ఉద్యోగమా…ప్రాణమా?
వెళ్తే…మళ్లీ పిలుస్తారో లేదో…
నెలరోజులుగా గల్ఫ్‌లో భారతీయుల ఆత్మఘోష
స్వదేశానికి వస్తే అప్పులు వెంటాడుతాయని భయం
అక్కడే ఉంటే ప్రాణాలు పోతాయని ఆందోళన
ఆవేదనలో భారతీయ కుటుంబాలు
నవతెలంగాణ-సెంట్రల్ డెస్క్
‘ఈ కష్టం పగోడికి కూడా రావొద్దు. తమకు సంబంధంలేని యుద్ధంలో భారతీయులు ప్రాణాలు కోల్పోతున్నారు. బ్రతికి ఉన్నవాళ్లు తమ నివాసాలపై ఎప్పుడు, ఎటునుంచి ఏ బాంబులు వచ్చి పడతాయో అని ఆందోళనలో నిద్రాహారాలు మానేసి, భయం భయంగా రోజులు వెళ్లదీస్తున్నారు. ప్రాణభయంతో అక్కడి ఉద్యోగాలు మానేసి స్వదేశానికి వచ్చేస్తే, గల్ఫ్ వెళ్లేందుకు చేసిన అప్పులు కండ్లముందు కనిపిస్తున్నాయి. ప్రయివేటు అప్పులతో పాటు ఈఎమ్‌ఐల రూపంలో ఉండే బ్యాంకు రుణాలు వెంటాడు తున్నాయి. ఇవాళ కాకుంటే రేపైనా పరిస్థితుల్లో మార్పు రాకపోతుందా అనే ఆశతో కాలాన్ని లెక్కిస్తున్నారు’. అక్కడి వారిది ఆ బాధ అయితే, ఇక్కడి కుటుంబసభ్యులది మరో ఆందోళన. తమవారు ఎలా ఉన్నారో? ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో? అనే ఆవేదనతో స్వదేశంలో కంటిమీద కునుకు లేకుండా పడిగాపులు కాస్తున్నారు. ‘ఉద్యోగం లేకున్నా ఫర్వాలేదు వచ్చేరు’ అని చెప్పే ధైర్యం చేయాలంటే అనేక లెక్కలు వేసుకోవాల్సిన దుస్థితి ఇక్కడి కుటుంబాలది.
ఇరాన్‌పై ఇజ్రాయిల్, అమెరికా యుద్ధంతో గల్ప్ దేశాలు అట్టుడికి పోతున్నాయి. దీంతో అక్కడ పనిచేసే వందలాది మంది భారతీ యులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. జీవనోపాధి కావాలో… ప్రాణాలు కావాలో తేల్చు కోలేక సతమతమ వుతున్నారు. ఆయా దేశాల్లోని భారతీయ ఎంబసీలు వారికి భరోసా కల్పించడంలో విఫలమవుతు న్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా యుద్ధ ప్రభావం ఉన్న దేశాల్లోని భారతీయులకు జాగ్రత్తలు చెప్పడం మినహా, వారిని అండగా నిలిచే ఎలాంటి చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. ఇరాన్‌తో అమెరికా-ఇజ్రాయిల్ మధ్య నెల రోజులుగా సాగుతున్న యుద్ధ ప్రభావం ముఖ్యంగా గల్ఫ్ దేశాలపై తీవ్రంగా ఉంది. ఈ సమయంలో స్వదేశానికి తిరిగి వెళితే ఉద్యోగాలు కోల్పోతామనే భయం భారతీయ కార్మికులను వెంటాడుతోంది. సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ, దుబారు వంటి దేశాలపై ఇరాన్ డ్రోన్లతో క్షిపణులు ప్రయోగిస్తూ విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. నెలరోజులుగా ఇవే పరిస్థితులు ఉన్నా, ఆ దేశాల్లోని దాదాపు 10 మిలియన్ల మంది భారతీయులు స్వదేశానికి తిరిగి రాలేదు. ఇప్పటికే కువైట్ సహా పలు ప్రాంతాల్లో జరిగిన బాంబుదాడుల్లో పలువురు భారతీయులు మరణించారు. పాశ్చాత్య దేశాల వారు పెద్ద సంఖ్యలో గల్ఫ్‌ను వీడి వెళ్లిపోతున్నారు. కానీ గల్ఫ్ కార్మికశక్తికి వెన్నెముకగా ఉన్న భారతీయులు మాత్రం ప్రాణాలకు తెగించి, అక్కడే కాలం వెళ్లదీస్తున్నారు.
యుద్ధం-ఉద్యోగం
యుద్ధానికి భయపడాలో… ఉద్యోగం ఉంటుందో లేదో అని బాధపడాలో అర్థంకాని స్థితిలో అనేకమంది భారతీయులు సందిగ్ధతలో ఉన్నారు. విమాన రాకపోకలు తగ్గిపోయాయి. అడపాదడపా నడుస్తున్న విమానాల్లో టిక్కెట్ల రేట్లు ఖరీదైపోయాయి. దానికి తోడు ఉద్యోగం ఉంటుందో లేదో అనే సందేహం అడుగు ముందుకు పడకుండా అడ్డుపడుతోంది. ”ప్రస్తుతం మేం మా ప్రాణాల కంటే మా ఉద్యోగాల గురించే ఎక్కువగా ఆందోళన చెందుతున్నాం. మేం తిరిగి రావాలనుకుంటున్నాం, కానీ ఇప్పుడు వెళ్ళిపోతే, మాకు మళ్ళీ ఈ అవకాశం వస్తుందనే గ్యారెంటీ లేదు,” అని రియాద్‌లో రిటైల్ రంగంలో పనిచేస్తున్న ఫరాజ్ వామిక్ మీడియాకు తెలిపారు. ”నేను ఇంతకుముందు భారతదేశంలో పనిచేశాను. కానీ జీతం, ఎదుగుదల సరిగా లేవు. అందుకే సౌదీకి వచ్చాను. ఇప్పుడు, యుద్ధం ఉన్నప్పటికీ, నేను తిరిగి వెళ్ళే సాహసం చేయలేకపోతున్నాను” అని చెప్పుకొచ్చాడు. ఇది కేవలం ఫరాజ్ ఒక్కడి అభిప్రాయం కాదు. వందలాదిగా ఉన్న భారతీయ కార్మికులందరిదీ ఇదే పరిస్థితి. ఈ యుద్ధం వల్ల ఆర్థిక మందగమనంతో గల్ఫ్ దేశాల్లో దాదాపు 3 లక్షల ఉద్యోగాల్లో కోతపడుతుందనే అంచనాలు ఉన్నాయి. దీనితో ఉన్న ఉపాధిని వదులుకొని స్వదేశానికి వచ్చేందుకు భారతీయులు ఇష్టపడట్లేదు. అదే సమయంలో గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులు పంపే డబ్బు ఏటా పదుల బిలియన్ల డాలర్లలో ఉంటుంది. అది స్వదేశంలోని లక్షలాది కుటుంబాలకు జీవనోపాధిని కల్పిస్తుంది. భారతీయ కార్మికులకు తక్షణ ప్రాణభయం కంటే కుటుంబాల బాధ్యతే అతి ముఖ్యమైనదిగా మారింది. మహమ్మద్ అహ్మద్ జిద్దాలో ఆటోమొబైల్ ఇంజనీర్. భయం , బాధ్యతల మధ్య జీవించడంలో ఎదురయ్యే మానసిక ఒత్తిడిని ఆయన మీడియాతో పంచుకున్నారు. ”ప్రతిరోజూ నా కుటుంబం నాకు ఫోన్ చేసి, తిరిగి రమ్మని అడుగుతున్నారు. కనీసం రొట్టె, ఉప్పు అయినా సరే ఎలాగోలా సర్దుకుంటామని చెబుతున్నారు,” అని చెప్పాడు. ”కానీ నేను తిరిగి వెళితే, భారతదేశంలో ఏ ఉద్యోగం చేస్తాను? నా పిల్లల చదువుకు ఎలా డబ్బులు సమకూరుస్తాను? ప్రస్తుతం ఈ భయం ముందు యుద్ధ భయం పెద్దదిగా కనిపించట్లేదు’ అని చెప్పుకొచ్చాడు.
ఆదాయ వ్యత్యాసాలే కారణం
అనేకమంది కార్మికులు, ఉద్యోగులకు భారతదేశం, గల్ఫ్ దేశాల మధ్య ఉన్న ఆదాయ వ్యత్యాసం నిర్ణయం తీసుకోకుండా నిలువరిస్తున్నది. ”భారతదేశంలో నేను నెలకు రూ.40 వేలు సంపాదించేవాడిని. దుబారులో ఇప్పుడు నా నెలజీతం దాదాపు రూ. 2 లక్షలు. నేను నా కుటుంబం మొత్తాన్ని పోషిస్తున్నాను. ఇప్పుడు నేను తిరిగి వెళితే, భారతదేశంలో అంత సంపాదించగలనా? అని ప్రశ్నించుకుంటే… ‘లేదు’ అనే సమాధానమే కనిపిస్తున్నది. అందుకే మా తలల మీదుగా క్షిపణులు దూసుకుపోతున్నా ఇక్కడే ఉంటున్నాం” అని టెలికాం రంగ నిపుణుడు రషీద్ అలీ అన్నారు.
అథఃపాతాళానికి ఆతిథ్యరంగం
క్షేత్రస్థాయిలో ఇరాన్ యుద్ధం ఇప్పటికే పరిశ్రమల స్వరూపాన్ని మార్చేస్తోంది. ప్రపంచవ్యాప్త ప్రయాణాలపై ఎక్కువగా ఆధారపడిన గల్ఫ్ దేశాల ఆతిథ్య రంగం, కోవిడ్-19 మహమ్మారి కాలం నాటి తరహాలో ఉద్యోగాల్లో కోతలను విధించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ”హోటళ్లు ఖాళీగా ఉన్నాయి, రెస్టారెంట్లు ఇబ్బందులు పడుతున్నాయి. ప్రజలు ఉద్యోగాలు కోల్పోవడం మొదలుపెట్టారు. ఇంకా ఉద్యోగంలో ఉన్న మేము మాత్రం చాలా గట్టిగా పట్టుకుని వేలాడుతున్నాము. అందుకే ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ చాలా మంది భారతీయులు దేశం విడిచి వెళ్లడం లేదు” అని దుబారులోని హోటల్ కార్మికుడు రమేష్ కుమార్ చెప్పుకొచ్చారు.
యూఏఈలో కోతలు ప్రారంభం
ప్రపంచవ్యాప్త రాకపోకలు, వినియోగదారుల విశ్వాసంపై ఎక్కువగా ఆధారపడిన రంగాలైన ఆతిథ్యం, పర్యాటకం, ఆహార సేవల్లో యూఏఈలోఉద్యోగాల తొల గింపు, జీతాల కోతలు మొదలయ్యాయి. అదే సమయంలో, అస్థిరమైన చమురు ధరలు ప్రభుత్వాలను ఖర్చులను తగ్గించుకునేలా ఒత్తిడి చేస్తున్నాయి. ఈ ప్రాంతంలో ప్రయివేటురంగ నియామకాలను నిలిపివేస్తున్నారు.
అన్ని రంగాలపై ఎఫెక్ట్
ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగితే, ఆయా దేశాల్లో ఉద్యోగ భద్రత అంత పెళుసుగా మారుతుంది. ఈ సంక్షోభం నిర్మాణరంగంతో పాటు లాజిస్టిక్స్, హాస్పిటాలిటీ వంటి రంగాలను దెబ్బతీస్తుందని నియామక సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఈ పరిశ్రమల్లోనే అత్యధిక సంఖ్యలో భారతీయులు గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్నారు.
