ప్రభుత్వ సలహాదారు కేశవరావుకు టీఆర్టీఎఫ్ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
విద్యా కమిషన్ నివేదికలోని ఉపాధ్యాయులకు అభద్రత కలిగించే అంశాలను తొలగించాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ చైర్మెన్ కె కేశవరావును సోమవారం హైదరాబాద్‌లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కటకం రమేష్, మారెడ్డి అంజిరెడ్డి కలిసి వినతిపత్రం అందజేశారు. అకునూరి మురళి నేతృత్వంలోని విద్యా కమిషన్ నివేదికపై తమ సంఘం తరపున విశ్లేషణ, అభ్యంతరాలను సమర్పించామని వివరించారు. కమిషన్ నివేదికలో విద్యా బడ్జెట్‌ను 18 శాతానికి పెంచాలని కోరడం, అంగన్‌వాడీ టీచర్లకు శిక్షణ ఇచ్చి పూర్వ ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేయడం, మధ్యాహ్న భోజనాన్ని ఇంటర్ వరకు విస్తరించడం, ఖాళీల భర్తీ వంటి ప్రతిపాదనలు విద్యా వ్యవస్థ బలోపేతానికి దోహదపడతాయని తెలిపారు.
ఇదే నివేదికలో ఉపాధ్యాయుల సర్వీసు నిబంధనలకు సంబంధించి చేసిన పలు ప్రతిపాదనలు క్షేత్రస్థాయి వాస్తవాలకు దూరంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులను ఐదేండ్ల కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించడం, ప్రతి ఐదేండ్లకోసారి పరీక్షలు నిర్వహించడం, మార్కెట్ రేటు ప్రకారం వేతనాలను తగ్గించాలనే ఆలోచన తీవ్ర అభద్రతాభావానికి గురిచేస్తుందని పేర్కొన్నారు. పదోన్నతులను నిలిపేసి 100 శాతం ప్రత్యక్ష నియామకాలు చేపట్టడం, ఉపాధ్యాయులను గ్రేడింగ్‌ల పేరుతో విభజించడం వంటి చర్యలు వృత్తిపరమైన ఎదుగుదలను దెబ్బతీస్తాయని తెలిపారు. ఉపాధ్యాయుల హక్కులను హరించే ప్రతిపాదనలను తొలగించాలని కోరారు.
టీచర్లకు అభద్రత కలిగించే అంశాలను తొలగించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



