Wednesday, November 5, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుప్రయాణికుల్లో భయం.. భయం

ప్రయాణికుల్లో భయం.. భయం

- Advertisement -

– వరుస బస్సు ప్రమాదాలు
– తాండూర్‌లో కర్నాటక ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ
– కరీంనగర్‌లో ధాన్యం ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

నవతెలంగాణ-తాండూరు/ తిమ్మాపూర్‌/వేములపల్లి
చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర జరిగిన ఆర్టీసీ బస్సు, టిప్పర్‌ ప్రమాదం మరువకముందే మంగళవారం మరో రెండు చోట్ల బస్సు ప్రమాదాలు జరిగాయి. వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలం కరణ్‌కోట్‌ సమీపంలోని సాగర్‌ ఫ్యాక్టరీ వద్ద కర్నాటక ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. కరీంనగర్‌ జిల్లాల్లో ఆర్టీసీ బస్సు ధాన్యం ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనల్లో పలువురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నాటక రాష్ట్రం గుల్బర్గా నుంచి తాండూరు వైపు వస్తున్న ఆ రాష్ట్ర ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం ధ్వంసమైంది. బస్సులో ఉన్న ప్రయాణికులు క్షేమంగా బయటపడగా.. డ్రైవర్‌ తలకు తీవ్ర గాయాలయ్యాయి. మరొకరు స్వల్పంగా గాయపడ్డారు. అక్కడి నుంచి లారీ డ్రైవర్‌ పరారీ అయ్యాడు. తాండూరు రూరల్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ధాన్యం ట్రాక్టర్‌ను ఢీకొట్టిన బస్సు
కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం తెల్లవారుజామున మండలంలోని రేణికుంట గ్రామ శివారులోని బ్రిడ్జి వద్ద ధాన్యం బస్తాల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలోని బస్సులోని ప్రయాణికు లకు స్వల్ప గాయాలయ్యాయి. మెట్‌పల్లి డిపోకి చెందిన బస్సు హైదరాబాద్‌ నుంచి మెట్‌పల్లి వెళ్తోంది. రేణిగుంట శివారు దగ్గర ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్‌ రోడ్డు కిందికి దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాదాన్ని గమనించిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ రవి కిందకు దూకి ప్రాణంతో బయటపడ్డాడు. సంఘటన స్థలాన్ని కరీంనగర్‌ రూరల్‌ ఏసీపీ విజయ్‌ కుమార్‌, సీఐ సదన్‌కుమార్‌, ఎస్‌ఐ శ్రీకాంత్‌గౌడ్‌ పరిశీలించారు. ప్రమాద సమయంలో బస్సులో 31 మంది ప్రయా ణిస్తున్నారని, వారిలో 15 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని 108లో కరీంనగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

వేములపల్లి మండలంలో..
నల్లగొండ జిల్లా వేములపల్లి మండలంలోని అన్నపురెడ్డిగూడెం సమీపంలో అద్దంకి- నార్కట్‌పల్లి రహదారిపై బైక్‌ను డీసీఎం ఢీకొట్టింది. ప్రముఖ దినపత్రికలో పనిచేస్తున్న రేగూరి రాము మిర్యాలగూడ నుంచి వేములపల్లి వైపు బైకుపై వస్తుండగా హైదరాబాద్‌ వైపు వెళ్తున్న తమిళనాడుకు చెందిన డీసీఎం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రామును మిర్యాలగూడ ఏరియాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -