ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఫాసిస్టు శక్తులు చెలరేగుతున్నాయి. ఆ శక్తులు బలపడిన దేశాల జాబితాలో భారతదేశం కూడా ఉంది. ఇక్కడ ఫాసిస్టు హిందూత్వ శక్తులు బలపడడమే కాక ఒక దశాబ్దానికి పైగా అధికారాన్ని కూడా చెలాయిస్తున్నారు. మైనారిటీలు ”పరాయివారు” అని వారి పట్ల మెజారిటీ మతస్తులలో విద్వేష భావనలను రెచ్చగొట్టి, రాజ్యాంగం నిర్దేశించిన లౌకిక, ప్రజాస్వామిక స్వభావాన్ని నాశనం చేస్తున్న ఈ ”హిందూ ఆధిక్య ధోరణి” ఇలా పేట్రేగిపోతూండడం పట్ల దేశంలోని ఉదారవాదులు, అభ్యుదయవాదులు తీవ్రంగా కలత చెందుతున్నారు. ఈ పరిణామం వెనుక కారణాలను విశ్లేషిస్తున్నారు.
ఈ ఫాసిస్టు ధోరణి తలెత్తడం వెనుక పలు కారణాలు కనిపిస్తున్నాయి. ఆరెస్సెస్ భారీఎత్తున విద్యా సంస్థలను స్థాపించి వాటి ద్వారా చిన్నతనం నుంచీ విషపూరితమైన మతోన్మాద భావజాలాన్ని ఎక్కిస్తున్నది. బాబ్రీ మసీద్ ఉద్యమం ద్వారా మెజారిటీ మతస్తులలో చాలా శక్తివంతంగా మతోన్మాద-ఫాసిస్టు ధోరణిని రాజేసింది. ఆ ఉద్యమం 400 సంవత్సరాలనాటి మసీదును ధ్వంసం చేసి ఆ తర్వాత అక్కడ ఒక దేవాలయాన్ని నిర్మించడానికి దారి తీసింది. వలస పాలనకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమం ద్వారా ప్రజానీకంలో వ్యాపించిన లౌకిక విలువలు క్రమంగా పలచబడ్డాయి. దేశ విభజన సందర్భంగా జరిగిన ఘర్షణల వారసత్వాన్ని ఆధారం చేసుకుని దేశంలో మత ప్రాతి పదికన ప్రజానీకాన్ని విభజించేందుకు పూనుకున్నారు.
ఈ విషయమై జరుగుతున్న చర్చ యావత్తూ హిందూత్వ ధోరణిని కేవలం ఒక చారిత్రిక ధోరణిగానే పరిగణిస్తోంది. ‘భారతదేశంలో భిన్న మతాల, సంస్కృతుల సమ్మేళనంతో సాగుతున్న సమాజం ఇప్పటికీ ప్రజల్లో మత విద్వేష చీలికలను పూర్తిగా వదిలించుకోలేకపోయింది. సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం, స్వాతంత్య్రం తర్వాత రూపొ ందిన రాజ్యాంగం భిన్న మతాల, విశ్వాసాల, సంస్కృతులతో కూడినదిగా భారతదేశం ఉండాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశాయి. ఐనప్పటికీ, మత ప్రాతిపదికన విద్వేష రాజకీయాలను నడిపే అవకాశం హిందూత్వ శక్తులకు ఉన్నది అంటే దానికి కారణం ప్రజల్లో ఇంకా మత ప్రాతిపదికన చీలికలు కొనసాగుతూ వుండడమే.’ ఇలా భారతదేశ చారిత్రిక పరిణామ క్రమంలో తలెత్తిన ధోరణిగా హిందూత్వను పరిగణించడం జరుగుతోంది.
ఈ విశ్లేషణలో చాలా లోతైన పరిశీలన ఉన్నప్పటికీ, అది అసంపూర్ణమైనదిగానే ఉంది. వర్తమాన కాలంలో హిందూత్వ అనేది బలంగా పెరగడం అనేది ప్రపంచవ్యాప్తంగా ఫాసిజం బలపడుతున్న క్రమంలో ఒక భాగం అని ఈ విశ్లేషణ పరిగణించడం లేదు. అర్జెంటీనాలో మిలెయి, ఇటలీలో మెలొని, హంగేరీలో ఓర్బన్, అమెరికాలో ట్రంప్, ఇండియాలో మోడీ, టర్కీలో ఎర్డగాన్, ఇజ్రాయిల్‌లో నెతన్యాహు (ఇతగాడు తక్కినవాళ్ళకన్నా అదనంగా అసహ్యకర, వికృత స్వభావం కలిగివున్నాడు) – వీళ్ళందరిలోనూ ఒక ఉమ్మడి లక్షణం ఉంది. వీళ్ళంతా ప్రపంచవ్యాప్తంగా ఆధిక్యతను సాధిస్తున్న ఫాసిస్టు శక్తులలో భాగం. ఇంకా కొన్ని దేశాల్లో వీళ్ళు ఇంకా అధికారంలోకి రాలేకపోయిన ప్పటికీ, అధికార పీఠం చేరువలో ఉన్నారు. ఫ్రాన్స్‌లో మెరైన్ లీ పెన్, జర్మనీలో ఎఎఫ్‌డి పార్టీ అటువంటివే. ఇంత బలంగా ఈ ఫాసిస్టు శక్తులు విజృంభించడం ఈ మధ్య కాలంలో మనం ఎన్నడూ చూడలేదు. అందుచేత హిందూత్వ శక్తుల పెరుగుదల కేవలం ఇండియాకే పరిమితమైన ఒక ప్రత్యేక ధోరణిగా పరిగణించడం వలన సమగ్రమైన వివరణ రాదు.
ఈ విశ్లేషణలో మరొక అసమగ్రత ఉంది. దీని వెనుక ఎటువంటి వర్గ ప్రాతిపదికా లేకపోవడమే ఆ అసమగ్రతకు కారణం. సాంప్రదాయకంగా హిందూత్వ శక్తులను సమర్ధిస్తూ వచ్చిన వర్గాలుగా దుకాణదారులు, చిన్న వ్యాపారులు, పెటీ బూర్జువా వర్గంగా పరిగణించబడే ఇతరులు ఉంటూవచ్చారు. ఇప్పుడు హిందూత్వ శక్తులు అధి కారంలో ఉన్నాయి కనుక ఈ పెటీ బూర్జువా వర్గం అధికారాన్ని చేజిక్కించుకుంది అని అనుకోగలమా? వర్గ ప్రాతి పదికన హిందూత్వ శక్తులు అధికారంలోకి రావడాన్ని ఏవిధంగా వివరించగలం?
ఈ రెండు రకాల అసమగ్రతలనూ అధిగమించాలంటే ముందు మనం ఈ హిందూత్వ అనే ధోరణిని పూర్తిగా ఆధునిక కాలానికి చెందిన ధోరణిగా గుర్తించాలి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న ఆధునిక ఫాసిస్టు ధోరణికి చెందిన భారతీయ రూపంగా మనం హిందూత్వను గుర్తించాలి. ఈ హిందూత్వ వాదులు హేతు బద్ధతను పూర్తిగా విడిచిపెట్టేశారు. గతంలో జరిగినట్టుగా వాళ్ళు చెప్తున్న చారిత్రిక ఘటనలకు ఎటువంటి ఆధా రాలూ లేవు సరికదా వాళ్ళు చెప్పేది వాస్తవం కాదు అని నిర్ధారించడానికి కావలసినన్ని ఆధారాలు ఉన్నాయి. వాళ్ళు చెప్పేదాన్ని బట్టి వాళ్ళు ఆధునిక కాలానికి ముందు నుంచీ ఉన్న ధోరణికి, అశాస్త్రీయ భావజాలానికి ప్రతినిధులని అనుకుంటాం. కాని కేవలం ఆ కారణాన్ని ఆధారంగా చేసుకుని ప్రపంచవ్యాప్తంగా ముందుకొస్తున్న ఈ ఫాసిస్టు ఉద్యమాలను అర్ధం చేసుకోలేం. ఈ తరహా శక్తులన్నీ ఇప్పుడు బూర్జువా వర్గంలోని అత్యంత శక్తివంతమైన భాగం అయిన గుత్త పెట్టుబడిదారీ వర్గపు మద్దతుతో తెగబడుతున్నాయి. ఈ గుత్త పెట్టుబడిదారీవర్గం అనేది ఆధిపత్యంలో ఉండడం ఒక ఆధునిక కాలపు ధోరణి (తమలో తాము పోటీ పడుతూ వుండే దశ నుండి బూర్జువా వర్గం గుత్త పెట్టు బడిదారీ దశకు మార్పు చెందడం అనేది 20వ శతాబ్దపు ధోరణి అని లెనిన్ నిర్ధారించాడు). అటువంటి గుత్త పెట్టు బడిదారీ వర్గం మద్దతుతో బలపడుతున్న ఫాసిజం అనేది కూడా ఆధునిక కాలపు ధోరణి అని మనం గుర్తించాలి.
