Sunday, March 29, 2026
E-PAPER
Homeకథఫ్యామిలీ డే!..

ఫ్యామిలీ డే!..

- Advertisement -

వేణుగోపాల్‌ ప్రతి ఉదయం లేచే ముందు నుంచే ఫోన్‌ నోటిఫికేషన్లు మోగుతూనే ఉంటాయి.
”సార్‌, ఈ ఫైల్‌ చూడాలి.”
”సార్‌, మీటింగ్‌ రీషెడ్యూల్‌ అయ్యింది.”
”క్లయింట్‌ కాల్‌కు కన్ఫర్మేషన్‌ కావాలి.”
అతను అలా పడక మీదే ఫోన్‌ చూస్తూ రోజు మొదలు పెడతాడు. నీలిమ మాత్రం వంటగదిలో గిన్నెల శబ్దం చేస్తూ లంచ్‌ బాక్స్‌లను సిద్ధం చేస్తూ ఉంటుంది.
వేణుగోపాల్‌కి ఉదయాలు చాలా గందరగోళంగా ఉండేవి. డెడ్‌లైన్‌లు, మీటింగ్‌లు, ఇవన్నీ అతని రోజును అప్పుడప్పుడూ ఊపిరాడనివ్వకుండా చేసేవి. నీలిమ మాత్రం ఇంట్లో ప్రతి రోజును పగడ్బందీగా నడిపేది. ఒకేఒక్క కొడుకు పదేళ్ళ అన్విత్‌ని స్కూల్‌కి సిద్ధం చేస్తూ, వేణుకి బ్రేక్‌ఫాస్ట్‌ పెట్టి పంపిస్తూ రోజులు గడిపేది.
అయితే హడావిడిలో ఒక చిన్న మౌనం, ఒక చిన్న దూరం, ఇద్దరి మధ్య పెరుగుతూ వచ్చేది. అది గొడవలు కాదు. కానీ మాటలు తగ్గిపోయాయి. జీవితం నిరాసక్తతగా సాగుతోంది ఆ ఇంట్లో.
ఒకరోజు నీలిమ వేణు లంచ్‌బాక్స్‌లో చిన్న నోట్‌ పెట్టింది. ”ఈ రోజు కొంచెం ముందే వచ్చేయి. మనమందరం కలిసి విందు చేద్దాం” వేణు నోట్‌ చదివాడు. త్వరగా వెళ్దామనుకున్నాడు. రోటీన్‌గా వర్క్‌ హడావిడిలో మర్చిపోయాడు. సాయంత్రం నీలిమ బయటకి చూస్తూ ”వేణు వస్తున్నాడేమో…” అని ఎదురుచూసింది.
వేణు ఆ రోజు లేట్‌ నైట్‌ వచ్చాడు. వస్తూనే ”సారీ నీలిమ మీటింగ్‌లు చాలా లేట్‌ అయ్యాయి. నోట్‌ చూసాను. కానీ…” అని సాధారణంగా మాట్లాడేశాడు. నీలిమ ఏమీ అనలేదు. కాసేపటి తర్వాత ”పర్లేదు” అనడం మాత్రమే చేసింది. కానీ అతని చూపుల్లోకి చూసినప్పుడు ఆమె కళ్ళల్లో చిన్న బాధ, అతని గమనానికి రాలేదు.
తన పని ఒత్తిడితో వేణు ఇంటి నవ్వులను, ఆడుతున్న అన్విత్‌ హడావిడిని, నీలిమ చిన్న చిన్న మాటలను కూడా మిస్‌ అవుతున్నాడు. కానీ అతనికి తన కష్టం కుటుంబం కోసం అనిపించేది. ‘ఇంకో రెండేళ్లకు మంచి పోస్ట్‌ వస్తుంది, జీవితమే మారిపోతుందనేది’ అతని నమ్మకం.
ఒక ఆదివారం ఉదయం భారీ వర్షం పడింది. అన్విత్‌ బయటకు వెళ్లలేక ”అమ్మా, నాన్న కూడా ఇంట్లోనే ఉన్నారుగా, మనం ఏదైనా ఆట ఆడదాం” అని అల్లరి చేశాడు. నీలిమ నవ్వింది. కానీ వేణు లాప్‌టాప్‌ తెరిచాడు.
”చిన్న మెయిల్‌ మాత్రమే, అంతే” అన్నాడు.
అన్విత్‌ మెల్లిగా నీలిమ చెయ్యి పట్టుకుని ”అమ్మా… నాన్న ఎప్పుడూ బిజీయే” అన్నాడు.
ఆ మాట వినగానే నీలిమ గుండె ఎక్కడో కొట్టుకుంది. ఈ మాట పిల్లల నుంచే రావడం ఒక పెద్ద సిగల్‌.
వేణు ఆ మాటల్లో ఉన్న బాధను పట్టుకోలేదు. అతను తన ఫైల్‌ల్లో మునిగిపోయాడు. నీలిమ మౌనంగా రెండు కప్పుల కాఫీ చేసింది. ఒకటి వేణుకి అందించింది, మరొకటి తానూ పట్టుకుని అక్కడే నిల్చుంది. వేణు ఆశ్చర్యంగా లాప్‌టాప్‌ మూసి ఆమెవైపు చూశాడు.
”అయ్యో… ఇంత సీరియస్‌గా ఎందుకున్నావ్‌?” అని నవ్వాడు.
కానీ నీలిమ మాత్రం నవ్వలేదు. ”వేణూ… ఇంట్లో ఉన్నప్పటికీ, చూసినట్టే లేదు నీకు.”
”నీలిమా.. నీకు తెలిసినదే కదా? పనులు… బాధ్యతలు…”
”కుటుంబం కూడా బాధ్యతే కదా?” అతను నిశ్శబ్దంగా చూసాడు.
”వేణు…” అని ఆమె నెమ్మదిగా పిలిచింది.
”హ?”
”కొన్నాళ్లుగా మనమిద్దరం నిజంగా మాట్లాడామా?” అని నీలిమ తేలికగా అడిగింది. అతను లాప్‌టాప్‌ మూసి, ఆమె వైపు తిరిగాడు.
”నీలిమా… నేను పని ఒత్తిడి కారణంగా”
”అది నాకు తెలుసు వేణు. కానీ అన్విత్‌కు మాత్రం తెలియదు. వాడికి నాన్న ముఖం కన్నా, నాన్న లాప్‌ టాప్‌ ముఖమే ఎక్కువగా కనిపిస్తోంది.” ఈ మాట వేణును కదిలించింది.
అప్పుడే అన్విత్‌ వచ్చి ”నాన్నా… ఈరోజు నాతో రేస్‌ కారు ఆడతావా?” అన్నాడు.
వేణు వెంటనే ”అన్వి… ఇంకో గంటలో వస్తా… చిన్న పని”
అంతలోనే అన్విత్‌ కోపంగా ”అదే… ఎప్పుడూ పని…” అని నెమ్మదిగా వెళ్లిపోయాడు. వేణు గుండె ఒక్కసారిగా బిగుసుకుంది. రోహిత్‌ గళం లోపల దాగిన నిరాశ అతనిని కదిలించింది.
”నువ్వు తప్పు చేస్తున్నావని చెప్పడం కాదు… కానీ నీ రోజులో మాకు స్థానం తగ్గుతోంది అనిపిస్తోంది”
ఆ మాట వేణు గుండె లోతుల వరకూ వెళ్ళింది. తను ఎన్నడూ ఆ కోణంలో ఆలోచించలేదు.
నీలిమ తన చిన్న చిన్న కలలు చెబుతూ ఉంది.
”నేను పెద్దగా ఏమీ కోరుకోను వేణు. కేవలం నీతో కలిసి బ్రేక్‌ఫాస్ట్‌ చేయడం, అన్విత్‌తో కలిసి సినిమా చూడడం, రాత్రిళ్ళు ఒకరిని ఒకరు హత్తుకుని పడుకోవడం, ఈ చిన్ని విషయాలే నాకు పెద్ద ఆనందం.”
వేణు నిశ్శబ్దంగా విన్నాడు. తాను ఎంత దూరం వెళ్లిపోయాడో మొదటిసారి స్పష్టంగా కనిపించింది.
”నీకు, అన్వికి సమయం ఇవ్వకపోతే… నేను ఏం సాధించినా వ్యర్థం” అని అతనికి ఆలోచన వచ్చింది.
”నీలిమా… నేను మారుతాను” అని అతను నెమ్మదిగా అన్నాడు. ఆమెకు అది మాటలకంటే ఒక హామీలా అనిపించింది. వేణు వెంటనే తన లాప్‌టాప్‌ మూసివేశాడు.
”ఇప్పుడే అన్విత్‌ దగ్గరకు వెళ్లి వస్తా” అంటూ అతను అన్విత్‌ రూమ్‌లోకి వెళ్లి ”హే ఛాంప్‌… నీ రేస్‌ కార్‌ రెడీనా?” అన్నాడు. అన్విత్‌ ఆశ్చర్యంగా చూసి ”నాన్నా… నీ పని…?”
”నా ఛాంప్‌ ముఖాన్ని చూడటమే నా పని” అంటుంటే… అన్విత్‌ నవ్వుతూ దూకి అతని మెడపైన పడిపోయాడు.
”నాన్నా! మనం కలిసి ఆట ఆడదాం!”
వేణు నీలిమ వైపు చూసి ”ఆర్డర్‌… మేడం?” అని సరదాగా అన్నాడు.
నీలిమ కళ్లలో చిరునవ్వు… రిలీఫ్‌.
”మనం ఏమాడబోతున్నాం చెప్పండి?” అని అడిగాడు కొడుకుని.
అన్విత్‌ ఆనందంతో కేకలు పెట్టాడు. ముగ్గురూ ఆ రోజు వారు లివింగ్‌ రూమ్‌లో చెక్కర్‌ బోర్డు, రేస్‌ ఆడారు, విండో పక్కన వర్షం చూస్తూ బజ్జీలు తిన్నారు. నీలిమ ఒక్కసారిగా ఒక విషయం గ్రహించింది. ఇంట్లో ప్రేమ ఉందంటే, దాన్ని చూపడానికి కొన్ని క్షణాలు చాలు.
ఆ రాత్రి వేణు అన్విత్‌ని నిద్రపుచ్చి వచ్చి, నీలిమ పక్కన కూర్చున్నాడు.
”ఇప్పట్నుంచి ప్రతివారం కనీసం ఒక రోజు ‘ఫ్యామిలీ డే ఉండాలి. నువ్వు ఆఫీస్‌ పనీ, నేను ఇంటిపని చేయకూడదు… ముగ్గురూ చాలా హుషారుగా రోజు గడపాలి” అంది నీలిమ.
”ఓకే” నిజాయితీగా బదులిచ్చాడు వేణు
”నిజంగా?”
”నా మనసుతో”
నీలిమ కళ్ళలోని నీరు. అది అతనికి కతజ్ఞత కాదు, నమ్మకం. తర్వాతి రోజులలో వేణు చిన్న విషయాల్నే పెద్దగా మార్చాడు. ఉదయాన్నే నీలిమతో ఒక కప్పు టీ, సాయంత్రం పిల్లలతో అరగంట ఆడటం, ప్రతి రాత్రి ఫోన్‌ దూరంగా పెట్టి కుటుంబంతో విందు, వీకెండ్‌కు చిన్న చిన్న ప్రయాణాలు.
అతనికి జీవితంలో నెమ్మదిగా ఒక మదుత్వం చేరింది. పని కూడా మరింత సర్దుబాటు అయ్యింది. అన్విత్‌ కూడా నాన్న దగ్గరికి పరుగెత్తే రోజులు వచ్చాయి.
ఒక రోజు రాత్రి అన్విత్‌ మెల్లిగా నాన్న దగ్గరకు వచ్చి ”నాన్నా… నువ్వు మళ్లీ బిజీ అయిపోతావా?” అని అడిగాడు.
వేణు ఎత్తుకుని ”ఐతేనేం… నువ్వు, అమ్మ ముందుగా మీరు. పని తర్వాత” అన్నాడు.
అన్విత్‌ చిన్న చేతులతో అతని మెడ చుట్టూ రౌండ్‌గా వేసుకుని ”నిజమా నాన్నా?” అని చెవిలో అడిగాడు.
”హనెస్ట్‌గా చెబుతున్నాను” అన్నాడు వేణు.
అన్విత్‌ ఆనందంతో హగ్‌ చేసుకున్నాడు. ఆ చిన్న వయస్సులో చెప్పలేని భావం…
”నా నాన్న ఇప్పుడు నాది” అనిపించిన సంతోషం.