ఉద్యోగం ఉంటుందా?
ఈ ఆర్థిక ప్రకంపనలు ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తున్నాయని దుబారులోని బ్యాంకింగ్ రంగంలో పనిచేసే సయ్యద్ అక్తర్ హుస్సేన్ చెప్పారు. ”తిరిగి స్వదేశానికి వెళ్లడానికి విమాన టిక్కెట్టు కొనుక్కోగలను, అది సమస్య కాదు. నేను వెళ్ళిపోతే తిరిగి రావడానికి ఉద్యోగం ఉంటుందా లేదా అన్నదే అసలు సమస్య. పెట్టుబడులు మందగిసు న్నాయి, వ్యాపారాలు ఛిద్రమవుతు న్నాయి. ఈ అనిశ్చితే మమ్మల్ని ఇక్కడ ఉంచుతోంది,” అని ఆయన వివరించారు.
తీవ్రమైన దాడులు
అమెరికా-ఇజ్రాయిల్ సంయుక్త దాడులను ఇరాన్ తీవ్రంగా తిప్పికొడుతోంది. ఆ సందర్భంలో గల్ఫ్‌లో విస్తరించి ఉన్న అమెరికా స్థావరాలు, చమురు నిక్షేపాలు, ఓడరేవులు, విమానాశ్రయాలు, వాణిజ్య నౌకా మార్గాలతో సహా పలు కీలక మౌలిక సదుపాయాలు, ఆర్థిక లక్ష్యాలను ధ్వంసం చేసేలా దాడులు జరుగుతున్నాయి. మరోవైపు గల్ఫ్ దేశాల్లో అమెరికా, ఇజ్రాయిల్ దేశాలకు వ్యతిరేకంగా స్థానిక ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ సంక్షోభం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందోనని భారతీయులు ఆందోళన చెందుతున్నారు.
మళ్లీ వెళ్లేదెలా?
రంజాన్ పండుగ సందర్భంగా భారతదేశం వచ్చిన గల్ఫ్ ఉద్యోగులకు ఇప్పుడు తిరిగివెళ్లడం పెద్ద సవాలుగా మారింది. తమ ఉద్యోగాలు ఉన్నాయో లేదో కూడా తెలీని అనిశ్చితిలో ఉన్నామని ఈద్ కోసం లక్నోకు వచ్చిన మహమ్మద్ ఆసిఫ్ ఆవేదనగా చెప్పారు. అయినా ఖరీదైన విమాన టిక్కెట్ కొని తిరిగి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపారు. ”నేను వెళ్లడం నా కుటుంబానికి ఇష్టం లేదు, కానీ నాకేం మార్గం ఉంది? నేను ఉద్యోగం కోల్పోతే అంతా కుప్పకూలిపోతుంది. మేము యుద్ధ నీడలోనే పనికి తిరిగి వెళ్తున్నాము. ఎందుకంటే మా మనుగడ దానిపైనే ఆధారపడి ఉంది.” అని ఆవేదనగా చెప్పుకొచ్చారు. ఇప్పటికీ గల్ఫ్‌దేశాల్లో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయివేట్ ట్రావెల్స్ విమానాలు నడుపుతున్నా, టిక్కెట్ రేట్లు భారీగా పెంచేశాయి. సౌదీ అరేబియా నుంచి ఖతార్, దుబాయ్ వరకు మొత్తం గల్ఫ్ దేశాల్లో భూతల సంఘర్షణలు జరగవచ్చనే భయాలు పెరుగుతున్నాయి. అయినా భారతీయులు ప్రాణాలకంటే జీవనోపాధికే ప్రాధాన్యత ఇస్తుండటం వారి దయనీయ జీవితాలకు దర్పణం పడుతోంది.



