భారత బీమారంగం, సంస్థలు సన్నద్ధం కావాలి
పరిస్థితులకు అనుగుణంగా విధానాలు, సేవలను రూపొందించుకోవాలి : ఐఐఆర్‌ఎం స్నాతకోత్సవంలో ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ ఎం.రాజేశ్వరరావు
నవతెలంగాణ-మియాపూర్
భారత ఆర్థికాభివృద్ధిలో బీమా రంగం ప్రముఖ పాత్ర పోషిస్తున్నదని, భవిష్యత్‌లో ఎదురయ్యే సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు భారత బీమా రంగం, సంస్థలు సన్నద్ధం కావాలని భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్ ఎం.రాజేశ్వరరావు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా, దేశంలో వస్తున్న వాతావరణ, భౌగోళిక, సామాజిక, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా బీమా సంస్థలు విధానాలు, పద్ధతులు, సేవలను రూపొందించుకోవాలని సూచించారు. శనివారం రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలిలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్సురెన్స్, రిస్క్ మేనేజ్‌మెంట్ (ఐఐఆర్‌ఎం) స్నాతకోత్సవానికి ఎం.రాజేశ్వరరావు హాజరై మాట్లాడారు. ఆర్థిక రంగాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి స్థిరమైన ఆర్థికం, ప్రభావవంతమైన రిస్క్ మేనేజ్ నాయకత్వం అవసరన్నారు. ఐక్యరాజ్య సమితి 2020-23 నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 1.1 డిగ్రీల సెల్సియస్ పెరిగిందని, ఈ వాతావరణ అసమానతలను నియంత్రించనట్లయితే ప్రపంచవ్యాప్తంగా 4 శాతం జీడీపీని నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. దీని ప్రభావం అన్నిరంగాలపై పడుతుందన్నారు. ముఖ్యంగా బీమా రంగంపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు.
ప్రస్తుతం 2023-24 ఆర్థిక సంవత్సరం లెక్కల ప్రకారం దేశంలో బీమా రంగం విస్తరణ తక్కువగా ఉందని, ప్రపంచవ్యాప్తంగా బీమా ప్రీమియం సగటు 7 శాతం కాగా భారతదేశంలో అది 3 శాతంగా ఉందని తెలిపారు. అయితే ఆర్థిక నిపుణుల అంచనాల ప్రకారం భవిష్యత్తులో మన దేశంలో ఆర్థిక రంగం కంటే ఎక్కువగా బీమారంగం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. 2024-28 మధ్యకాలంలో దేశంలో బీమా రంగం వృద్ధి 11 శాతం ఉంటుందని భారత బీమారంగం అంచనా వేసిందని, అందులో భాగంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో బీమా ప్రీమియం రూ.11.2 లక్షల కోట్లతో ఏడు శాతానికి పెరిగిందని అంచనా వేసిందని తెలిపారు. ఈ వృద్ధి సాంకేతిక అంశాలు, వాతావరణ మార్పులు, సూక్ష్మ ఆర్థిక వ్యవహారాలు తదితర అంశాలపై ఆధారపడి ఉంటుందని, ఆర్థిక సంస్థలు ఈ మార్పులను సూక్ష్మంగా గమనిస్తూ ముందుకు వెళ్లాలన్నారు. ఐఆర్‌డీఏఐ సభ్యులు రజరుకుమార్ సిన్హా మాట్లాడుతూ.. బీమా, ఆర్థిక సేవల రంగంలో అభివృద్ధి చెందుతున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని, గ్రాడ్యుయేట్లు వారి వృత్తిపర మైన ప్రయాణాల్లో ఆవిష్కరణ, అనుకూలతను ఎప్పటికప్పుడు స్వీకరించాలని సూచించారు.
ముందుగా ఐఐఆర్‌ఎం డైరెక్టర్ అరవింద్ కుమార్ స్వాగతోపన్యాసం చేస్తూ బీమా, రిస్క్ మేనేజ్ అనుబంధ ఆర్థిక సేవలలో ఆవిష్కరణ, నైతిక నాయకత్వాన్ని నడిపించే నిపుణులను పెంపొందించడంలో సంస్థ నిబద్ధతను పునరుద్ఘాటించారు. సభకు ఐఐఆర్‌ఎం ప్రిన్సిపాల్ డాక్టర్ వీవీకే మోహన్ వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో భారత ఇన్సురెన్స్ రెగ్యులేటరీ, డెవలప్ అధారిటీ (ఐఆర్‌డీఏఐ) సభ్యులు రజరు కుమార్ సిన్హా, పి.కె.అరోరా, సత్యజిత్ త్రిపాఠి, ఐఐటి సీఈఓ వెంకట్ చెంగవల్లి, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సురెన్స్ చీఫ్ అభిషేక్ ముజుందార్ తదితరులు పాల్గొన్నారు.