మూడునెలల తర్వాత, ఒక ప్రశాంత సాయంత్రం వేణు బాల్కనీలో నిలబడి ఆకాశం చూస్తూ సినిమా పాట హమ్‌ చేస్తున్నాడు. నీలిమ అతని పక్కన నిలబడి అడిగింది ”ఇంత సీరియస్‌గా ఎందుకు చూస్తున్నావు?” అని
అతను నవ్వి ”నేను ఏం కోల్పోతున్నానో ఆలస్యంగా తెలిసింది. ఇక్కడినుంచి మిమ్మల్ని వదిలిపెట్టను” అన్నాడు నీలిమ భుజానికి తల వాల్చింది.
”మన ఇల్లంతా వెలుగులా మారిపోయింది వేణు నీ వల్ల.”
వేణు నవ్వాడు.
”ఇంటి దీపం నువ్వే నీలిమా. నేను కేవలం నా వెలుతురు తిరిగి కనుగొన్నాను”
ఆ మాటకు ఆమె గుండె వేగంగా కొట్టుకున్నది. ఇంతకాలం తర్వాత ఈ మాట వినటమే తనకు పండగలా అనిపించింది. జీవితం పెద్ద సంఘటనలు చేస్తే కాదు, చిన్న క్షణాలను పెద్దగా భావించినప్పుడు అందంగా తయారవుతుంది. వేణు- నీలిమ కుటుంబానికి అది తెలిసింది.
పిల్లల నవ్వుల్లో, భార్యాభర్తల అర్థం చేసుకునే చూపుల్లో, చిన్న చిన్న క్షణాల్లోనే పెద్ద ప్రేమ దాగి ఉంటుంది.
కుటుంబం కోసం ఇచ్చే సమయం ప్రేమకు ఇచ్చే పెద్ద బహుమతే. బిజీ జీవితం ఆగకపోయినా, మనం ప్రేమించేవారి కోసం చిన్న క్షణాలను సష్టించగలం.

– తరిగొప్పుల విఎల్లెన్‌ మూర్తి, 8008 577 834న

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -