Sunday, December 28, 2025
E-PAPER
Homeజాతీయంఆరావళిపై కన్ను

ఆరావళిపై కన్ను

- Advertisement -

అస్మదీయులకు మైనింగ్‌ను కట్టబెట్టేలా మోడీ సర్కారు యత్నాలు
రేర్‌ ఎర్త్‌ ఖనిజాల కోసం భౌగోళికాంశాలకు తిలోదకాలు
దానివల్లే ‘ఆరావళి’ నిర్వచనంలో తీవ్ర జాప్యం
సుప్రీంకోర్టు మందలింపుతో తాత్కాలిక నిర్వచనం
కేంద్రం తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్న పర్యావరణ, సామాజికవేత్తలు

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ విశాఖపట్నం సముద్రతీరంలోని రుషికొండను ఆ రాష్ట్ర మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి హయాంలో చదునుచేసి, ఓ రాజభవనాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ఇది అప్పట్లో తీవ్ర రాజకీయ దుమారాన్నే రేపింది. ఇప్పుడు ఇలాంటి పనినే ప్రధాని నరేంద్రమోడీ చేస్తున్నారు. కాకపోతే ఆయన భవనం నిర్మించట్లేదు. కొండల్ని తవ్వుకొని సొమ్ముచేసుకోండంటూ అస్మదీయ కార్పొరేట్లకు పర్వతాలనే రాసిచ్చే పనిలో ఉన్నారు. దేశంలో అత్యంత పురాతన పర్వత శ్రేణుల్లో ఒకటైన ఆరావళి పర్వతాల నిర్వచనాన్ని ఖరారు చేయడంలో కేంద్రంలోని మోడీ సర్కారు ఏడాదికి పైగా విఫలమైంది. ఉపగ్రహ చిత్రాలు, శాస్త్రీయ నిపుణుల సహకారం, మూడు కమిటీల కృషి ఉన్నప్పటికీ ఆరావళికి ఏకరీతి సాంకేతిక ప్రమాణాలను నిర్ణయించలేకపోయింది. అయితే ఈ పర్వత శ్రేణుల్ని రక్షించాలనే ఆలోచన కంటే, దానిలో ఉన్న కీలక ఖనిజాల నేపథ్యంలో మైనింగ్‌ శక్తులకు అప్పగించాలన్న ఉత్సాహమే ఈ నిర్వచనం ఆలస్యం, అస్పష్టతకు దారి తీశాయని పర్యావరణవేత్తలు, సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.

ఒకవేళ సరైన ఏకరీతి నిర్వచనంతో ముందుకు వస్తే ఆరావళిలో కీలక ఖనిజాల కోసం మైనింగ్‌కు అవకాశముండదనే కారణంతోనే కేంద్రం వ్యవహరించిందని చెప్తున్నారు. హర్యానా నుంచి గుజరాత్‌ వరకు నాలుగు రాష్ట్రాల మీదుగా విస్తరించిన సుమారు 700 కిలోమీటర్ల పొడవైన ఆరావళి పర్వత శ్రేణికి స్పష్టమైన నిర్వచనం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో కేంద్రం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే పర్యావరణ, భౌగోళిక ప్రమాణాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. పర్యావరణ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులపై కోర్టు ధిక్కార చర్యలు ప్రారంభిస్తామని సుప్రీంకోర్టు హెచ్చరించిన తర్వాత.. ఈ ఏడాది ఆగస్టులో కొత్త ఉప కమిటీని ఏర్పాటు చేశారు. అయితే ఈ కమిటీ కూడా ‘ఆరావళి నిర్వచనం’ కంటే పర్యావరణ పరిరక్షణతో పాటు 2019 జాతీయ ఖనిజ విధానానికి అనుకూలంగా ఉండే ‘సమతుల్య విధానం’పై దృష్టి పెట్టింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ రెండువేల పేజీల అఫిడవిట్‌ను సమర్పించింది. కీలక ఖనిజాల తవ్వకాలకు మార్గం సుగమం చేయడమే దీని లక్ష్యమని పర్యావరణవేత్తలు విమర్శిస్తున్నారు.

ప్రభుత్వం ఖరారు చేసిన తాజా నిర్వచనం ప్రకారం.. వంద మీటర్లకు పైగా ఎత్తున కొండలకే రక్షణ కల్పించబడుతుందని పేర్కొంది. ఈ నిర్వచనం దేశవ్యాప్తంగా తీవ్ర అగ్గిని రాజేసింది. ఆరావళిలోని ఎక్కువ భాగం, ముఖ్యంగా రాజస్తాన్‌లో విస్తరించిన ప్రాంతాలు గనుల తవ్వకాల ముప్పునకు లోనవుతాయనే ఆందోళనలు ఎక్కువయ్యాయి. ఈ వివాదంపై స్పందించిన పర్యావరణ మంత్రి భూపేందర్‌ యాదవ్‌, సుప్రీంకోర్టుకు ఈ ఏడాది నవంబర్‌ 20న ఇచ్చిన సమాధానంలో ఆరావళి ప్రాంతమంతా సస్టైనబుల్‌ మైనింగ్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాన్‌ (ఎంపీఎస్‌ఎం) రూపొందించే వరకు, కొత్త గనులకు అనుమతులు ఇవ్వబోమని తెలిపారు. ఈ ప్రణాళికలో గనులు పూర్తిగా నిషేధించాల్సిన ప్రాంతాలు, పరిమితంగా అనుమతించదగిన ప్రాంతాలను స్పష్టంగా గుర్తించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.ఆరావళిలో అక్రమ గనుల తవ్వకాలు, కొండలను విచ్ఛిన్నం చేయడం వల్ల గత దశాబ్దాలుగా పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇదే న్యాయస్థాన జోక్యానికి దారి తీసింది. ఆరావళి పర్వతాలకు ఏకరీతి నిర్వచనం నిర్ణయించేందుకు 2024లో సుప్రీంకోర్టు ఒక కమిటీని ఏర్పాటు చేసింది.

ఈ కమిటీలో పర్యావరణ మంత్రిత్వ శాఖ, ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఐ), రాష్ట్ర అటవీ శాఖలు, జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా, సుప్రీంకోర్టు సెంట్రల్‌ ఎంపవర్డ్‌ కమిటీ ప్రతినిధులు ఉన్నారు. ఈ కమిటీకి దేశవ్యాప్తంగా వర్తించేలా, శాస్త్రీయ ఆధారాలతో కూడిన ఆరావళి నిర్వచనం రూపొందించే బాధ్యతను అప్పగించారు. సుప్రీంకోర్టు మందలింపు అనంతరం 2025 అక్టోబర్‌లో కమిటీ తన నివేదికను అందజేసింది. దానిపై సుప్రీంకోర్టు 2025 నవంబర్‌లో ఉత్తర్వులు జారీ చేసింది. కాగా కమిటీ పత్రాల పరిశీలనలో.. 2010లో ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఐ) ఆరావళి పర్వతాలను కొండల ఎత్తు కాకుండా వాలును ఆధారంగా తీసుకొని నిర్వచనం చేసింది. కానీ దేశవ్యాప్తంగా అదే ప్రమాణం వర్తింపజేయడం సాధ్యం కాదని నిపుణులు తేల్చారు. జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా వంటి సంస్థలు కూడా కేవలం ఎత్తు, వాలు మాత్రమే సరిపోవనీ, భౌగోళిక నిర్మాణం, ప్రాంతీయ లక్షణాలను పరిగణలోకి తీసుకోవాలని అభిప్రాయపడ్డాయి. అయినా ఈ ఏడాది ఆగస్టు వరకు ఆరు సమావేశాలు జరిగినా ఒక స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోకపోవడం గమనార్హం. చివరికి సుప్రీంకోర్టు.. ‘ఇది శాస్త్రీయ సమస్య మాత్రమే కాదు.. ఒక విధాన నిర్ణయం’ అంటూ ఆగస్టు 12న కేంద్రాన్ని తీవ్రంగా మందలించింది.

దేశానికి కీలకమైన టిన్‌, లిథియం, రేర్‌ ఎర్త్‌ ఎలిమెంట్స్‌ వంటి ఖనిజాలు ఆరావళి పర్వతాల్లో ఉన్నాయని పేర్కొంటూ.. పర్యావరణ పరిరక్షణతో పాటు ‘సస్టైనబుల్‌ మైనింగ్‌’కు అనుకూల నిర్వచనాన్ని కమిటీ చివరకు ప్రతిపాదించింది. ”ఆరావళి-ఢిల్లీ వ్యవస్థలో టిన్‌, గ్రాఫైట్‌, మోలిబ్డినమ్‌, నయోబియం, నికెల్‌, లిథియం, రేర్‌ ఎర్త్‌ ఎలిమెంట్స్‌ వంటి ఖనిజాలకు విశేష అవకాశాలు ఉన్నట్టు గుర్తించబడింది. ఈ నేపథ్యంలో ఆరావళి కొండలు, శ్రేణుల పర్యావరణ, జీవ వైవిధ్య సమగ్రతే ప్రధాన ప్రాధాన్యంగా ఉండాలి. అదే సమయంలో దేశ వ్యూహాత్మక, అభివృద్ధి ప్రయోజనాలు దెబ్బతినకుండా కీలక, వ్యూహాత్మక, అణుఖనిజాలను శాస్త్రీయంగా, పర్యావరణానికి హాని లేకుండా వినియోగించే విధానాన్ని రూపొందించడం కూడా అవసరం” అని కమిటీ తన నివేదికలో పేర్కొన్నది.

పర్యావరణవేత్తల అభిప్రాయం ప్రకారం సమతుల్యత పేరుతో ఆరావళిని గనుల బలికి అర్పించే ప్రయత్నమే జరుగుతోంది. నిర్వచనం ఆలస్యం కావడం కాదు, ఉద్దేశపూర్వకంగా అస్పష్టంగా ఉంచడమే అసలు ప్రమాదమని వారు హెచ్చరిస్తున్నారు. ఇక ఆరావళి కొండల విషయంలో అదానీ గ్రూప్‌ నేరుగా సంబం ధం ఉందని నిర్దిష్ట ఆరోపణలు లేనప్పటికీ, ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పుతో కొండల పరిరక్షణకు ముప్పు వాటిల్లి, కార్పొరేట్‌ ప్రయోజనాల కోసం మైనింగ్‌కు అవకాశం కల్పిస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నా యి. ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్‌ కంపెనీల వ్యాపారాలు, ముఖ్యంగా అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌, ఆరావళి ట్రాన్స్‌మిషన్‌ ప్రాజెక్టులు, అలాగే అదానీ ఎయిర్‌పోర్ట్‌ ప్రాజెక్టులపై విమర్శలు వినిపిస్తున్నాయి.

ఆరావళి-అదానీ అనుబంధం గురించిన ప్రధాన అంశాలు :మైనింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ వివాదం
సుప్రీంకోర్టు.. నిర్వచనాన్ని మార్చడం వల్ల ఆరావళి కొండల పరిధిలోని దాదాపు 90 శాతం భూమి మైనింగ్‌, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు అందుబాటులోకి వస్తుందని, దీని వెనుక అదానీ వంటి పెద్ద కంపెనీల ప్రయోజనాలు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి.

కేంద్రం స్పందన
ప్రభుత్వం మాత్రం తన నిర్ణయాలను సమర్థించుకుంటున్నది. మైనింగ్‌ అక్రమాలను అరికట్టడానికే ‘ఆరావళి’ నిర్వచనాన్ని మార్చామని వాదిస్తోంది. అదానీ గ్రూప్‌ నేరుగా ఆరావళి మైనింగ్‌లో పాల్గొంటున్నట్టు నిరూపించబడనప్పటికీ, ఇటీవల సుప్రీంకోర్టు తీర్పుతో అదానీ కంపెనీలకు ఆ ప్రాంతంలో వ్యాపార అవకాశాలు మెరుగుపడతాయనే విమర్శలు, అదానీ కంపెనీలకు సంబంధించిన కొన్ని ప్రాజెక్టులు ఆరావళి పరిధిలో ఉన్నందున ఈ అనుబంధంపై చర్చ జరుగుతోంది.గతంలో లేబర్‌కోడ్‌ లపై వెనక్కి తగ్గినట్టు డ్రామాలాడిన మోడీ సర్కారు.. తమకు బలం రాగానే చట్టసభల్లో బలవంతంగా ఆమోదించుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆరావళిని తమ వాళ్లకు (కార్పొరేట్లు) కట్టబెట్టటానికి ఎంతకైనా తెగించే అవకాశాలు లేకపోలేదని పర్యావరణవేత్తలు, ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌
అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌ (ఏఈఎస్‌ఎల్‌) ఆరావళి ట్రాన్స్‌మిషన్‌ సర్వీస్‌ కంపెనీ లిమిటెడ్‌(ఏటీఎస్‌సీఎల్‌) పేరుతో అల్వార్‌ ప్రాంతంలో ట్రాన్స్‌మిషన్‌ ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. ఇది ఆరావళి పరిధిలోనే ఉంది. దీనిపై విమర్శలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పర్యావరణవేత్తలు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు ఈ పరిణామాలను ఖండిస్తున్నారు. అదానీ వంటి కంపెనీల ప్రయోజనాల కోసం పర్యావరణ విధ్వంసం జరుగుతోందనీ, దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -