Saturday, February 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంయూరియా కోసం రైతుల ఆందోళన

యూరియా కోసం రైతుల ఆందోళన

- Advertisement -

– పురుగుమందు డబ్బాలు పట్టుకుని నిరసన
– అదును దాటుతోంది.. అందరికీ ఇవ్వాలి.. యాప్‌ను ఎత్తేయాలని డిమాండ్‌
నవతెలంగాణ- చిలుకూరు

పైరుకు అదును దాటుతున్నా యూరియా అందడం లేదంటూ రైతులు ఆందోళనకు దిగారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలోని సహకార సంఘం కార్యాలయం ఎదుట శుక్రవారం పురుగు మందు డబ్బాలు పట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. గత వానాకాలం సీజన్‌లో కూడా యూరియా కొరత ఏర్పడిందన్నారు. యాసంగి వరి సాగుకు యూరియా కావాలని అడిగినా.. అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వానాకాలం సీజన్‌లో యూరియా ఎంత అవసరమో.. యాసంగిలోనూ అంతే అవసరం ఉంటుందన్నారు. ముందస్తుగా యూరియా సప్లై చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ముందస్తు ఆలోచన లేదని.. రైతుల గోస పట్టడంలేదని వాపోయారు. గురువారం చిలుకూరు సహకార సంఘ కార్యాలయానికి ఒక లారీ లోడు వస్తే.. యాప్‌లో రెండు నిమిషాల్లోనే పక్క మండలాల రైతులు బుక్‌ చేసుకున్నారని తెలిపారు. చదువురాని వారు, టచ్‌ ఫోన్లు లేని రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాయదారి యాప్‌ వల్ల బుకింగ్‌ చేసుకోవడం తెలియక ఆందోళన చెందుతున్నారన్నారు. యాప్‌ను ఎత్తేయాలని డిమాండ్‌ చేశారు. రెండోసారి యూరియా వేయాల్సిన పొలాలకు సరియైన సమయంలో అందక పోవడంతో దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉందని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి యాప్‌ను తొలగించి యథావిధిగా యూరియా అందించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -