14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు
సినిమాల పైరసీలో నేరస్థుడు రవి
టాలీవుడ్ నిర్మాతలకు రూ.వేల కోట్ల నష్టం చేకూర్చిన వైనం
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఎట్టకేలకు ‘ఐ బొమ్మ’ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బెట్టింగ్, గేమింగ్ యాప్ మాఫియాలతో కుమ్మక్కైన ఇమ్మడి రవి ఆరు సంవత్సరాల్లో వేలాది పైరసీ సినిమాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశాడు. రవి కారణంగా టాలీవుడ్ నిర్మాతలకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. కొద్ది నెలల కిందట తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫిర్యాదు మేరకు ఐ బొమ్మతోపాటు, 65 పైరసీ వెబ్‌సైట్‌లపై కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో ఐదుగురు పైరసీ నేరస్థులను అరెస్టు చేశారు. అయితే తనను పట్టుకోలేరంటూ హైదరాబాద్ పోలీసులకు రవి గతంలో సవాల్ విసిరాడు.
2019 నుంచి ‘ఐ బొమ్మ’ వెబ్‌సైట్‌లో పైరసీ చేసిన వీడియోలు అప్‌లోడ్ చేస్తున్న రవి ఇంతకాలం పోలీసులకు చిక్కకుండా తప్పించుకుతిరిగాడు. ఈ విధంగా పెద్దఎత్తున ఆస్తులు కూడబెట్టినట్టు సమాచారం. చివరకు సీసీఎస్ పోలీసులు శనివారం రవిని అదుపులోకి తీసుకున్నారు. అతను వైజాగ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ఓ అపార్టుమెంట్‌లో నివాసము ంటున్న రవి ఇంట్లో నుంచి వందల హార్డ్ డిస్క్‌లు, పెద్దఎత్తున కంప్యూటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. రవి ఉపయోగించిన సర్వర్లను సైతం గుర్తించారు. నిందితుడిని నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా కోర్టు 14 రోజులు రిమాండ్ చేసింది. అతన్ని విచారించేందుకు పోలీసులు ఏడు రోజుల కస్టడీ కావాలని కోర్టును కోరారు.
ఫ్రాన్స్ నుంచి ఇండియాకు
ఇమ్మడి రవిని ఆయన భార్యనే పట్టించినట్టు ప్రచారం జరుగుతోంది. ఇమ్మడి రవికి, ఆయన భార్యకు కొంతకాలంగా తగాదాలు నడుస్తున్నాయి. విడాకుల కేసు విషయంలో ఫ్రాన్స్‌లో ఉన్న రవి ఇండియాకు వస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. కొద్ది నెలలుగా గాలిస్తున్న పోలీసులు.. రవిపై ప్రత్యేక నిఘా పెట్టిన విషయం తెలిసిందే. అయితే హైదరాబాద్, ఢిల్లీ, ముంబయి, బెంగళూరు తదితర ప్రాంతాల్లో తలదాచుకున్నట్టు ముందుగా అనుమానిచారు. రవి ఐడీ ఇతర దేశాల్లో చూపించినా ఇండియాలోనే ఉన్నట్టు భావించారు. అయితే రవి ఫ్రాన్స్‌లో ఉన్నాడని, శుక్రవారం వస్తున్నాడని తాజాగా సమాచారం అందింది. దాంతో అప్రమత్తమైన పోలీసులు నిఘా పెంచి రవి హైదరాబాద్‌కు రాగానే అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ సమాచారం అతని భార్యే ఇచ్చినట్టు ప్రచారం జోరుగా సాగుతోంది. హైదరాబాద్‌తోపాటు ఆయన స్వస్థలం విశాఖలో సైతం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.



