నవతెలంగాణ – జన్నారం
రైతులు అధిక దిగుబడినిచ్చే వరి వంగడాలనే సాగు చేసుకొని అధిక లాభాలు పొందాలని మండల వ్యవసాయ శాఖ అధికారి అంజిత్ కుమార్ రైతులకు సూచించారు. శనివారం ఆత్మ ఆధ్వర్యంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ద్వారా రైతులకు మార్కెట్‌లో అధిక డిమాండ్ ఉన్న కొత్త పంట రకాలపై అవగాహన కల్పించేందుకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జన్నారం మండల వ్యవసాయ శాఖ అధికారి అంజిత్ కుమార్ రిసోర్స్ పర్సన్‌గా పాల్గొని రైతులకు వివిధ పంట రకాల సాగు విధానాలపై వివరించారు.
ప్రస్తుతం మార్కెట్‌లో అధిక డిమాండ్ ఉన్న వరి రకాలైన JGL-27356, RNR-31479, KNM-7715 వంటి రకాలు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చీడపీడలను తట్టుకుని అధిక దిగుబడి ఇస్తాయని రైతులకు తెలిపారు. రైతులు ఈ రకాల సాగును ప్రోత్సహించాలని సూచించారు. అలాగే మొక్కజొన్న పంటలో అధిక దిగుబడి సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాన్ని చింతగూడ రైతు వేదికలో నిర్వహించారు. ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.



