నవతెలంగాణ- వెల్దండ :
మండల పరిధిలోని పెద్దాపూర్ గ్రామ శివారులో శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారి బూరకుంట సమీపంలో వెంకటేశ్వర్లు(35) అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారంచోటుచేసుకుంది. ఎస్ఐ కురుమూర్తి తెలిపిన విరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా ఎర్రగుంటపాలెం మండలం బోయల పల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు భార్య దీపికతో కొన్నేండ్ల క్రితం వివాహం జరిగింది. అయితే వీరికి ముగ్గురు పిల్లలున్నారు. కుటుంబ కలహాలతో ద్విచక్ర వాహనంపై తమ పిల్లలు పెద్ద కూతురు మోక్షిత (8) చిన్న కూతురు వర్షిత (6) కుమారుడు శివధర్మ (4) లను బైక్ పై తీసుకొని ఇంటి నుంచి వచ్చినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
గత నాలుగు రోజులుగా డిండి ప్రాజెక్టు పరిసరాలలో వెంకటేశ్వర్లు తిరిగినట్లు పోలీసులు సిసిటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించినట్లు తెలిపారు. పెద్దాపూర్ గ్రామ శివారులో బుధవారం తెల్లవారుజామున వెంకటేశ్వర్లు మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంకటేశ్వర్లు పక్కన పురుగుల మందు డబ్బా ఉండడంతో వెంకటేశ్వర్లు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. మృతుడు వెంకటేశ్వర్లతో పాటు ఆయన వెంట ఉన్న ముగ్గురు పిల్లల ఆచూకీ తెలియలేదు. భార్య దీపిక ఫిర్యాదు మేరకు ప్రకాశం జిల్లాలో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ఆస్పత్రికి తరలించారు.