Friday, May 16, 2025
Homeరాష్ట్రీయంపిల్లలను బలితీసుకున్న కుటుంబ కలహాలు

పిల్లలను బలితీసుకున్న కుటుంబ కలహాలు

- Advertisement -

– మేడిపల్లిలో ముగ్గురు కుమార్తెలతో చెరువులో దూకిన తల్లి
– తల్లి, చిన్న కూతురు మృతి
– ఇద్దరు పిల్లల పరిస్థితి విషమం
– గోల్కొండలో పసికందు గొంతు కోసి చంపిన తండ్రి
నవతెలంగాణ-బోడుప్పల్‌/మెహిదిపట్నం

కుటుంబ కలహాలు పసి పిల్లలను బలితీసుకుంటున్నాయి. గురువారం మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా, హైదరాబాద్‌లో జరిగిన ఘటనలు అందుకు అద్దం పడుతున్నాయి. మేడిపల్లిలో కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురైన తల్లి ముగ్గురు కుమార్తెలతో కలిసి చెరువులో దూకింది. ఈ ఘటనలో తల్లి, చిన్న కూతురు మృతిచెందారు. మరో ఇద్దరు పిల్లలను స్థానికులు కాపాడారు. అలాగే మెహిదిపట్నంలో ఓ వ్యక్తి భార్యతో గొడవపడి కూతురి గొంతు కోసి చంపాడు. ఈ రెండు ఘటనలకు సంబంధించి పోలీసులు, స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకల మండలం కన్మనూరు గ్రామానికి చెందిన లోకమని నాగరాజు-సుజాత (32) దంపతులు 15ఏండ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా నారపల్లిలోని మహాలక్ష్మిపురం కాలనీలో నివాసముంటున్నారు. నాగరాజు ఆటో నడుపుతుండగా, సుజాత చెరుకు రసం అమ్ముతుంది. వీరికి 8వ తరగతి చదివే అక్షిత, 6వ తరగతి చదివే ఉదయశ్రీ, ఒకటో తరగతి చదివే వర్షిణి(6) సంతానం. పిల్లలు నారపల్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. అయితే, ఇటీవల భార్యపై అనుమానంతో నాగరాజు తరచూ గొడవ పడుతు న్నాడు. బుధవారం పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. అయినా రాత్రంతా ఇద్దరూ గొడవ పడటంతో మనస్థా పానికి గురైన సుజాత ముగ్గురు పిల్లలతో కలిసి నారపల్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు గమనించి ఇద్దరు పిల్లలను రక్షించగాలిగారు. కానీ సుజాత, చిన్న కుమార్తె వర్షిణి నీటిలో మునిగి చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీసి గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు పిల్లలను చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి కూడా విషమంగానే ఉందని బంధువులు తెలిపారు. సుజాత బంధువులు మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పసికందు గొంతు కోసి చంపిన తండ్రి
హైదరాబాద్‌ గోల్కొండలో 14 రోజుల పసికందును తండ్రి గొంతు కోసి దారుణంగా చంపాడు. నేపాల్‌కు చెందిన జగత్‌ గోల్కొండ ప్రాంతంలోని గుల్షన్‌ కాలనీలో భార్య గౌరీతో కలిసి ఉంటున్నాడు. అక్కడే వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. దంపతులకు 14 రోజుల పసికందు ఉంది. గురువారం అతను భార్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో తీవ్ర ఆగహానికి గురైన జగత్‌ భార్య నిద్రిస్తున్న సమయంలో పసికందు గొంతు కోసి హత్య చేశాడు. నిద్రలేచిన భార్య రక్తపు మడుగులో ఉన్న బిడ్డను చూసి భయాందోళనకు గురై స్థానికుల సాయంతో పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -