Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుఅనాజ్‌పూర్‌ భూమి కోసం రైతుల ఆందోళన

అనాజ్‌పూర్‌ భూమి కోసం రైతుల ఆందోళన

- Advertisement -

– మద్దతిచ్చిన సీపీఐ(ఎం) ధర్నాలో పాల్గొన్న జాన్‌వెస్లీ, యాదయ్య
– భూమి వద్దకెళ్తున్న నాయకులను అరెస్టు చేసిన పోలీసులు ఉద్రిక్తత, తోపులాటలు
– సీలింగ్‌ భూ బాధిత రైతులకు న్యాయం చేయాలి
– సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తాం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్‌ మెట్‌

న్యాయం కోసం పోరాడుతున్న సీలింగ్‌ భూ బాధితుల పట్ల రెవెన్యూ అధికారులు వ్యవరిస్తున్న తీరు బాధాకరమని, రైతులకు న్యాయం చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ప్రభుత్వాన్ని కోరారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం అనాజ్‌పూర్‌ గ్రామ రెవెన్యూ సర్వే నెం.274, 275, 276, 277, 278, 281లో 125 మందికి పాసు బుక్కులు ఇవ్వాలనే డిమాండ్‌తో సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. రైతులకు సీపీఐ(ఎం) అండగా నిలిచింది. వారికి మద్దతుగా ఆందోళనలో పాల్గొంది. జాన్‌వెస్లీతోపాటు సీపీఐ(ఎం) నేతలు తదితరులు పాల్గొన్నారు.ధర్నా అనంతరం భూమిని పరిశీలించేందుకు వెళ్తున్న జాన్‌వెస్లీతోపాటు నాయకులు, రైతులను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో తీవ్ర ఉద్రిక్తత, ఘర్షణ వాతావరణం నెలకొంది. అరెస్టు చేస్తున్న క్రమంలో తోపులాట జరిగింది. ఒకరినొకరు నెట్టుకున్నారు. వాగ్వాదాలు జరిగాయి. నాయకులను ఈడ్చుకెళ్లి వాహనాల్లోకి ఎక్కించారు. అనంతరం కొంతమందిని పహాడీషరీఫ్‌ పోలీస్‌ స్టేషన్‌కు, మరికొంత మందిని అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్టయిన వారిలో జాన్‌వెస్లీ, జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నరసింహ, గుండె శివకుమార్‌, ముత్యాలు, బాలరాజు మహేష్‌, రాములు, రంగయ్య, రవి ఎలకపల్లి మహేష్‌, బాలరాజ్‌, కట్ట సత్తయ్య ఉన్నారు. వారిని సాయంత్రం విడిచిపెట్టారు.


అంతకుముందు జాన్‌వెస్లీ రైతులనుద్దేశించి ప్రసంగించారు. స్థానిక రైతులకు 125 ఎకరాల భూమిని 1991లో సీలింగ్‌ పట్టాలిచ్చారన్నారు. రైతులు ఆ భూమిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నారని తెలిపారు. అయితే, తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం ధరణిలో రైతుల భూవివరాలు నమోదు చేయకుండా కొత్త పాసుబుక్కులు ఇవ్వలేదన్నారు. ఈ విషయంపై కొంతకాలంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రైతులు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ, స్థానిక తహసీల్దార్‌ దృష్టికి తీసుకెళ్లినా న్యాయం జరగలేదన్నారు. ఇక్కడ భూముల ధరలు కోట్లకు పరుగెత్తడంతో బడా రియల్‌ వ్యాపారుల కన్ను ఆ భూమిపై పడిందన్నారు. రెవెన్యూ అధికారులు కూడా వారివైపే మొగ్గు చూపడంతో బాధితులకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్లే సమస్య ఇంతవరకు వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే భూబాధిత రైతులు గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట శాంతియుత ఆందోళనకు దిగినట్టు చెప్పారు. వారికి సీపీఐ(ఎం) అండగా నిలిచిందన్నారు. ఈ రైతుల సమస్యను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.


సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఖండన
రైతులకు అండగా నిలిచిన సీపీఐ (ఎం) నాయకుల పట్ల పోలీసులు వ్యవరించిన తీరు, అక్రమ అరెస్టులను పార్టీ రంగారెడ్డి జిల్లా కమిటీ ఖండించింది. అక్రమ అరెస్టులకు భయపడేదిలేదని స్పష్టం చేసింది. రైతులకు పట్టా పాస్‌ బుక్కులు వచ్చేవరకు భూ పోరాటం కొనసాగుతుందని పేర్కొంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad