కేసారం రైతు వేదికలో అవగాహన సదస్సు
నవతెలంగాణ – సూర్యాపేట రూరల్
సూర్యాపేట మండలంలోని కేసారం రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ మిషన్ ఆన్ నాచురల్ ఫార్మింగ్ (NMNF) పథకం కింద రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ అధికారి జి. శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రైతులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయం ద్వారా భూమి ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా, మానవ ఆరోగ్యాన్ని కూడా పరిరక్షించవచ్చని తెలిపారు.
పంట మార్పిడి విధానం, పచ్చిరొట్ట ఎరువుల వినియోగం, సహజ పద్ధతుల వల్ల లాభాలు వంటి అంశాలపై రైతులకు సవివరంగా అవగాహన కల్పించారు.రసాయన ఎరువుల అధిక వినియోగం భూమిని కాలుష్యానికి గురి చేస్తుందని హెచ్చరించిన ఆయన, సేంద్రియ వ్యవసాయం వైపు రైతులు మళ్లాలని పిలుపునిచ్చారు. సమగ్ర వ్యవసాయ విధానాలను అనుసరించి ఆదాయం రెట్టింపు చేసే పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. రైతులకు అందుబాటులో ఉన్న వివిధ ఉత్పత్తులు, పద్ధతులపై కూడా వివరించారు.
అనంతరం NMNF పథకం కింద మట్టి నమూనా పరీక్ష ఫలితాలు రైతులకు అందజేసి, రైతు కిట్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో DPD ఆత్మ నివేదిత, ADA జ్ఞానేశ్వరీ దేవీ, మండల వ్యవసాయ అధికారి బి. కృష్ణ సందీప్, సర్పంచ్ రేఖ రమణ, వ్యవసాయ విస్తరణ అధికారులు బి. ముత్తయ్య, సుష్మా, రైతులు తాటికొండ జానకిరాం రెడ్డి, యాతం సతీష్ రెడ్డి, వెన్న వెంకట రెడ్డి, మెంథబోయిన నాగయ్య, రేఖ సతీష్, సత్యనారాయణ, తండు మంగ, బత్తుల నాగమణి తదితరులు పాల్గొన్నారు.



