఒక వార్డు స్థానం మహిళలకు అదనంగా కేటాయిస్తారు. సరి సంఖ్యలో స్థానాలు ఉంటే మహిళలకు, పురుషులకు సమానంగా కేటాయిస్తారు. ఇదే ప్రాతిపదికన పురపాలక సంఘాల లోని వార్డులను సైతం రిజర్వ్ చేశారు. ఈ నేపథ్యంలో సిరిసిల్ల, వేములవాడ పురపాలక సంఘంలోని 67 వార్డులు ఉన్నాయి. దీనిలో వేములవాడ సరి సంఖ్య, సిరిసిల్లలో బేసి సంఖ్యలో ఉన్నాయి. పురుషులకు 33 ,మహిళలకు 34 స్థానాలు కేటాయించారు. పురపాలికల్లో వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియలో మొదటగా మొత్తం వార్డు స్థానాల్లో సగం స్థానాలను మహిళలకు కేటాయించారు. తదనంతరం వారికి కేటాయించిన స్థానాలను జనాభా ఓటర్ల సంఖ్య ఆధారంగా సామాజిక వర్గాల వారిగా కేటాయించారు. సిరిసిల్ల, వేములవాడ పురపాలికల్లో మెజారిటీ వార్డుల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు.

జిల్లాలోని మున్సిపల్ ఓటర్ల జాబితా
——————————————————————–
పట్టణం      పురుషులు మహిళలు ఇతరులు మొత్తం
సిరిసిల్ల          39942      42011       06    81959
వేములవాడ  19580      21279       18    40877
——————————————————————–
మొత్తం          59522    63290         24  122836
———————————————————————

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -