నవతెలంగాణ – మల్హర్ రావు
గత రెండుమూడు రోజులు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి ఫలితంగా చలి పంజా విసురుతోంది.కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం రాత్రి నుంచే రాష్ట్రవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, ప్రస్తుతం మరింతగా పడిపోయాయి. ఇకపై టెంపరేచర్ మరింత తగ్గే అవకాశాలున్నాయని వాతావరణ విభాగం హెచ్చరిస్తోంది. ఇదే సమయంలో ద్రోణి కారణంగా పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందనే హెచ్చరికలు జారీ అవుతున్నాయి. దీంతో ప్రస్తుత సీజన్ లో ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
కనిష్ట ఉష్ణోగ్రతలు 20 నుంచి 25 డిగ్రీల సెల్సియస్, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 29 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. ఈ నెల 9న మరింత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వాతావరణ శాఖ ప్రజలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గుండె మరియు శ్వాస సంబంధ సమస్యలతో బాధపడేవారు రాత్రివేళల్లో బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడాలని తెలిపింది. రాబోయే రోజుల్లో పలు ప్రాంతాల్లో తక్కువ ఉష్ణోగ్రతలు, పొగమంచు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున, ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.



