Sunday, October 12, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంనకిలీ నోట్ల చెలామణి ముఠా గుట్టు రట్టు

నకిలీ నోట్ల చెలామణి ముఠా గుట్టు రట్టు

- Advertisement -

ఎనిమిది మంది అరెస్ట్‌..రిమాండ్‌కు తరలింపు
వివరాలు వెల్లడించిన ఎస్పీ యం.రాజేష్‌చంద్ర

నవతెలంగాణ- కామారెడ్డి
నకిలీ నోట్లను చెలామణి చేస్తున్న ముఠాను కామారెడ్డి పోలీసులు పట్టుకున్నారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యుల్లో 8 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు కామారెడ్డి జిల్లా ఎస్పీ యం.రాజేష్‌ చంద్ర తెలిపారు. శనివారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కామారెడ్డి సిరిసిల్ల రోడ్‌లో గల శ్లోక వైన్స్‌లో ఈనెల 24న క్యాషియర్‌ మేకల అఖిల్‌కు ఓ వ్యక్తి రెండు రూ.500 నోట్లు ఇచ్చి ఐకానిక్‌ విస్కీ ఫుల్‌ బాటిల్‌ కొనుగోలు చేశాడు. అయితే, ఆ నోట్లు నకిలీవని తేలడంతో బాధితుడు కామారెడ్డి పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

ఏఎస్పీ బి.చైతన్యరెడ్డి పర్యవేక్షణలో సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌, కామారెడ్డి పట్టణ ఇన్‌స్పెక్టర్‌ సారథ్యంలో ఎనిమిది బృందాలుగా ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. మొదటగా శాబ్దిపూర్‌ గ్రామానికి చెందిన సిద్ధాగౌడ్‌ను పట్టుకొని విచారించారు. నకిలీ నోట్ల గుట్టు బయటపడింది. సులభంగా డబ్బులు సంపాదించాలనుకున్న సిద్ధాగౌడ్‌ ఆన్‌లైన్‌లో వెతికి వెస్ట్‌ బెంగాల్‌కు చెందిన సౌరవ్‌ డే అనే వ్యక్తికి కాంటాక్ట్‌ అయ్యాడు. గత నెల 18న కొరియర్‌ ద్వారా సిద్ధాగౌడ్‌కు 18 నకిలీ నోట్లు పంపాడు. అందులో నుంచి రెండు నోట్లతో శ్లోక వైన్స్‌లో మద్యం కొనుగోలు చేశాడు. సిద్ధాగౌడ్‌ ద్వారా సమాచారం సేకరించిన పోలీసులు సౌరవ్‌ డేను పట్టుకోవడానికి వెస్ట్‌ బెంగాల్‌ వెళ్లారు. గత నెల 27న సౌరవ్‌ డేను పట్టుకున్నారు. హరి నారాయణ భగత్‌ అనే వ్యక్తితో కలిసి బీహార్‌కు చెందిన రషీద్‌ నుంచి నకిలీ నోట్లను కొరియర్‌ ద్వారా తెప్పించుకొని ఇతరులకు సరఫరా చేస్తున్నట్టు సౌరవ్‌ విచారణలో ఒప్పుకున్నాడు.

దాంతో సౌరవ్‌ డేను, హరి నారాయణ భగత్‌ను అదుపులోకి తీసుకొని కామారెడ్డి కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. అనంతరం పోలీసులు బీహార్‌లో రషీద్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. ఎంఎస్సీ కెమిస్ట్రీ చదువుకున్న రషీద్‌కు కలర్‌, కెమికల్‌ మిక్సింగ్‌పై మంచి అవగాహన ఉండటంతో నకిలీ కరెన్సీ నోట్లు తయారు చేసి డబ్బులు సంపాదించాలని ఆలోచించాడు. పలు రాష్ట్రాలకు చెందిన కొందరితో ముఠాగా ఏర్పడి నకిలీ నోట్లు తయారు చేసి సరఫరా చేశాడు. కాగా, ఈ కేసులో పోలీసులు 8మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దర్యాప్తులో భాగంగా నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా, సమయస్పూర్తితో వ్యవహరించిన సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, కామారెడ్డి పట్టణ ఇన్‌స్పెక్టర్‌ నరహరి, సంతోష్‌, సదాశివనగర్‌ సీఐ, ఎస్‌ఐలు జి.రాజు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -