Saturday, November 22, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరైతు భరోసా లేదు.. వడ్ల బోనస్‌ రాలేదు

రైతు భరోసా లేదు.. వడ్ల బోనస్‌ రాలేదు

- Advertisement -

రైతుసంఘం కేంద్ర కమిటీ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్‌
కంచెనపల్లి పీఏసీఎస్‌ ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన


నవతెలంగాణ-నల్లగొండటౌన్‌
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సకాలంలో రైతు భరోసా ఇవ్వకుండా కాలయాపన చేయడంతోపాటూ వడ్ల బోనస్‌ కూడా అందించలేదని రైతు సంఘం కేంద్ర కమిటీ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్‌ అన్నారు. నల్లగొండ మండలంలోని కంచెనపల్లి పీఏసీఎస్‌ ధాన్యం కొనుగోలు సెంటర్‌ను శుక్రవారం వారు పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రాష్ట్రంలో వరి తర్వాత పత్తి సాగు ఎక్కువగా ఉందన్నారు. సీపీఐ కొనుగోలు కేంద్రాలను కాటన్‌ మిల్లుల వద్ద ఏర్పాటు చేయడంతో దళారుల జోక్యం పెరిగిందని చెప్పారు. సీసీఐ నిబంధనలు, కపాస్‌ ఆన్‌లైన్‌ రిజిస్టర్‌, తేమ పేరుతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అకౌంట్‌లో డబ్బులు పడితే బ్యాంకు వారు అప్పు కింద జమ చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చి వారం రోజులవుతున్నా బస్తాలు రాకపోవడం, కాంటాలు కాకపోవడంతో పట్టాల ఖర్చులు పెరిగిపోతున్నాయన్నారు. యాసంగి వడ్ల బోనస్‌ ఇంతవరకు అందలేదని, ఇప్పుడు ఇస్తానన్న బోనస్‌ ఎప్పటికి అందుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు.

రైతు భరోసా ఇవ్వకపోవడంతో ప్రయివేట్‌ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తూ అదనపు వడ్డీలకు తెచ్చుకుంటే.. పంట నష్టాలతో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సాగులో ఎకరానికి రూ.40 వేలు ఖర్చు వస్తున్నా దిగుబడి మాత్రం రూ.30 వేల నుంచి రూ.35 వేలు మాత్రమే వచ్చిందన్నారు. కౌలురైతులు ఎకరానికి రూ.30వేలు నష్టపోయారన్నారు. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. రైతులకు గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని పంట నష్టపరిహారాన్ని అంచనా వేసి వెంటనే ఎకరానికి రూ.50 వేలివ్వాలని డిమాండ్‌ చేశారు. స్వామినాథన్‌ కమిటీ సిఫారసులు అమలు చేసి రైతులను ఆదుకోవాలని, బకాయిగా ఉన్న రైతుభరోసా, బోనస్‌లను విడుదల చేయాలని కోరారు. కౌలు రైతులకు కూడా గుర్తింపు కార్డులు ఇచ్చి రైతు భరోసా పెట్టుబడి సాయం అందించాలని డిమాండ్‌ చేశారు. ఈ పర్యటనలో రైతుసంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, కందాల ప్రమీల, నాయకులు కుంభం కృష్ణారెడ్డి, అశోక్‌రెడ్డి, నర్సింహా, మధు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -