Tuesday, August 5, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిరైతు బాంధవుడు 'బోడేపూడి'

రైతు బాంధవుడు ‘బోడేపూడి’

- Advertisement -

బోడేపూడి వెంకటేశ్వరరావు. ఈపేరు వినగానే అచ్చతెలుగు పంచకట్టు, భుజాన కండువా, ఆరడుగుల ఆయన రూపం మదిలో ప్రత్యక్షమవుతాయి. ఇంకా చెప్పాలంటే ‘బాబు బాగున్నావా’ అప్యాయమైన పిలుపు స్ఫురణకు వస్తుంది.నిరుపేద కుటుంబంలో పుట్టి, పాలేరుగా పనిచేసి, బడి పంతులుగా జీవితాన్ని ప్రారంభించారు. కళాకారునిగా, గాయకునిగా, కమ్యూనిస్టుగా అంచలంచలుగా ఎదిగారు. సీపీఐ (ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యునిగా, రైౖతు సంఘం అధ్యక్షునిగానూ పనిచేశారు. మధిర శాసనసభకు ఎన్నికై ప్రజా ప్రతినిధిగానూ సేవలందించారు. మార్కిస్టు పార్టీ నేతగా, శాసన సభాపక్ష నాయకునిగా అసెంబ్లీలో తన వాణి వినిపించారు. వ్యవసాయ కార్మికులు, రైతులు, చిరు వ్యాపారులు, మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగ వర్గాల ఆదరాభిమానాలు చూరగొన్నారు.
22ఏప్రిల్‌ 1922లో ఖమ్మం జిల్లా తండాల గోపవరం గ్రామంలో జన్మించిన ఆయన తమ గ్రామానికి చెందిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు ఖాజా రాధాకృష్ణమూర్తి సూచనతో పాఠశాల ప్రారంభించి విద్యావ్యాప్తికి కృషిచేశారు, వైరాలో కమిటీ స్కూల్స్‌, మధిర తొలిశాసనసభ్యులు కోండబోలు వెంకయ్య జ్ఞాపకార్థం కెవిసియం డిగ్రీ కళాశాల ఏర్పాటుకు పాటుపడ్డారు. వైరా విశాల పరపతి సంఘం అభివృద్ధికి తన శాయశక్తులా కృషిచేశారు. నేడు ఆ సంఘానికి ఇరవై కోట్ల రూపాయలు విలువైన భూములు ఉన్నాయంటే అదంతా బోడేపూడి కృషియే. వైరా రిజర్వాయర్‌, నాగార్జున సాగర్‌ ఆయకట్టు పరిధిలో చివరి భూములకు సాగు నీరందించేందుకు నిరంతరం తపించారు. ప్రధాన కెనాల్స్‌తో పాటు, మేజర్‌, మైనర్‌ కాలువలపై పూర్తి అవగాహనతో ఇరిగేషన్‌ అధికారులను సమర్థవంతంగా పనిచేయించారు. గిట్టుబాటు ధరలు, ప్రభుత్వ సబ్సిడీ, బ్యాంకు రుణాలు, పరిహారం, నాణ్యమైన విత్తనాల కోసం, దళారులు మార్కెట్‌ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడి రైతు బాంధవుడుగా కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్నారు. ప్రజల అనారోగ్యం, జబ్బులకు కారణం సరైన మంచినీళ్లు లేకపోవడమేనని గుర్తించి 1995లోనే వైరా రిజర్వాయర్‌పై సుజల స్రవంతి పథకం ప్రారంభించడానికి చంద్రబాబు ప్రభుత్వాన్ని ఒప్పించిన భగీరథుడు. సాంస్కృతిక రంగంలో ముఖ్యంగా సంస్కృత ప్రావీణ్యం సంపాదించి శ్లోకాలు చదివి తెలుగులో విడమర్చి చెప్పేవారు. కొన్ని వందల సంఖ్యలో వేదికలపై దండల వివాహాలు జరిపి అభ్యుదయ భావాల ఆలోచన కల్పించారు. ప్రజానాట్యమండలి, మహిళ సంఘాల నిర్మాణంలో ప్రత్యక్ష భాగస్వాముల య్యారు.
నేడు ప్రజలను నిలువెత్తు ఆవరించిన మతోన్మాద భావజాలం నుంచి బయటపడాలంటే సాంస్కృతిక, భావజాల రంగంలో కమ్యునిస్టుల కృషి మరింత అవసరం. సనాతన సంప్రదాయ పద్ధతుల్లోకి పోకుండా ప్రజలను శాస్త్రీయ విజ్ఞానం వైపు మరలించాలి. మరోవైపు వ్యవసాయంలోకి బహుళ జాతి కంపెనీల విదేశీ పెట్టుబడులు ప్రవేశిస్తూ రైతు ఉనికినే ప్రశ్నార్థం చేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మన దేశం దిగుమతులపై సుంకాలు విధించడం ద్వారా భారత ప్రభుత్వాన్ని లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను భారత మార్కెట్లో తక్కువ ధరలకు విక్రయించేం దుకు వాణిజ్య ఒప్పందం కోసం తహతలాడు తున్నాడు. ఈ సమయంలో వ్యవసాయ రంగ పరిరక్షణకు, రైతుల మనగడకు విశాల ఐక్యతతో బోడేపూడిని స్ఫూర్తిగా తీసుకుని రైతాంగ ఉద్యమాల నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉన్నది. ప్రజా పోరాటాలు, కమ్యూనిస్టు ఉద్యమం బాహుళ సవాల్‌ ఎదుర్కొంటున్న నేటి పరిస్థితుల్లో బోడేపూడి లాంటి కమ్యూనిస్టు యోధుల కాలంలో నాటి సామాజిక పరిస్థితుల్లో మార్పుకోసం, వర్గ, సామాజిక పోరాటాలు నిర్వహించి ప్రజల ఆదరణ పొందిన తీరు అధ్యయనం చేయాలి. ఈ ప్రాంతంలో సకల జనుల ప్రయోజనాలకై ఇతర పార్టీల ప్రతినిధులు, పెద్దలను కలుపుకుని చిత్తశుద్ధి, నిజాయితీతో బోడేపూడి వేసిన అభివృద్ధి బాటలు తెలుసుకోవాలి.
– బొంతు రాంబాబు, 9490098205
(నేడు బోడేపూడి 28వ వర్థంతి)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -