Wednesday, August 27, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంయూరియా కోసం అన్నదాతల ఆందోళనలు

యూరియా కోసం అన్నదాతల ఆందోళనలు

- Advertisement -

– రోడ్డెక్కి నిరసనలు, ధర్నాలు
– పీఏసీఎస్‌ల వద్ద పడిగాపులు


నవతెలంగాణ-విలేకరులు
పత్తి, మొక్కజొన్న, వరి, కంది తదితర పంటలను రక్షించుకునేందుకు రైతులు పడరానిపాట్లు పడుతున్నారు. పంటలకు యూరియా చల్లేందుకు రైతులు అన్ని పనులు వదిలేసుకొని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్‌) కేంద్రాల వద్ద పడిగాపులుకాస్తున్నారు. తెల్లవారుజాము నుంచే పీఏసీఎస్‌ కేంద్రాల వద్ద నిల్చున్నా యూరియా అందడం లేదు. రాష్ట్రానికి యూరియాను పంపాల్సిన కేంద్రం పట్టించుకోవడం లేదు. అధికారులు మాత్రం వినాయకచవితి పండుగ తర్వాతే యూరియా వస్తుందని చెబుతున్నారు. వచ్చిన రైతుల నుంచి ఆధార్‌ కార్డులు, పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు స్వీకరించి టోకెన్లు అందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. సహనం నశించిన రైతులు రోడ్లెక్కుతున్నారు. ఎక్కడికక్కడ ఆందోళనలు చేస్తున్నారు. వీరికి సీపీఐ(ఎం), బీఆర్‌ఎస్‌, రైతు సంఘం, తదితర ప్రజాసంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. రైతుల సమస్యల్ని తక్షణం పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నాయి.
మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ వ్యవసాయ సహకార కేంద్రం వద్దకు రైతులు ఉదయమే పెద్దఎత్తున తరలివచ్చారు. యూరియా రాలేదని తెలుసుకున్న రైతులు అంబేద్కర్‌ చౌరస్తాలో గంటపాటు రాస్తారోకో, ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యే సునీతారెడ్డి రైతులకు మద్దతుగా కూర్చున్నారు. తూప్రాన్‌ డీఎస్పీ నరేందర్‌ గౌడ్‌ సిబ్బందితో కలిసి ఎమ్మెల్యేకు, రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేని అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌ మండల కేంద్రంలో అన్నదాతలు ఆరు గంటల పాటు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఫర్టిలైజర్‌ వ్యాపారులు టోకెన్లు రాయించుకొని ఇష్టం వచ్చినవారికి యూరియా అందిస్తూ మిగతా రైతులను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టోకెన్లు ఇచ్చిన రైతులకు రెండు రోజుల్లో యూరియాను అందిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు.

మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబుపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు. బాలానగర్‌ మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాల వద్ద రైతులు పాసుబుక్కులు పట్టుకొని బారులు తీరారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సంఘం కార్యాలయానికి మంగళవారం ఉదయం ఒక లారీలో 300 బ్యాగుల యూరియా రావడంతో ముందస్తుగా టోకెన్లు తీసుకున్న రైతులకు పంపిణీ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో పీఏసీఎస్‌ కార్యాలయం ముందు క్యూలైన్‌లో నిలబడ్డారు.
రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద సీపీఐ(ఎం) నాయకులు రైతులతో కలిసి నిరసన తెలిపారు. వికారాబాద్‌ జిల్లా మర్పల్లిలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో న్యూ బస్టాండ్‌ నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు రైతులతో కలిసి ర్యాలీ నిర్వహించారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయం నుంచి జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయం వరకు రైతులతో కలిసి నిరసన ప్రదర్శన నిర్వహించారు. జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయం ఎదుట రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు.
వేములపల్లి మండలం సల్కునూర్‌ పీఏసీఎస్‌ వద్ద రైతులు చెప్పులు లైన్‌లో పెట్టి బార్లు తీరారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలోని బేతవోలు సహకార సంఘ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
హనుమకొండ జిల్లా పరకాలలోని మాదరం సొసైటీ దగ్గర 5 గంటలకే క్యూ లైన్‌ మొదలైంది. 360 బస్తాలు మాత్రమే రావడంతో రైతులు తోసుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట రైతులు బారులు తీరారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad