– ప్రభుత్వ లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలు
– ఘట్‌కేసర్ స్మృతి వనంలో దహనసంస్కారాలు
– పాడె మోసిన సీఎం రేవంత్‌రెడ్డి
– హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు
– వేలాదిగా తరలివచ్చిన అభిమానులు
నవతెలంగాణ- సిటీబ్యూరో /ఘట్‌కేసర్
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ అంత్యక్రియలు మంగళవారం పూర్తయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో పోలీసుల గౌరవ వందనం మధ్య అంతిమసంస్కారాలు నిర్వహించారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పక్కనున్న స్మృతివనంలో నిర్వహించిన అంతిమ సంస్కారాలకు సీఎం రేవంత్‌రెడ్డితోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, సాహితీప్రియులు అక్షర యోధునికి కడసారి వీడ్కోలు పలికారు. అందెశ్రీ పాడెను ముఖ్యమంత్రి, పలువురు మోశారు. అందెశ్రీ గుండెపోటుతో సోమవారం మృతిచెందగా, ఆయన అంతిమ యాత్ర మంగళవారం లాలాపేట జయశంకర్ స్టేడియం నుంచి తార్నాక, ఉప్పల్ మీదుగా ఘట్‌కేసర్ మున్సిపాల్టీలోని ఎన్‌ఎస్‌పీ నగర్‌లో అందెశ్రీ నూతనంగా నిర్మించుకుంటున్న ఇంటి వరకు సాగింది. అంబేద్కర్ కూడలి వద్ద రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు. అక్కడి నుంచి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ఉన్న స్మృతి వనం వరకు అంతిమయాత్ర సాగింది. అందెశ్రీ సతీమణి మల్లుబాయి, కుమార్తెలు వాక్కులమ్మ, వెన్నెల, వేకువ, కుమారుడు దత్తు దహనసంస్కారాలు నిర్వహించారు.
అందె శ్రీ పేరుతో స్మృతి వనం ఏర్పాటు : సీఎం రేవంత్‌రెడ్డి
ప్రముఖ కవి, రచయిత అందె శ్రీని కోల్పోవడం తెలంగాణకు తీరని నష్టమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అందె శ్రీ అంత్యక్రియల్లో పాల్గొన్న అనంతరం సీఎం మాట్లాడారు. తన గళాన్ని, కలాన్ని తెలంగాణ సమాజానికే అంకితమిచ్చిన అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. అందెశ్రీ పేరుతో స్మృతివనం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆయన రచించిన ‘జయ జయహే తెలంగాణ’ పాట తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి నింపిందనీ, ఈ పాటను రాష్ట్ర గీతంగా గుర్తించామని తెలిపారు. ఈ పాటను పాఠ్యాంశంలో చేర్చేందుకు మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అలాగే, ఆయన పాటల సంకలనం ”నిప్పుల వాగు” ఒక భగవద్గీతగా, బైబిల్‌గా, ఖురాన్‌గా తెలంగాణ సమస్యలపై పోరాడే వారికి గైడ్‌గా ఉపయోగపడుతుందని తెలిపారు. 20వేల నిప్పుల వాగు పుస్తకాలను ముద్రించి తెలంగాణలోని ప్రతి లైబ్రరీలో అందుబాటులో ఉంచు తామన్నారు. ఆయన రచనలను పుస్తకరూపంలో తీసుకొచ్చి అన్ని లైబ్రరీల్లో ఉండేలా చర్యలు తీసుకుంటామనీ, అందెశ్రీ పేరు, స్ఫూర్తి శాశ్వతంగా ఉండేలా చూస్తామని తెలిపారు.
అందెశ్రీ పాట, మాట గొప్ప స్పూర్తినిచ్చిందనీ, ఎన్నో సందర్భాల్లో ఇద్దరం కలిసి అనేక కీలక అంశాలపై చర్చించామని గుర్తు చేసుకున్నారు. గద్దర్‌తో పాటు అందెశ్రీ తెలంగాణ ఉద్యమానికి ఎంతో బలాన్నిచ్చారన్నారు. అందెశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని గతేడాది కేంద్రానికి లేఖ రాశామన్నారు. ఈ ఏడాది కూడా మరోసారి లేఖ రాస్తామనీ, అందెశ్రీకి పద్మశ్రీ గౌరవం దక్కేలా కేంద్రమంత్రులు బండి సంజరు, కిషన్‌రెడ్డి సహకరించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలుగా అందెశ్రీని పద్మశ్రీతో గౌరవించుకునేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
అంత్యక్రియల్లో ప్రముఖులు
అందెశ్రీ అంతక్రియల్లో రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, ధనసరి అనసూయ సీతక్క, పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్ గౌడ్, సీనియర్ నాయకులు కె.కేశవరావు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కోదండరాం, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ ఎంపీ హనుమంతరావు, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మెన్ నగరిగారి ప్రీతం, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మెన్ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) రాధిక గుప్తా, ప్రజా గాయకులు ఏపూరి సోమన్న, విమలక్క, అశోక్, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు పద్మజ, గద్దర్ కూతురు వెన్నెల, సాంస్కృతికశాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, కీసర ఆర్డీవో వెంకట ఉపేందర్‌రెడ్డి, ఘట్‌కేసర్ తహసీల్దార్ చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ రాజేష్, మాజీ మున్సిపల్ చైర్మెన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, బోయపల్లి కొండల్ రెడ్డి, మాజీ ఎంపీపీలు బండారు శ్రీనివాస్ గౌడ్, ఏనుగు సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అక్షరయోధునికి కడసారి వీడ్కోలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



