Saturday, March 28, 2026
E-PAPER
Homeఖమ్మంనాడు తండ్రి ప్లంబర్.. నేడు తనయుడు మున్సిపల్ కౌన్సిలర్

నాడు తండ్రి ప్లంబర్.. నేడు తనయుడు మున్సిపల్ కౌన్సిలర్

- Advertisement -

– నార్లపాటి కుటుంబానికి ప్రజాసేవతో తరతరాల అనుబంధం
నవతెలంగాణ – అశ్వారావుపేట

కృషి, పట్టుదల, ప్రజలతో అనుబంధం ఉంటే సామాన్య కుటుంబం నుంచి కూడా ప్రజాప్రతినిధులు ఎదగగలరనే విషయాన్ని అశ్వారావుపేటలోని నార్లపాటి కుటుంబం మరోసారి రుజువు చేసింది. అశ్వారావుపేట మున్సిపాలిటీ 11వ వార్డు కౌన్సిలర్‌గా ఉన్న నార్లపాటి మహేష్ బాబు తండ్రి నార్లపాటి లక్ష్మయ్య ఒకప్పుడు పేరాయిగూడెం పంచాయతీలో ప్లంబర్‌గా పని చేస్తూ గ్రామ ప్రజలకు సేవలు అందించారు. పంచాయతీ పనుల్లో ప్రజలకు అవసరమైన సేవలు అందిస్తూ గ్రామ జీవనంలో భాగమయ్యారు.

ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పేరాయిగూడెం పంచాయతీ తొలి సర్పంచ్‌గా పనిచేసిన నార్లపాటి పిచ్చయ్య లక్ష్మయ్య తండ్రి కావడం. ఒకవైపు తండ్రి సర్పంచ్‌గా ప్రజలకు నాయకత్వం వహిస్తే, మరోవైపు కుమారుడు లక్ష్మయ్య సాధారణ ఉద్యోగిగా గ్రామ ప్రజల అవసరాలను తీర్చడం ఆ కుటుంబం ప్రజాసేవ పట్ల ఉన్న నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.

అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ నేడు లక్ష్మయ్య కుమారుడు మహేష్ బాబు మున్సిపల్ కౌన్సిలర్‌గా ఎన్నికై పురప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తరతరాలుగా ప్రజల మధ్యే జీవిస్తూ సేవలను అందిస్తున్న ఈ కుటుంబానికి ప్రజాసేవతో ప్రత్యేకమైన అనుబంధం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

సామాన్య కుటుంబం నుంచి ప్రజాప్రతినిధిగా ఎదిగిన మహేష్ బాబు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి ప్రజలకు మరింత సేవ చేయాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -