ఈనెల 5 న మధిరలో బాధిత రైతుల సమావేశం
తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు
నవతెలంగాణ – బోనకల్
సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజ్ బాధిత రైతులకు వెంటనే నష్టపరిహారం అందించి ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోనే మధిర మండల పరిధిలోని ఆత్మకూరు వద్ద మార్చి 21న ప్రమాదవశాత్తు సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజ్ దగ్ధమైంది. కోల్డ్ స్టోరేజీ దగ్ధం కావడం వల్ల రైతులందరూ తీవ్రంగా నష్టపోయారని, బాధిత రైతులకు వెంటనే ఇన్సూరెన్స్, నష్టపరిహారం ఇప్పించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం మధిర తహసిల్దార్ రాళ్లబండి రాంబాబుకి బుధవారం వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజీలో 350 మంది రైతులకు సంబంధించి సుమారు 32,000 మిర్చి బస్తాలను భద్రపరుచుకున్నారన్నారు. కోల్డ్ స్టోరేజీ దగ్ధం కావడంతో అనేకమంది సన్న చిన్న కారు రైతులు తీవ్రంగా నష్టపోయారు అన్నారు. ఇందులో అనేకమంది తమ కుమార్తెల వివాహం కోసం మిర్చి బస్తాలను భద్రపరుచుకున్నారన్నారు. ఓల్డ్ స్టోరేజ్ దగ్ధం కావడంతో ఆ రైతుల పరిస్థితి నేడు దయనీయంగా తయారయింది అన్నారు. సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజీలో నష్టపోయిన రైతులకు వెంటనే భీమా ఇన్సూరెన్స్ అందించాలని, దీనికోసం అధికారులు,ఇన్సూరెన్స్ కంపెనీలు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వందలాది మంది రైతులు కోల్డ్ స్టోరేజీ దగ్ధం కావడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులు కుటుంబాలలో తమ పిల్లల పెళ్లిళ్లు, హాస్పిటల్ ఖర్చులు, వ్యవసాయానికి అధిక వడ్డీలకు అప్పులు చేసి ఉన్నారని దీని ద్వారా రైతులు ఆందోళన చెందుతున్నారని, సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే వెంటనే చర్యలు తీసుకొని నష్టపరిహారం త్వరగా అందించాలని కోరారు. ఈనెల 5వ తేదీన ఉదయం 10 గంటలకు మధిరలో సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజ్ ద్వారా నష్టపోయిన రైతుల సమావేశం ఉదయం పది గంటలకు మధిర లో నిర్వహించనున్నామని ఈ సమావేశానికి బాధిత రైతులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన కోరారు.
ఈ సమావేశానికి వచ్చేటప్పుడు బాధిత రైతులు బాండు, ఆధార్ కార్డు జిరాక్స్లను తీసుకొని హాజరుకావాలని కోరారు. సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజీ ద్వారా నష్టపోయిన రైతులకు ప్రత్యేక విపత్తుగా భావించి ప్రభుత్వం కొంత ఆర్థిక సహాయం అంద చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం మధిర కార్యదర్శి డివిజన్ దొండపాటి నాగేశ్వరరావు, తెలంగాణ రైతు సంఘం నాయకులు దివ్వెల వీరయ్య, వ్యవసాయ కార్మిక సంఘం మధిర డివిజన్ కార్యదర్శి పాపినేని రామ నరసయ్య, సిఐటియు నాయకులు పడకండి మురళి, బాధిత రైతులు, తదితరులు పాల్గొన్నారు.



