– రెండ్రోజుల్లో విస్తారమైన వర్షాలు : తుపాన్ ప్రభావంపై కలెక్టర్ జితేష్ వి.పాటిల్
నవతెలంగాణ-పాల్వంచ
తుపాను ప్రభావంతో రాబోయే రెండ్రోజుల్లో విస్తారమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రైతులు వరి కోతలు వాయిదా వేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సూచించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని పల్లెలు, పట్టణాలు, నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. తక్కువ ఎత్తు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరే అవకాశం ఉండటంతో అటువంటి ప్రాంతాల్లో నివసించే వారు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. రహదారులు, వంతెనలు, చెరువులు, వాగులు దాటే సమయంలో జాగ్రత్తగా ఉండాలని, పిల్లలు, వృద్ధులు అవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలని సూచించారు. జిల్లాలో వరి పంట కోతలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో రైతులు రాబోయే రెండు, మూడ్రోజుల పాటు కోతలను వాయిదా వేసుకోవాలని పేర్కొన్నారు. ఇప్పటికే కోసిన పంటను సురక్షిత ప్రదేశాలకు తరలించి, ఎత్తయిన ప్రదేశాల్లో నిల్వ చేయాలని సూచించారు. పంటను నష్టపోకుండా రైతులు ముందస్తు చర్యలు తీసుకోవడం ద్వారా ఆర్థిక నష్టాలను నివారించుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. పంట నిల్వ కేంద్రాల వద్ద నీరు చేరకుండా మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
రైతులు వరి కోతలు వాయిదా వేసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



