Sunday, October 19, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్సదరంలో 'నకిలీ' దుమారం

సదరంలో ‘నకిలీ’ దుమారం

- Advertisement -

వెలుగుచూస్తున్న ఫేక్‌ వైకల్య సర్టిఫికెట్లు
పర్మినెంట్‌ ఉద్యోగులు లేకపోవటమే సమస్య
ఖమ్మంలో వైకల్యం లేకున్నా డీఈవో నకిలీ ధ్రువీకరణ
కలెక్టర్‌ సీరియస్‌.. కొత్త డేటా ఎంట్రీ ఆపరేటర్ల భర్తీకి నోటిఫికేషన్‌
రాష్ట్రంలో పలుచోట్ల ఏసీబీ వరకూ వెళ్తున్న నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం

నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి / ఖమ్మం
రాష్ట్రంలో పలుచోట్ల నకిలీ సదరం సర్టిఫికెట్లు వెలుగుచూస్తున్నాయి. ఈ డూప్లికేట్‌ వ్యవహారంలో అవుట్‌ సోర్సింగ్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్లు (డీఈవో) కీలకంగా వ్యవహరిస్తున్నట్టు బయటపడుతోంది. ఎలాంటి వైకల్యం లేకున్నా ఖమ్మంలో ఏకంగా డీఈవోనే తన పేరుతో నకిలీ వైకల్య సర్టిఫికెట్‌ను సృష్టించుకోవటం కలకలం రేపింది. ఈ నకిలీ గుట్టు బయటకు రావటంతో జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి కొద్దిరోజుల క్రితం విచారణకు ఆదేశించారు. జిల్లా మహిళా ప్రాంగణం అధికారి వేల్పుల విజేత ఎంక్వయిరీ నిర్వహించారు.

పూర్తిస్థాయి నివేదికను కలెక్టర్‌కు సమర్పించారు. సంబంధిత అవుట్‌ సోర్సింగ్‌ డీఈవోకు ఎలాంటి వైకల్యం లేకున్నా తనకు తానే డూప్లికేట్‌ సదరం సర్టిఫికెట్‌ను సృష్టించుకున్న ఉదంతం వెలుగుచూడటం పలు అనుమానాలకు తావిస్తోంది. సదరం విభాగం నిర్వహణ లోపాలకు ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. నిక్షేపంలా ఉండే ఈ డీఈవో రెండు కాళ్లూ చేతుల కండరాలు 75శాతం మేరకు కదలిక లేవని (లోకోమోటార్‌ డిజేబిలిటీ) సర్టిఫికెట్‌ను తయారు చేసుకోవటం, దాన్ని సంబంధిత డాక్టర్లు ధ్రువీకరించటం సంచలనంగా మారింది.

ఈ డీఈవోదంతా నకిలీ వ్యవహారమే..!
ఈ డీఈవోదంతా నకిలీ వ్యవహారమేనని తెలుస్తోంది. ఈయన 2015లో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యాలయం (డీఆర్‌డీఏ)లో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిగా చేరాడు. రెండు, మూడునెలలు సదరం విభాగంలో పనిచేశాడు. అప్పట్లో అక్రమాలకు పాల్పడుతుండటాన్ని గుర్తించి తొలగించారు. కొన్నిరోజుల పాటు కార్యాలయం చుట్టూ తిరిగాడు. 2015-20 వరకు సదరం విభాగంలో పనిచేసినట్టు ఫేక్‌ సర్టిఫికెట్లు సృష్టించి తిరిగి స్థానిక సంస్థల అడిషనల్‌ కలెక్టర్‌ సీసీ దగ్గర ఉద్యోగం పొందాడు. అక్కడి నుంచి పైరవీతో డీఆర్‌డీఏ సదరం విభాగం ద్వారా జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ ఏడాది మార్చిలో చేరాడు. నాటి నుంచి ఫేక్‌ సర్టిఫికెట్లు జారీ చేస్తూ రూ.లక్షల్లో కూడబెడుతున్నాడు.

డేటా ఎంట్రీ.. ఆన్‌లైన్‌ తతంగమంతా డీఈవోల చేతుల్లోనే..!
గతంలో సదరం శిబిరం నెలలో చివరి వారం నిర్వహించేవారు. తర్వాత మీసేవ ద్వారా స్లాట్‌ బుక్‌ చేసుకునేందుకు అవకాశం ఇచ్చేవారు. ఆ తర్వాత యూడీఐడీని అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనివల్ల సెల్‌ఫోన్‌, ఇంటర్నెట్‌ సహాయంతో స్లాట్‌ బుక్‌ చేసుకుంటున్నారు. ఆ తర్వాత క్యాంప్‌ తేదీ వెల్లడవుతుంది. శిబిరానికి హాజరైతే ఫిజియోథెరపిస్టులు తొలుత చెక్‌ చేస్తారు. శరీర అవయవాల కదలికలను నిర్ధారి స్తారు. ఆ తర్వాత ఆర్థో, ఈఎన్‌టీ, ఐ స్పెషలిస్టులు, మానసిక వైద్య నిపుణులు.. ఇలా కేసును బట్టి ఆయా డాక్టర్లు పరీక్షిస్తారు.

ఎంత శాతం మేరకు వైకల్యం ఉందో నిర్ధారిస్తారు. పరీక్షల అనంతరం డేటా ఎంట్రీ ఆపరేటర్లు (డీఈవోలు) ఆన్‌లైన్‌లో వివరాలు ఎంట్రీ చేస్తారు. ఎంట్రీకి ముందు ప్రింట్‌ అవుట్‌లు తీసి మెడికల్‌ బోర్డు (గవర్నమెంట్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌, పరీక్షలు నిర్వహించిన వైద్యులు, ఆర్‌ఎంవో) డాక్టర్లు సంతకాలు చేస్తారు. ఆ తర్వాత స్కాన్‌ చేసి ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. దరఖాస్తుదారులకు ఓ సర్టిఫైడ్‌ కాపీ ఇస్తారు. పింఛన్లు, ఇతరత్ర ఎలాంటి బెనిఫిట్స్‌ రావాలన్నా దరఖాస్తుదారు ఆన్‌లైన్‌లో అప్లరు చేసుకుంటే ఇంటర్నెట్‌లో చెక్‌ చేసి సర్టిఫికెట్‌ను జారీ చేసేది డీఈవోలే కాబట్టి వీరి పాత్ర కీలకంగా ఉంటుంది.

ఖమ్మంలో ఫేక్‌సర్టిఫికెట్‌ సృష్టించుకున్న డీఈవోపై విచారణ
ఖమ్మంలో ఫేక్‌సర్టిఫికెట్‌ సృష్టించుకున్న డీఈవోపై విచారణ కొనసాగుతోంది. జిల్లా మహిళా ప్రాంగణం అధికారి విజేత విచారణ నిర్వహించారు. దీనికి సంబంధించిన రిపోర్టును కలెక్టర్‌ అనుదీప్‌కు సమర్పించారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ ఈ ఫేక్‌ సర్టిఫికెట్‌ సృష్టికర్తను మాత్రం విధుల నుంచి తొలగించలేదు. మరోవైపు కొత్త డీఈవో పోస్టులు రెండింటిని భర్తీ చేసేందుకు కలెక్టర్‌ ఆదేశాల మేరకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. దీనిలో భాగంగా నిర్వహించిన పరీక్షకు సుమారు 300 మంది వరకు హాజరయ్యారు. వీరిలో 21 మందిని టైప్‌ టెస్టుకు ఎంపిక చేశారు. ప్రస్తుతం ఇద్దరు డీఈవోల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది.

ఏసీబీ వరకు వెళ్లిన ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా డీఈవోల ఉదంతం
గతేడాది డిసెంబర్‌లో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా డీఈవోల అక్రమ వ్యవహారం ఏసీబీ వరకూ వెళ్లింది. డీఈవోలు చేతివాటం ప్రదర్శించి జారీ చేసిన ఫేక్‌ సర్టిఫికెట్ల ఆధారంగా పింఛన్లు, పన్ను మినహాయింపులు, ఇతర సౌకర్యాలు పొందుతున్నట్టు స్పష్టమైంది. దీనిలో డీఆర్‌డీఏ, కరీంనగర్‌ సివిల్‌ ఆస్పత్రి వర్గాలు పరస్పరం నిందించుకున్న సందర్భాలూ ఉన్నాయి. 2011 నుంచి 2021 సంవత్సరాల మధ్యకాలంలో ఈ సర్టిఫికెట్లు జారీ అయిన విషయం వెలుగుచూసింది. నాడు ఏసీబీ డీజీ శ్రీనివాసరెడ్డి సైతం స్వయంగా దృష్టి సారించి విచారణను పర్యవేక్షించారు. ఇందులోనూ ఇద్దరు తాత్కాలిక ఉద్యోగులను తొలగించ టంతో ఈ వ్యవహారానికి తాత్కాలికంగా బ్రేక్‌ పడింది.

పర్మినెంట్‌ డీఈవోలు లేకపోవటంతోనే అవకతవకలు
దాదాపు చాలా జిల్లాల్లో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులతోనే సదరం విభాగాన్ని నిర్వహిస్తున్నారు. వీరు పర్మినెంట్‌ ఉద్యోగులు కాకపోవటంతో ఉద్యోగం ఉన్నంతకాలం కూడబెట్టుకోవాలనే ఆలోచనతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మొత్తం ఈ విభాగంలో డేటా ఎంట్రీతో పాటు ఎంక్వయిరీ, ఇతరత్ర పనుల నిమిత్తం డాక్టర్లు కాకుండా ఆరుగురు ఉద్యోగుల వరకు పనిచేస్తుంటారు.

డాక్టర్లు మినహా మిగిలిన ఆరుగురు కూడా అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కావటంతో అందరూ కుమ్మక్కై అక్రమ దందా సాగిస్తున్నట్టు చర్చ సాగుతోంది. కాబట్టి ఇప్పటికైనా జూనియర్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ స్థాయి శాశ్వత ఉద్యోగులను నియమిస్తే బాధ్యతాయుతంగా వ్యవహరించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఖమ్మం డీఆర్డీఏ సదరం విభాగం నుంచి నకిలీ సర్టిఫికెట్‌ సృష్టించుకున్న తాత్కాలిక ఉద్యోగి (డీఈవో)పై ఎన్సీఆర్డీ సంఘం జిల్లా అధ్యక్షులు నాగరాజు సైతం గత నెల జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

కలెక్టర్‌ నిర్ణయం మేరకు చర్యలు
నకిలీ సర్టిఫికెట్ల విషయమై ఓ డీఈవోపై వచ్చిన అభియోగాలపై కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు. విచారణ పూర్తయింది. నివేదికను సైతం సంబంధిత విచారణ అధికారి కలెక్టర్‌కు ఇచ్చారు. దీనిపై ఎలాంటి చర్యలు ఉంటాయో కలెక్టర్‌ నిర్ధారిస్తారు.
ఎం. నరేందర్‌, ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -