Sunday, September 14, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంయూరియా కోసం రైతుల పాట్లు కామారెడ్డిలో టోకెన్ల కోసం పోలీస్‌స్టేషన్‌లో రైతులు

యూరియా కోసం రైతుల పాట్లు కామారెడ్డిలో టోకెన్ల కోసం పోలీస్‌స్టేషన్‌లో రైతులు

- Advertisement -

నల్లగొండలో చద్దితో రాత్రంతా పడిగాపులు
నవతెలంగాణ-కామారెడ్డి/ పిట్లం/విలేకరులు

యూరియా కోసం రైతులు పడరానిపాట్లు పడుతున్నారు. కామారెడ్డి జిల్లా బీబీపేట్‌ మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయం వద్ద యూరియా కోసం వందలాది మంది రైతులు ఉదయం నుంచే క్యూ లైన్‌లో చెప్పులు, రాళ్లు పెట్టి గంటల తరబడి వేచి ఉన్నారు. సుమారు 700 మంది రైతులు తరలి రావడంతో పోలీసులకు, రైతులకు స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. దాంతో ఎస్‌ఐ ప్రభాకర్‌ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్‌ స్టేషన్‌ వద్ద యూరియా కోసం వచ్చిన రైతులకు టోకెన్లను పంపిణీ చేశారు. యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులపై మాజీ జెడ్పీ వైస్‌ చైర్మెన్‌ ప్రేమ్‌కుమార్‌.. అధికారులు, పోలీసులతో మాట్లాడారు. సొసైటీ కార్యాలయం నుంచి పోలీస్‌ స్టేషన్‌కు యూరియా టోకెన్‌ కోసం వెళ్లడం, టోకెన్‌ తీసుకున్న తర్వాత సొసైటీ గోదాం లో యూరియాను తీసుకోవడం ఏంటని బీఆర్‌ఎస్‌ నాయకులు, పలువురు రైతులు ప్రశ్నించారు. ఒక్క రైతుకు ఒక్క యూరియా బస్తాను మాత్రమే పంపిణీ చేశారు. కొంతమంది రైతులు యూరియా దొరక్కపోవడంతో ఇంటికి వెనుదిరిగారు. కాగా, మల్కాపూర్‌, తుజాల్‌పూర్‌, జనగామ తదితర గ్రామాలకు చెందిన రైతులు బీబీపేట్‌ సొసైటీ వద్ద రాత్రి నుంచి పడిగాపులు కాశారు.

రైతులు, విండో సిబ్బంది మధ్య వాగ్వివాదం..
రైతులకు సక్రమమైన పద్ధతి లో యూరియా అందించాలని మండల కేంద్రంలోని పిట్లం సింగిల్‌ విండో ఆవరణలో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. 220 బస్తాల యూరియా దిగుమతి కావడంతో రైతులు పెద్దఎత్తున సింగిల్‌ విండో కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటికే విండో సిబ్బంది కొందరి రైతుల వద్ద దొంగచాటుగా పాసు బుక్కులు తీసుకుని సీరియల్‌ పెట్టటంతో సిబ్బంది,రైతుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దాంతో స్థానిక ఎస్‌ఐ వెంకట్‌రావు.. రైతులను సముదాయించి ఒక్క రైతుకు ఒక యూరియా బస్తా చొప్పున అంద జేసి మిగిలిన రైతులకు త్వరలో యూరియా దిగుమతి కాగానే అందజేస్తామని తెలిపారు.

చద్దితో క్యూలో రైతులు
సూర్యాపేట జిల్లా మోతె మండలకేంద్రంలోని గ్రోమోర్‌కు రెండు లారీల యూరియా వచ్చిం దని తెలియడంతో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 900 మందికి పైగా రైతులు శుక్రవారం రాత్రి అన్నం వెంట తెచ్చుకొని రైతు వేదిక వద్దకు వచ్చారు. అన్నం తిని యూరియా అయిపోయిద్దనే భయంతో అక్కడనే నిద్రపోయారు. శనివారం ఉదయం 9 గంటలకు వ్యవసాయ అధికారి వచ్చి రైతులు క్యూలో ఉండాలని చెప్పారు. 900 పైన రైతులు వరుసలో నిలబడితే 436 మంది రైతులకు యూరియా పంపిణీ చేసి అయిపోయిందని చెప్పారు. 1130 బస్తాల యూరియా ఎటు పోయిందో వ్యవసాయ అధికారిణి సమాధానం చెప్పాలని వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రైతులు బైటాయించారు. ఆర్‌ఐ కరుణాకర్‌ రెడ్డి వచ్చి రైతులతో మాట్లాడి ధర్నా విరమింపచేశారు. పాలకీడు మండలంలో యూరియాను పోలీసుల పహారాలో పంపిణీచేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -