గాయాలపాలైన భార్య
పోతంగల్‌లో తీవ్ర విషాదం
నవతెలంగాణ-పోతంగల్ (కోటగిరి)
రెక్కాడితే డొక్కాడని కుటుంబం వారిది. ఉన్నంతలో కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్నారు. ఇటీవలే కూతురు పుట్టడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. కానీ ఆ ఆనందం ఎన్ని రోజులూ ఉండలేదు. ఊహించని ఘటన మృత్యువుకు దారితీసింది. రైస్ మిల్ గోడ కూలి ఇంటిపై పడటం తో ఒకే కుటుంబంలో తండ్రి, కూతురు మృతిచెందారు. ఈ విషాదకర ఘటన నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. ఎస్‌ఐ సునీల్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని మాలవాడకు చెందిన ఇందూర్ మహేష్(25), భార్య మహేశ్వరి, తమ రెండు నెలల కూతురుతో వారి ఇంట్లో నిద్రపోతున్నారు.
మంగళవారం ఉదయం సుమారు 6 గంటల సమయంలో ఇంటి పక్కనే ఉన్న పాడుబడ్డ రైస్‌మిల్ గోడ ఒక్కసారిగా కూలి.. పక్కనే ఉన్న కూనిల్లు (రేకుల షేడ్)పై పడింది. దాంతో ఇంట్లో నిద్రపోతున్న మహేష్, రెండు నెలల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు గమనించి వెంటనే మట్టిని తొలగించడంతో మహేశ్వరి గాయాలతో బయటపడింది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కొన్ని సంవత్సరాలుగా పాడుబడ్డ రైస్‌మిల్ శిథిలావస్థకు చేరినప్పటికీ పట్టించుకోకపోవడంతో ప్రమాదం జరిగిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూలీ చేసుకుంటూ.. పొట్టనింపుకొనే కుటుంబంలో ఇద్దరి మృతి స్థానికంగా కలిచివేసింది. రైస్‌మిల్ యాజమాన్యంపై చర్యలు తీసుకొని కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
గోడ కూలి తండ్రి, కూతురు దుర్మరణం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES