– నిలిచిపోయిన ధాన్యం సేకరణ
– సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు వేగవంతం చేస్తామని పాక్స్ అధ్యక్షులు సత్యనారాయణ స్పష్టీకరణ.
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంటను వరి కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లి వొన్ను చేసుకుందాం అనుకుంటే… అక్కడ కూడా రైతులకు మరో సమస్య ఎదురవుతోంది. కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యం లేక ధాన్యాన్ని తూర్పార చేయడం సాధ్యం కాక రైతులు గంటల తరబడి కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు పడే పరిస్థితి నెలకొంది. అశ్వారావుపేట పాక్స్ పరిధిలోని అశ్వారావుపేట, ఊట్లపల్లి, అచ్యుతాపురం, మద్ది కొండ, జమ్మిగూడెం కేంద్రాల్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేపట్టినప్పటికీ, గాలి ఫంకాల యంత్రాలు నడవాలంటే విద్యుత్ తప్పనిసరి. అయితే కేంద్రాల సమీపంలో సరైన విద్యుత్ అందుబాటు లేకపోవడంతో సేకరణ పూర్తిగా నిలిచిపోయింది.
ఈ నేపథ్యంలో పాక్స్ అధ్యక్షులు చిన్నం శెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ.. “రైతులు ఎలాంటి అవస్థలు పడకుండా ఉండేందుకు విద్యుత్ శాఖతో చర్చలు జరుపుతున్నాం. కొనుగోలు కేంద్రాలకు తాత్కాలిక విద్యుత్ సరఫరా అందేలా చర్యలు తీసుకుంటున్నాం” అని తెలిపారు. రైతుల వెతలు తగ్గాలంటే తక్షణ చర్యలు అవసరం ఉందని రైతులు కోరుతున్నారు.



