– తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ
నవతెలంగాణ – కామారెడ్డి
తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ .. రైతు భరోసా డిసెంబర్ నెలలోనే రైతుల ఖాతాల్లో జమ కావాల్సి ఉండగా జనవరి పూర్తయ్యే వరకు ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. ఇప్పటికే సాగు ఖర్చులు, విత్తనాలు, ఎరువులు, కూలీ ఖర్చుల కోసం రైతులు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకుంటూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సంక్రాంతికి ముందే రైతు భరోసా నిధులను విడుదల చేయాలని రైతులు మనస్ఫూర్తిగా కోరుతున్నారని తెలిపారు. లేనిచో జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని రైతు సంఘం కమిటీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మోతీ రామ్ నాయక్, జిల్లా అధ్యక్షులు దొడ్లె మోహన్, జిల్లా ప్రధాన కార్యదర్శి పి. దశరథ్, గిరిజన సంఘం జిల్లా నాయకులు గణేష్, నాణ్య నాయక్, నరాన్ నాయక్, దేవి సింగ్ నాయక్, బాల వీరయ్య, పోశయ్య, మధుసూదన్ తదితర రైతులు పాల్గొన్నారు.



