కేసీఆర్, రేవంత్‌రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శలు
దొంగే పోలీసులను బెదిరించినట్టు ముఖ్యమంత్రి వ్యాఖ్యలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రాన్ని పదేండ్లు పాలించిన కేసీఆర్, రెండేండ్లుగా పాలిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ‘ఫేక్, ఫ్రాడ్, ఫాల్స్, పెయిల్యూర్’ పాలకులు అని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి విమర్శించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే తనపై సీఎం అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో కేసీఆర్, రేవంత్‌రెడ్డి బ్యాడ్ బ్రదర్స్‌గా ప్రసిద్ధి చెందారని ఎద్దేవా చేశారు. తెరచాటు రాజకీయాలు చేయడంలో కేసీఆర్, రేవంత్ దిట్టలు అని విమర్శించారు. రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది వారేనని ఆరోపించారు. ఓటు బ్యాంక్ పాలిటిక్స్ చేసే బ్యాడ్ బ్రదర్స్ రేవంత్, కేసీఆర్ అని చెప్పారు. ఎన్నికల్లో ఎన్నో హామీలిచ్చిన రేవంత్…అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కటీ అమలు చేయలేదని విమర్శించారు. తమ వైఫల్యాలను, అసమర్థ తను కప్పిపుచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వంపై నెపాన్ని నెట్టేసి ఎదురు దాడికి దిగుతున్నారని విమర్శించారు.
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం చేన్తూ పైసలు పంచుతున్నారని ఆరోపించారు. అంగట్లో సరుకు కొన్నట్లుగా ఓట్లను కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. ‘రానున్న రోజుల్లో తాము ఆట మొదలు పెడతాం. అప్పుడు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల కింద భూమి కదులుతుంది’ అని హెచ్చరించారు. కాంగ్రెస్ ఓడిపోతుందనే భయంతో ముఖ్యమంత్రి సోయి తప్పి మాట్లాడు తున్నారని విమర్శించారు. ప్రజలకు ఏం చేశారో చెప్పకుండా ప్రత్యర్థి పార్టీలను తిడుతూ ఓట్లు అడుగుతున్నారని చెప్పారు. బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసిపోయాయంటూ రేవంత్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కుటుంబ పార్టీ కాదనీ, ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే పార్టీ అని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోని వ్యాపారుల వద్ద డబ్బులు వసూలు చేసి బీహార్ ఎన్నికలకు పంపింది నిజం కాదా? అని సీఎంను నిలదీశారు.



