ఆస్తుల విభజన నుంచి మానవ వనరుల వరకు ప్రణాళిక
ఆస్కీ విద్యుత్ నిపుణులతో సంస్థ ప్రత్యేక సమావేశం
జూన్ 2న పూర్తి స్థాయిలో ప్రారంభం
ఏర్పాట్లు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఆర్‌పీడీసీఎల్) నిర్మాణ ప్రణాళిక దాదాపు ఖరారైంది. డిస్కమ్ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు గురువారం హైదరాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కి)లో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. రైతు డిస్కం ఉన్నతాధికారులు, ఆస్కి విద్యుత్ విభాగానికి చెందిన నిపుణులు, పాలసీ, నిర్వహణ రంగాల్లో అనుభవజ్ఞులు పాల్గొని సంస్థ నిర్మాణానికి సంబంధించిన వ్యూహాత్మక అంశాలపై లోతైన చర్చలు జరిపారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు, విధానాలు, ఉత్తర్వులకనుగుణంగా నిర్మాణం కొనసాగుతున్నట్టు అభిప్రాయపడ్డారు. ఆస్తుల విభజన, మానవ వనరుల సమకూర్పు, నిర్వహణ విధానం, గైడ్‌లైన్స్ అండ్ గవర్నెన్స్, వినియోగదారుల వ్యవహారాలపై సమగ్రంగా చర్చించి రోడ్ మ్యాప్‌ను సిద్దం చేశారు.
ఆస్తుల విభజన
ప్రస్తుత విద్యుత్ పంపిణి సంస్థల నుంచి రైతు డిస్కంకు బదిలీ చేయాల్సిన ఆస్తుల గుర్తింపు, విలువ నిర్ణయం, పారదర్శకంగా విభజన చేపట్టే విధానాలపై చర్చించారు. సాంకేతిక, ఆర్థిక పరమైన ప్రభావాలను కూడా సమీక్షించారు. కొత్త డిస్కం పరిధిలోకి రూ.4,929 కోట్ల ఆస్తులు, 29,05,779 వ్యవసాయ పంపుసెట్లు, 489 ఎత్తిపోతల పథకాల కనెక్షన్లు, 99 వాటర్‌బోర్డులు, 1,132 మిషన్ భగీరథ కనెక్షన్లు బదిలీ కానున్నట్టు ప్రాథమికంగా నిర్దారించారు. రెండు డిస్కంల పరిధిలో 5,22,479 వ్యవసాయ డీటీఆర్‌లు ఉండగా, 2,61,240 కిలోమీటర్ల మేర వ్యవసాయ ఎల్‌టీ(లోటెన్షన్) లైన్లు ఉన్నాయి. డీటీఆర్‌ల ఖరీదు రూ.2,792 కోట్లు కాగా, ఎల్‌టీ లైన్ల విలువ రూ.2,137 కోట్లుగా ఉంటుంది. కొత్త డిస్కం పరిధిలోని ప్రతి డీటీఆర్‌కు స్మార్ట్‌మీటర్ బిగించనున్నారు.
మానవ వనరుల సమకూర్పు
ఉద్యోగుల కేటాయింపు, నైపుణ్యాల ఆధారంగా విభజన, అవసరమైన సిబ్బంది నియామకం, శిక్షణా కార్యక్రమాలు, సేవా నిబంధనల రూపకల్పనపై మార్గదర్శకాలు రూపొందించారు. కొత్త డిస్కం నిర్వహణ కోసం రెండు డిస్కంల పరిధిలో ఉన్న విద్యుత్ సిబ్బందిని విభజించి 2వేల మందిని కొత్త డిస్కంకు కేటాయిస్తారు. ఇందులో 660 మంది ఇంజనీర్లు, 1,000 మంది ఆపరేషన్, మెయింటెనెన్స్ సిబ్బంది, 340 మంది పాలనాపరమైన సిబ్బంది ఉంటారు. రెండు డిస్కంల నుంచి కేటాయించిన సిబ్బందితో పాటు సంస్థ నిర్వహణకు అవసరమైన అధికారులు, సిబ్బందిని ప్రత్యక్ష నియామకాలు లేదా అవుట్‌సోర్సింగ్ విధానం ద్వారా సమకూర్చుకుంటారు.
వినియోగదారుల వ్యవహారాలు
వ్యవసాయ, నీటి పారుదల, వాటర్ వర్క్స్ ఇతర వినియోగదారులను వేరు చేసి రైతు డిస్కంకు అనుసంధానం చేసే ప్రక్రియ, డేటా సమీకరణ, ఖచ్చితమైన వినియోగదారుల డేటాబేస్ తయారీ, సేవల సరళీకరణపై చర్చించారు. రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు(ఎల్‌ఐఎస్), కాంపోసిట్ ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్స్ (సీపీడబ్ల్యూఎస్), మిషన్ భగీరథ నీటి సరఫరా వ్యవస్థలు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు (హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ) పరిధిలోని కనెక్షన్లు, డీటీఆర్ కేటగిరీ పరిధిలోని మున్సిపల్ నీటి సరఫరా కనెక్షన్లు కొత్త సంస్థ పరిధిలోకి రానున్నాయి.
నిర్వహణ విధానం
సంస్థ పరిపాలన నిర్మాణం, ఫీల్డ్ స్థాయి అమలు వ్యవస్థ, సాంకేతిక మద్దతు, మరియు సేవల డెలివరీలో పారదర్శకత, సమర్థత పెంపుపై దృష్టి సారించారు. సంస్థ కార్యకలాపాలు సక్రమంగా సాగేందుకు అవసరమైన విధాన పత్రాలు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్‌వోపీఎస్), మరియు బాధ్యతల విభజనపై స్పష్టత తీసుకొచ్చారు.
జూన్ 2 నాటికి డిస్కం ప్రారభం : సీఎండీ ముషారఫ్ ఫరూఖీ
రైతు డిస్కం పూర్తి స్థాయిలో జూన్ 2 నుంచి ప్రారంభమవుతుందని సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. ఆస్తుల విభజన, మానవ వనరుల కేటాయింపు ప్రక్రియలను ఈ నెలాఖరులోగా పూర్తి చేయడానికి చర్యలు ప్రారంభించినట్టు తెలిపారు. అదేవిధంగా వినియోగదారుల విభజన, డేటా సమీకరణ, ఉద్యోగుల కూర్పు వంటి అన్ని కీలక ప్రక్రియలను గడువులోగా పూర్తి చేయనున్నట్టు పేర్కొన్నారు.
జెన్కోలో పని చేసే ఆర్టీజన్లపై ఎస్మా?
రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో సమ్మె ప్రభావం తీవ్రంగా ఉండటంతో సర్కార్ తీవ్రంగా పరిగణిస్తోంది. మొదటి దశలో తెలంగాణ జెన్కోలో ఎస్మా ప్రయోగించాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఎస్మా ప్రయోగానికి సంబంధించిన సర్క్యూలర్‌ను జెన్కో బుధవారం జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం సమ్మె ఓ కొలిక్కి రాకుంటే తెలంగాణ పవర్ యుటిలిటీస్, పారిశ్రామిక వివాదాల చట్టం, 1947లోని సెక్షన్ 2, క్లాజ్ (4)యొక్క సబ్-క్లాస్ (ఎన్) ప్రకారం చర్యలు తీసుకునేందుకు సర్కార్ ఆలోచిస్తోంది.



