నవతెలంగాణ–పరకాల
జిల్లాలో యూరియా కొరత రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతోంది. సహకార సొసైటీల వద్ద బస్తాలు ఇస్తున్నారని తెలిసి రైతులు ఉదయం నుంచే క్యూలైన్లలో నిలబడుతున్నారు. అయితే ఒక్కరికీ ఒకటి-రెండు బస్తాలకే పరిమితమవ్వడంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
సమయానికి ఎరువు అందక పంట చేళ్లు ఎరుపు దాల్చుతున్నాయని, దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. యూరియా కోసం కుటుంబం అంతా క్యూలలో గడపడం వల్ల వ్యవసాయ పనులు, పశువుల సంరక్షణ దెబ్బతింటోందని రైతులు వివిధ వేదనలను వెల్లగక్కారు.
సోమవారం పరకాల రైతు వేదిక వద్ద యూరియా పంపిణీ జరుగుతుందని తెలిసి పెద్దఎత్తున రైతులు చేరుకున్నారు. 400 బస్తాలకు మాత్రమే టోకెన్లు ఇచ్చిన అధికారులు వెళ్లిపోవడంతో, టోకెన్లు రాని రైతులు హనుమకొండ ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎరువు అందే వరకు కదిలేది లేదని రైతులు హెచ్చరించారు. ఈ సందర్భంలో ఎస్ఐలు రమేష్, విఠల్ జోక్యం చేసుకుని అధికారులు మాట్లాడి, వచ్చే స్టాక్ కోసం అడ్వాన్స్ టోకెన్లు ఇవ్వించేలా చర్యలు తీసుకోవడంతో రైతులు శాంతించారు.
