నమీబియాపై 102 పరుగులతో పాక్ గెలుపు
కొలంబో : ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్-ఏ నుంచి పాకిస్తాన్ సూపర్8కు అర్హత సాధించింది. దీంతో గ్రూప్ దశలో టాప్-2 రేసు బుధవారంతో ముగిసింది. ఇతర గ్రూప్‌ల నుంచి సూపర్8 బెర్త్‌లు ఇప్పటికే ఖరారైన సంగతి తెలిసిందే. బుధవారం కొలంబోలో జరిగిన మ్యాచ్‌లో నమీబియాపై 102 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. పాకిస్తాన్ తొలుత నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 199 పరుగులు చేసింది.
ఓపెనర్ ఫర్హాన్ (100 నాటౌట్, 58 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ సెంచరీతో చెలరేగాడు. సల్మాన్ ఆగా (38, 23 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), షాదాబ్ ఖాన్ (36 నాటౌట్, 22 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) రాణించారు. 200 పరుగుల ఛేదనలో నమీబియా 17.3 ఓవర్లలో 97 పరుగులకు కుప్పకూలింది. పాక్ స్పిన్నర్ ఉస్మాన్ తారీఖ్ (4/16), షాదాబ్ ఖాన్ (3/19) మాయజాలం చేశారు. నమీబియా జట్టులో లారెన్ (23), అలెగ్జాండర్ (20) ఫర్వాలేదనిపించారు. సెంచరీతో మెరిసిన ఫర్హాన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.



