నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ప్రస్తుతము కురుస్తున్న వర్షాలతో పత్తి,కంది, పెసర, మొక్కజొన్న మరియు వరి పంటలకు మేలు చేకూరుతుందని ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి అనిల్ కుమార్ తెలిపారు. నిన్న కురిసిన వర్షానికి యాదాద్రి భువనగిరి జిల్లాలో సగటు వర్షపాతం అధికంగా ఉన్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. జిల్లాలో ఈ వర్షాకాలంలో సాధారణ వర్షపాతం 268 మి.మీకు గాను 353.7 మి.మీ నమోదవడంతో 32 శాతం అధిక వర్షo పడింది.జిల్లాలోని 18 మండలాల్లో, 7 మండలాల్లో అధిక వర్షపాతం, 2 మండలాల్లో అత్యధిక వర్షపాతం,8 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదయిందనారు.
వరి… ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు వరి రైతుల్లో ఉత్సాహాన్ని నింపాయి.జిల్లాలోని పలు మండలాల్లో దుక్కి దున్నడం మరియు నాట్లు వేయడం ఊపందుకుంది. సమయానికి నాటిన రైతులు పిలక/దుబ్బు చేసే దశలో ఉన్న వరిలో పైపాటుగా ఎకరానికి 50 కిలోల యూరియా వేసుకున్నట్లయితే అధిక పిలకలు రావడానికి ఆస్కారం ఉందన్నారు. కొన్ని గ్రామాల్లో వర్షాలు ఆలస్యంగా రావడం వల్ల లేదా సల్ఫంగా నమోదవడం వల్ల, నారు ముదిరిందని రైతులు వాపోతున్నారు. ముదురు నారు సమస్య ఉన్నట్లయితే నాట్లు దగ్గర దగ్గర వేయాలి.కుదురుకు ఎక్కువ మొక్కలు నాటాలి మరియు ఎరువులను మూడు దఫాలుగా కాక రెండు దఫాల్లోనే వేయాలి. నాటిన వెంటనే 75% ఎరువులు, లేత పొట్ట దశలో మిగిలిన 25% ఎరువులను వేయాలన్నారు.
ప్రత్తి…. ఈ వర్షాకాలంలో కురుస్తున్న వర్షాల వల్ల రైతులు అంతర కృషి చేయడానికి తద్వారా ఎరువులు వేయడానికి వీలు కలిగింది. పత్తి విత్తిన 20,40,60 మరియు 80 రోజులప్పుడు 25 కిలోల యూరియాను 10 కిలోల పొటాష్ తో కలిపి వేయాలన్నారు.
మొక్కజొన్న… మోకాలెత్తు, పూత దశలో ఉన్న మొక్కజొన్నకు ఎరువులు వేయడానికి ప్రస్తుత వర్షాలు అనుకూలమన్నారు. మోకాలెత్తున్న మొక్కజొన్నలో ఎకరానికి 50 కిలోల యూరియా, పూత దశలో ఉన్న మొక్కజొన్నలో 50 కిలోల యూరియాతో పాటు 20 కిలోల పోటాష్ ను వేయాలన్నారు.
జిల్లా వ్యవసాయ శాఖ తెలిపిన సమాచారం ప్రకారం, ప్రస్తుతము కురుస్తున్న వర్షాలు వివిధ దశల్లో ఉన్న పంటల్లో ఎదుగుదలకు దోహదపడుతుందని, పంట నష్టం జిల్లాలోని ఏ మండలంలో కూడా నమోదవలేదనారు.