– బీరువా అందజేసి పాఠశాల రుణం తీర్చుకున్న విద్యార్థులు
– జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడమే లక్ష్యంగా ఉండాలి – సర్పంచ్ నాగమణి
నవతెలంగాణ – అశ్వారావుపేట
జీవితంలో ఉన్నత స్థితికి చేరుకునే విధంగా ప్రతి విద్యార్థి లక్ష్యంతో విద్యను అభ్యసించాలని నారంవారిగూడెం సర్పంచ్ మనుగొండ నాగమణి సూచించారు. పీఎం శ్రీ ప్రాథమికోన్నత పాఠశాల నారంవారిగూడెం లో ప్రధానోపాధ్యాయులు పున్నం చంద్రశేఖర్ రావు అధ్యక్షతన నిర్వహించిన 8 వ తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఒక పాఠశాలలో కొంతకాలం చదివిన తర్వాత ఉన్నత చదువుల కోసం మరో పాఠశాలకు వెళ్లడం సహజమని, కొత్త పాఠశాలలో కూడా నారంవారిగూడెం విద్యార్థులు ప్రతిభ చూపాలని ఆమె ఆకాంక్షించారు. అనంతరం పాఠశాల ఏఏపీసీ ఛైర్మన్ తట్టుకోళ్ళ బసవమ్మ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణను కలిసి పాఠశాలకు అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు మంజూరు చేయించేలా కృషి చేస్తానని తెలిపారు. అలాగే బీసీ కాలనీకి చెందిన పిల్లలందరూ ఈ పాఠశాలలోనే చేరేలా ప్రయత్నాలు చేస్తానని హామీ ఇచ్చారు.
ప్రధానోపాధ్యాయులు పున్నం చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన 7వ తరగతి విద్యార్థులను అభినందించారు. పాఠశాలకు బీరువా అందజేసిన 8వ తరగతి విద్యార్థులను ప్రత్యేకంగా ప్రశంసిస్తూ, వారు చేరే తదుపరి పాఠశాలలో బాగా చదివి నారంవారిగూడెం పేరు నిలబెట్టాలని కోరారు. ఈ సందర్భంగా ముందస్తు బడిబాట కార్యక్రమ కరపత్రాలను సర్పంచ్, ఏఏపీసీ ఛైర్మన్, ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు ఆవిష్కరించారు.
వీడ్కోలు కార్యక్రమంలో 8వ తరగతి విద్యార్థినులు భావోద్వేగానికి గురై ఈ పాఠశాలను విడిచి వెళ్లలేమని, 9వ మరియు 10వ తరగతులను కూడా ఇక్కడే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సర్పంచ్‌ను కోరారు. దీనిపై సర్పంచ్ నాగమణి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
తరువాత విద్యార్థులు కేక్ కట్ చేసి ఆటపాటలతో కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. 7వ తరగతి విద్యార్థులు 8వ తరగతి విద్యార్థులకు విందు భోజనం ఏర్పాటు చేయగా, 8వ తరగతి విద్యార్థులు తమ గురువులను ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు బండి శ్రీనివాసరెడ్డి, రేణుక, కొచ్చర్ల శ్రీనివాసరావు, ఆశిక్ ఆలమ్, సోయం రవిబాబు, మంగమ్మ, రజని కవిత, ఉషారాణి, మణిరత్నం, సిమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.



