నవతెలంగాణ – మునిపల్లి
ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీలకు ఏర్పాటుచేసిన ముఖ గుర్తింపు హాజరు కూలీల పాలిట శాపంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే కూలీలు సిగ్నలింగ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో హాజరు కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే ఉపాధి హామీ పథకం అమలులో భాగంగా పారదర్శకంగా ఉండేందుకుగాను కేంద్ర ప్రభుత్వం ఆధునాతన సాంకేతిక విధానాన్ని ఉపయోగించుకొని కూలీల హాజరు నమోదు కార్యక్రమంలో భాగంగా ముఖ గుర్తింపు హాజరు పథకాన్ని ప్రవేశపెట్టింది.
అయితే పనికి వెళ్లగానే హాజరు తో పాటు పని పూర్తయిన తర్వాత కూలీలు హాజరు నమోదు చేసుకోవాలి. అసలు తిప్పలు ఇక్కడే వచ్చింది. పని కంటే ముందు హాజరు వేసుకోవాలన్న సిగ్నల్ లేక గంటల తరబడి నిరీక్షిస్తున్నామని పని పూర్తయిన తర్వాత చెక్ అవుట్ హాజరు కోసం కూడా పని చేసి అలసిపోయిన మేము తిరిగి హాజరు వేసుకోవాలంటే గంటల తరబడి నిరీక్షించి ఎండలో వేచి చూస్తున్నామని కూలీలు పేర్కొంటున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఉపాధి హామీ పథకం కింద పని చేసే కూలీలకు ముఖ గుర్తింపు హాజరు విధానాన్ని తొలగించి పాత పద్ధతిని కొనసాగించాలని ఉపాధి కూలీలు డిమాండ్ చేస్తున్నారు.



