Wednesday, April 30, 2025
Homeరాష్ట్రీయంవికలాంగుల చట్టాల అమలులో విఫలం

వికలాంగుల చట్టాల అమలులో విఫలం

– ప్రత్యేక అవసరాల విద్యార్థులను ప్రభుత్వం ఆదుకోవాలి
– ఫీజుల నియంత్రణ చట్టం చేయాలి : ఎన్పీఆర్డీ రాష్ట్ర సదస్సులో వక్తలు

నవతెలంగాణ-సిటీబ్యూరో
వికలాంగుల చట్టాలను అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని పలువురు వక్తలు అన్నారు. అంతర్జాతీయ ఆటీజం అవేర్‌నెస్‌ దినోత్సవం సందర్భంగా వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో, ఎల్‌ఐసీ సౌజన్యంతో మంగళవారం హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ”వికలాంగుల చట్టాల అమలు-అనుభవాలు, మానసిక వికలాంగుల సమస్యలు-ప్రభుత్వం చేయాల్సిన కృషి” అనే అంశంపై రాష్ట్ర సదస్సు నిర్వహించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.వెంకట్‌ అధ్యక్షతన వహించగా.. ఎన్‌ఐహెచ్‌హెచ్‌ ప్రొఫెసర్‌ రాజేందర్‌కుమార్‌ పోరిక, ఎల్‌ఐసీ సీసీ ఇన్‌చార్జి వి.సుబ్రహ్మణ్యం, ఆలిండియా ఇన్సూరెన్స్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ హైదరాబాద్‌ అధ్యక్షులు గిరిదర్‌శర్మ ప్రసంగించారు. 2017 మెంటల్‌ హెల్త్‌ కేర్‌ యాక్ట్‌ అమలుల్లోకి రావడం వల్ల మానసిక వికలాంగులకు భరోసా దొరికిందన్నారు. ఐక్యరాజ్య సమితి హక్కుల ఒప్పంద పత్రం అమలు చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాలని డిమాండ్‌ చేశారు. నేషనల్‌ ట్రస్ట్‌, నేషనల్‌ పాలసీ అమలుకు నోచుకోవడం లేదన్నారు. నేషనల్‌ ట్రస్ట్‌ ఆటీజం, బుద్ది మాంద్యత, సెరిబ్రాల్‌ పాల్సి, బహుళ వైకల్యం గల వారికి రక్షణ కల్పిస్తుందని తెలిపారు.
వికలాంగుల చట్టాల సవరణకు కేంద్రం కుట్రలు : ఎం.అడివయ్య
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వికలాంగుల చట్టాల్లో మార్పులు చేయాలనీ, సవరించేందుకు కుట్రలు చేస్తోందనీ ఎన్పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఆటీజంతో బాధపడే చిన్నారుల సంఖ్య పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆటిజంను వైకల్యంగా గుర్తించినట్టు తెలిపారు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం విద్య, ఉపాధి అవకాశలతోపాటు పునరావాస సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆటిజం నివారణకు పని చేస్తున్న సంస్థలకు పరికరాల కొనుగోలు కోసం ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఆటిజం రుగ్మత కలిగిన వారిని గుర్తించేందుకు ప్రత్యేక సర్వే చేయాలని కోరారు. ఆటిజం, మానసిక వైకల్యం కలిగిన వారికి రూ.5లక్షల బీమా సౌకర్యం కల్పించాలన్నారు. ఆటిజం, మానసిక వైకల్యం కలిగిన వారికి ప్రభుత్వమే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో మానసిక వికలాంగుల కోసం ప్రత్యేక హౌమ్‌ నిర్మించాలని, ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్‌ స్కూల్స్‌, చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్స్‌, స్పీచ్‌, హియరింగ్‌, ఆటిజం థెరపీ కేంద్రాల నిర్వహణ కోసం నిబంధనలు రూపొందించాలని కోరారు.
అనుమతిలేని సెంటర్లపై చర్యలు తీసుకోవాలి : కె.వెంకట్‌
ఆటిజం సెంటర్ల నిర్వాహకులు రిహాబిలిటేషన్‌ కౌన్సిల్‌ అఫ్‌ ఇండియా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఎన్పీఆర్డీ రాష్ట్ర అధ్యక్షులు కె.వెంకట్‌ అన్నారు. ప్రభుత్వ అనుమతి లేని థెరపీ కేంద్రాలను మూసేయాలని డిమాండ్‌ చేశారు. స్పెషల్‌ స్కూల్స్‌, ఆటీజం, చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్స్‌, స్పీచ్‌, హియరింగ్‌ కేంద్రాల్లో ఫీజులను నియంత్రిస్తూ ప్రభుత్వం చట్టం చేయాలన్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండానే హైదరాబాద్‌ నగరంలో వందలాది సెంటర్స్‌ నడుస్తున్నాయని, ట్రేడ్‌ లైసెన్స్‌ తీసుకుని క్లీనిక్స్‌ నడుపుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.
హామీలను అమలు చేయాలి : ఎన్పీఆర్డీ కేంద్ర కమిటీ సభ్యులు
రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎన్పీఆర్డీ కేంద్ర కమిటీ సభ్యులు ఆర్‌.వెంకటేష్‌, సి.సాయమ్మ, జె.రాజు డిమాండ్‌ చేశారు. ఆర్టీసీ బస్సుల్లో వికలాంగులకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించాలని, పెన్షన్‌ రూ.6వేలకు పెంచి అమలు చేయాలని అన్నారు. వికలాంగుల బ్యాక్‌ లాగ్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు యశోద, ఉపేందర్‌, స్వామి, సహాయ కార్యదర్శులు గంగాధర్‌, లింగన్న, రాష్ట్ర కమిటీ సభ్యులు జయలక్ష్మి, కవిత, భాగ్యలక్ష్మి, చంద్రమోహన్‌, బాలయ్య, శశికల, భుజంగారెడ్డి, మల్లేష్‌, ప్రభుస్వామి, శేఖర్‌ గౌడ్‌, కుర్మయ్య, పాముకుంట్ల చందు, లలిత, గౌతమ్‌, యాదయ్య, రాష్ట్ర నాయకులు మంగమ్మ, ఉష, రాజు, జంగయ్య, రమేష్‌, వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img