నవతెలంగాణ – దర్పల్లి
నిన్న రాత్రి కురిసిన అకాల వర్షంతో నష్టపోయిన రైతులకు తమ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎవరూ అధైర్యపడొద్దని నిజామాబాద్ రూరల్ నియోజవర్గ శాసనసభ్యులు డా.ఆర్.భూపతి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. అకాల వర్షం కారణంగా సంభవించిన నష్టనివారణ తక్షణ చర్యల నిమిత్తం ఇప్పటికే రెవెన్యూ,విద్యుత్, వ్యవసాయ శాఖల అధికారులతో ఫోన్లో మాట్లాడి పలు ఆదేశాలు చేయడం జరిగిందన్నారు.
జిల్లాలో అకాల వర్షం, గాలివాన బీభత్సం కారణంగా ఆయా ప్రాంతాల్లో గుడిసెలు కోల్పోయిన వారిని సైతం గుర్తించి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అటు దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, నేలకొరిగిన చెట్లతొలగింపు ఇతరత్ర నష్టాలను సైతం గుర్తించి తగు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తమది రైతు ప్రభుత్వమని రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు వారి వెంట తప్పకుండా ఉంటామని, ఎవరు కూడా అధైర్యపడకుండా ఉండాలని అభయమిచ్చారు. కాగా ఇప్పటికే సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడి పలు వివరాలు తెలుసుకున్నారు. నష్టపోయిన రైతులను క్షేత్రస్థాయిలో గుర్తించాలని సూచించారు. త్వరలోనే క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల సమస్యలు తెలుసుకుంటానని తెలిపారు.



