ఉదయం నుంచే షాపుల వద్ద నిరీక్షణ
నవతెలంగాణ – మల్హర్ రావు
యూరియా కోసం రైతులు ఉదయం నుంచే షాపుల ఎదుట పడిగాపులు కాస్తున్నారు.మండలంలోని తాడిచెర్ల, మల్లారం, కొయ్యుర్ గ్రామాల్లోని ఎరువుల దుకాణాల ఎదుట రోజు కనిపిస్తున్న దృశ్యం ఇది. యూరియా కొరత కారణంగా ఎక్కడ దొరుకుతుందా అని పరుగులు తీస్తూ రైతులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు.వర్షాలు బాగా కురవడంతో వరి నాట్లు వేసుకున్న రైతులు యూరియాను వేసుకోడానికి అదను కావడంతో ప్రతి రోజూ తెల్లవారుజామునే ఎరువుల దుకాణాల వద్ద పడిగాపులు పడే పరిస్థితి వచ్చింది.తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకారం కేంద్రం తోపాటు ఎరువుల షాపుల్లో యూరియాను విక్రయిస్తున్నారు.ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రానికి యూరియా వచ్చిన వెంటనే రైతులు బారులుదిరుతున్నారు.స్టాక్ అయిపోయే వరకు ఒక్కో రైతుకు రెండు బస్తాలను అందిస్తున్నారు.యూరియా కేవలం గంట లోపే అయి పోవడంతో చాలా మంది రైతులు యూరియా దొరక్క నిరాశతో వెనుదిరిగి పోతున్నారు.
ఒక్కోచోట ఒక ధర..
యూరియా కొరతతో కొందరు వ్యాపారులు అదను చూసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాల ద్వారా రూ.270 లకు యూరియా బస్తాను విక్రయించారు.వ్యాపారులు మాత్రం రూ.280కి విక్రయించగా మరోచోట రూ.290కు విక్రయిస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.ప్రభుత్వం ద్వారా వస్తున్న యూరియాను ఇలా ఎవరికి ఇష్టం వచ్చిన ధరలకు వారు విక్రయిస్తున్నారని రైతులు వాపోతున్నారు.యూరియా విక్రయాలపై సంబంధించిన వ్యవసాయ అధికారులు పర్యవేక్షణ చేస్తున్నప్పటికీ ధరలను నియంత్రచడంలో మాత్రం విఫలం అవుతున్నారు.అధికారుల ముందే యూరియాను అధిక ధరలకు విక్రయించినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.