నవతెలంగాణ – కామారెడ్డి: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. అధికారులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించాలని, అకాల వర్షాల వలన ధాన్యం తడిసి పోకుండా టార్ఫాలిన్ లను కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో పౌరసరఫరాలు, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, మార్కెటింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పౌర సరఫరాలు, సహకార, గ్రామీణాభివృద్ధి, ఆర్డీఓ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించాలని తెలిపారు. జిల్లాలో గత ఏడాది కన్నా ఇప్పటివరకు 134 శాతం ఎక్కువగా కొనుగోళ్లు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో 446 కొనుగోలు కేంద్రాలలో ఇప్పటివరకు 35161 రైతుల నుండి 257449.704 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని, ఇందులో దొడ్డు రకం ధాన్యం 107343.600 మెట్రిక్ టన్నులు, సన్నరకం 150106.104 మెట్రిక్ టన్నులు కొనుగోలు వేయడం జరిగిందని వివరించారు. ఇప్పటివరకు 597.28 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించడం జరిగిందని, 9410 మంది రైతుల వద్ద నుండి 86331.520 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం నకు 43.17 కోట్ల బోనస్ చెల్లించడం జరిగిందని తెలిపారు. ఆకాల వర్షాల వలన ధాన్యం తడిసి పోకుండా ఉండేందుకు అన్ని కొనుగోలు కేంద్రాల్లో టార్ఫాలిన్ లు అందుబాటులో ఉంచాలని అన్నారు. జిల్లాలో అవసరమైన గన్నీ సంచులు అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు వస్తున్న ధాన్యమును త్వరగా కొనుగోలు చేసి ఎక్కువ కాంటా లు, ఎక్కువ మంది హమాలీలను ఏర్పాటుచేసి కొనుగోళ్లు వేగవంతం చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీఓ వీణ, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రాజేందర్, జిల్లా పౌరసరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు, జిల్లా సహకార అధికారి రామ్ మోహన్, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, జిల్లా మార్కెటింగ్ అధికారిని రమ్య, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ రమేష్, తదితరులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు రావొద్దు: కలెక్టర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES