బస్తర్ పాండమ్‌ను ప్రారంభిస్తూ రాష్ట్రపతి ముర్ము వ్యాఖ్యలు
జగదల్‌పూర్ : ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా గత నాలుగు దశాబ్దాలుగా చత్తీస్‌ఘడ్ లోని బస్తర్ ప్రాంతంలో నెలకొన్న భయాందోళనల వాతావరణం పూర్తిగా సమసిపోయిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. జగదల్‌పూర్‌లో బస్తర్ పాండమ్ (ఉత్సవం) ను శనివారం రాష్ట్రపతి ప్రారంభించారు. గోండీ పదమైన పాండమ్ అంటే పండుగ, ఉత్సవమని అర్ధం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు బస్తర్ పాండమ్‌ను ఏటా జరుపుతోంది. గిరిజన కళలు, సంస్కృతిని ప్రతిబింబించేలా డివిజనల్ స్థాయిలో పోటీలు కూడా నిర్వహిస్తుంది. బస్తర్ సంప్రదాయాలు, ఆచారాలు ఎల్లప్పుడూ ప్రజలను ఆకర్షిస్తాయన్నారు.
కానీ దురదృష్టవశాత్తూ, గత 40ఏళ్ళుగా ఈ ప్రాంతంలో నక్సలిజం ప్రబలిపోయిందన్నారు. ఫలితంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారన్నారు. యువత, గిరిజనులు, దళితులు బాధితుల్లో ప్రధానంగా వున్నారన్నారు. అయితే నక్సలిజంపై భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాత్మకమైన కార్యాచరణ కారణంగా ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు, అస్థిరత, అపనమ్మకం అన్నీ కూడా తొలగిపోతున్నాయని అన్నారు. హింసా మార్గాన్ని విడనాడి తిరిగి జనజీవన ప్రధాన స్రవంతిలోకి వస్తున్న వారిని ముర్ము అభినందించారు. దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం పట్ల పూర్తిగా విశ్వాసంత వుండాలని కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పూర్తి విశ్వాసముంచి, కఠోరశ్రమ, అంకిత భావంతో ముందుకు సాగితే విజయం వారిదేనని వ్యాఖ్యానించారు.