అన్ని ఆధునిక సమాజాల్లోనూ ఈ ఫాసిస్టు మూకలు ఉంటూనే వచ్చాయి. ఐతే సాధారణంగా అవి సమా జపు కేంద్ర స్థానంలో కాకుండా, దాని అంచుల్లోనే ఉంటూవచ్చాయి. ఎప్పుడైతే గుత్త పెట్టుబడిదారీ వర్గం ఆ ఫాసిస్టు శక్తులకు తన ఆర్థిక సహాయాన్ని తోడుచేసిందో, తన ఆధీనంలోని మీడియాను అండగా నిలబెట్టిందో అప్పుడు మాత్రమే ఈ ఫాసిస్టు శక్తులు కేంద్ర స్థానానికి ఎగబాకాయి. అంటే బడా పెట్టుబడికి ఈ ఫాసిస్టు శక్తుల అవసరం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మాత్రమే అవి అధికారానికి రాగలిగాయి. ఆ బడా పెట్టుబడిదారీ వర్గపు అవసరాలను నెరవేర్చడానికి ఈ ఫాసిస్టు శక్తులు ఆ వర్గంతో చేతులు కలిపి భాగస్వాములయ్యాయి. అందుచేత ఈ ఫాసిస్టు శక్తుల పాలన అంటే అది గుత్త పెట్టుబడిదారీ వర్గ పాలన అని, అందునా, అత్యంత క్రూరమైన, నిర్బంధపూరితమైన పాలన అని మనం అర్ధం చేసుకోవాలి. ఆ గుత్త పెట్టుబడిదారీ వర్గంలో కూడా కొత్తగా తలెత్తిన, అత్యంత అభివృద్ధి నిరోధక స్వభావం కలిగిన, కొల్లగొట్టే ధోరణి కలిగిన భాగం యెక్క పాలన ఇది. ఫాసిస్టు రాజ్యం అంటే బహిరంగంగా ఉగ్రవాద చర్యలకు పాల్పడే నియంతృత్వం అని, అది ఫైనాన్సు పెట్టుబడి యొక్క అత్యంత అభివృద్ధి నిరోధక భాగపు నియంతృత్వం అని కొమింటర్న్ 7వ మహాసభ అధ్యక్షుడు జార్జి డిమిట్రోవ్ ప్రకటించాడు. ప్రసిద్ధి చెందిన ఆర్థికవేత్త మైకేల్ కాలెక్కీ కూడా అదే ధోరణిలో, ఫాసిస్టు పాలన అంటే బడా పెట్టుబడికి, ఫాసిస్టు శక్తులకు మధ్య ఏర్పడిన భాగస్వామ్యపు పాలన అని వర్ణించాడు.
పెట్టుబడిదారీ వ్యవస్థలో సంక్షోభం తలెత్తి, బడా పెట్టుబడిదారీ వర్గపు పెత్తనానికి ముప్పు ఏర్పడిన తరుణంలో ఇటువంటి భాగస్వామ్యం అవసరం అవుతుంది. శ్రామిక ప్రజానీకాన్ని నిలువునా చీల్చి వారి దృష్టిని అప్రధానమైన అంశాల మీదకు మళ్ళించగలిగే చర్చను లేవనెత్తడం ద్వారా ఆ శ్రామిక ప్రజలు ఐక్యమై తన పెత్తనాన్ని సవాలు చేయకుండా నిరోధించడం బడా పెట్టుబడిదారీ వర్గానికి అవసరం. ఆ అవసరాన్ని నెరవేర్చగల లక్షణం ఫాసిస్టు మూకలకు ఉంటుంది. దానికి తోడు వాటికి నియంతృత్వ ధోరణులు కూడా బలంగా ఉంటాయి. అందుకే సంక్షోభ సమయంలో బడా పెట్టుబడి ఈ ఫాసిస్టు శక్తులతో జత కడుతుంది. 1930 దశకంలో మహామాంద్యం రూపంలో పెట్టుబడిదారీ సంక్షోభం తలెత్తినప్పుడు ఫాసిస్టు శక్తులు మొదటిసారి అధికారంలోకి వచ్చాయి. వర్తమా నంలో దీర్ఘకాలంగా ఆర్థికమాంద్యం, తీవ్ర నిరుద్యోగం కొనసాగుతున్న పరిస్థితి ఉంది. 2008లో రియల్ ఎస్టేట్ బుడగ అమెరికాలో పేలిపోయిన అనంతరం నయా ఉదారవాద విధానాలు సంక్షోభంలో పడ్డాయి. అందుకే ఈ కాలంలో ప్రపంచంలోని అనేక దేశాల్లో ఫాసిస్తు శక్తులు బలంగా ముందుకొస్తున్నాయి.
ఫాసిజం-అది ఇంతకు మునుపటిది కాని, వర్తమానంలో కాని, ఒక ఆధునిక ధోరణి. అది పాతకాలపు ముసుగు వేసుకుని వస్తుంది. అది కూడా ఆ పాత కాలాన్ని అత్యంత ఆదర్శవంతంగా చిత్రిస్తూ వస్తుంది. ఆ ఫాసిస్టు శక్తులు మాత్రం ఆ పాతకాలపు భావజాలానికి ప్రతిరూపాలుగానే ఉంటారు. అయితే, కేవలం ఈ పాతకాలపు భావజాలం బలపడినందువల్లే వాళ్ళు అధికారం దాకా వచ్చారని భావిస్తే, అప్పుడు వాళ్ళకి గుత్త పెట్టుబడిదారీ వర్గంతో ఏర్పడిన బంధం గురించి, పెట్టుబడిదారీ వ్యవస్థతో బంధం గురించి మనం గుర్తించలేకపోతాం. ఫాసిస్టు శక్తులు బలపడడం అనేది ఆధునిక గుత్త పెట్టుబడిదారీ వర్గం పాతకాలపు పనిముట్టును తన ప్రయోజనాల కోసం వాడుకుంటోందన్న సత్యాన్ని మనం గుర్తించాలి.
ఇండియాలో ఆరెస్సెస్ గత వందేండ్లుగా ఉనికిలో ఉంది. కాని కేంద్రంలోకి తన రాజకీయ సంస్థ అయిన బీజేపీ అధికారంలోకి రావడం 2014లో మాత్రమే సాధ్యం అయింది. అది కూడా దేశం లోని బడా బూర్జువావర్గం మద్దతును అది పొందిన తర్వాతనే. ఫాసిస్టుశక్తులకి, బడా పెట్టుబడిదారీ వర్గానికి మధ్య అనుబంధాన్ని ఏర్పరచడంలో ప్రధాన పాత్ర పోషించినవాడు నరేంద్ర మోడీ. అందుకే ప్రధాని పదవికి అతగాడి పేరును మొట్టమొదటగా ప్రతిపా దించినది కూడా ఆ బడా పెట్టుబడిదారులే. గుజరాత్‌లో జరిగిన పెట్టుబడిదారుల శిఖరాగ్ర సమావేశంలో (అప్పటికి మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు), మోడీ పేరును ముందుకు తెచ్చారు.
ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా జరిపే పోరులో విజయం సాధించాలంటే ముందు మనం అది ఒక ఆధునిక కాలపు పెడధోరణి అన్నది గుర్తించాలి. అలా కాకుండా, అది కేవలం కాలం చెల్లిన భావజాలపు రూపంగానే మనం భావిస్తే అప్పుడు మనం దానిని ఓడించడానికి మరింత వేగంగా ఆధునికీకరణను చేపట్టాలని పోరాడవలసి వుంటుంది.అంటే నయా ఉదారవాద విధానాలను మరింత వేగంగా అమలు జరపాలని డిమాండ్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఈ ఫాసిస్టు శక్తులు బలపడడం వెనుక దానికి గుత్త పెట్టుబడిదారులతో బంధం ఉందని, నయా ఉదారవాద విధానాలను అమలు చేసినందువల్లే పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రస్తుత సంక్షోభం ఏర్పడిందని, గ్రహించాలి. ఆ సంక్షోభకాలంలో తమ పెత్తనాన్ని నిలబెట్టుకోడానికే గుత్త పెట్టుబడిదారులు ఫాసిస్టు శక్తులతో కూటమి కట్టారు. అందుచేత మనం ఫాసిస్టు శక్తుల మీద జరిపే పోరాటం నయా ఉదారవాద విధానాల చట్రాన్ని బద్దలుగొట్టి ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాల కోసం జరిపే పోరాటంతో ముడిపడి వుంటుంది.
నయా ఉదారవాద విధానాల చట్రాన్ని బద్దలు కొట్టనిదే అది సృష్టించిన సంక్షోభం నుంచి బయట పడడం కుదరదు. ఆర్థిక ప్రత్యామ్నాయం కోసం పోరాడకుండా కేవలం రాజకీయంగా ఫాసిస్టు శక్తులను ఓడించినా, వాటి ఓటమి తాత్కాలికమే ఔతుంది. వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తారు. అమెరికాలో ట్రంప్ మళ్ళీ అలాగే అధికారంలోకి వచ్చాడు. గుత్త పెట్టుబడిదారులకు ఆ ఫాసిస్టు శక్తులతో జత కడితే తప్ప పని జరగదు. అందుచేత ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా పోరాటం అంటే కేవలం రాజకీయంగా లౌకిక, ప్రజాస్వామ్య, ఫాసిస్టు-వ్యతిరేక శక్తులను కూడగడితే చాలదు. దానికి తోడు నయా ఉదారవాద విధానాలను అధిగమించి ముందుకు సాగేందుకు దోహదం చేసే కనీస ఆర్థిక కార్యక్రమం కూడా అవసరం. ముందడుగు వేయడానికి ఈ ఆర్థిక కార్యక్రమం కనీసం కొన్ని కీలక అంశాల విషయంలోనైనా రూపొందించాల్సి వుంటుంది.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్ పట్నాయక్
ఫాసిజం ఆధునిక కాలపు పెడధోరణి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES