Saturday, September 27, 2025
E-PAPER

వరద భయం

- Advertisement -

పొంగిపొర్లుతున్న వాగులు, కాలువలు
లోతట్టు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తం
రోడ్లన్నీ జలమయం..వాహనదారులకు అవస్థలు
ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల
భద్రాద్రిలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

నవతెలంగాణ-విలేకరులు
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో గురువారం అర్థరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. కాలనీలను వరద నీళ్లు ముంచెత్తడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వాంగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సంగారెడ్డి జిల్లా సింగూరు నుంచి నీటిని భారీ స్థాయిలో కిందకు వదలడంతో అందోల్‌ మండలం అల్మాయిపేట బ్రిడ్జీ నీటిలో మునిగిపోయింది. దాంతో అల్మాయిపేట, కొన్యాల-పన్యాల, చౌటకూర్‌ మద్యన రాకపోకలు నిలిచిపోయాయి. సింగూరు నుంచి పాపన్నపేట మండలంలోని ఘనపూర్‌కు నీళ్లు వస్తుండటంతో ఏడుపాయల దుర్గభవానీ ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. సంగారెడ్డిలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులోకి భారీగా వరద నీరు చేరడంతో కూరగాయా ల దుకాణాలు నీట మునిగాయి.

పటాన్‌చెరులోని 65వ జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహిస్తుండటంతో ముత్తంగి రింగ్‌రోడ్‌ నుంచి రుద్రారం వరకు భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. మెదక్‌ జిల్లా దూప్‌ సింగ్‌ తాండా నీటి మునిగి రాకపోకలు నిలిచిపోయాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో ఈసీ, మూసీ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఏట్ల ఎర్రవల్లి, దేవరాంపల్లి, టంగుటూరు, మోకిలా, పామేనా వాగులు ఉప్పొంగుతున్నాయి. వికారాబాద్‌ జిల్లా వ్యాప్తంగా కురిసిన కుండపోత వర్షంతో రహదారులు జలమయం అయ్యాయి. పరిగి నస్కల్‌ వాగు, బూరుగుపల్లి, మైలార్‌ దేవర్‌పల్లి వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దాంతో స్థానిక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

ఉమ్మడి వరంగల్‌కు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో రెండ్రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్టు వాతావరణ శాఖ ప్రకటించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగామ, జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ను వాతావరణ శాఖ ప్రకటించింది. కాగా జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద శుక్రవారం సాయంత్రం 8,35,800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. దాంతో 85 గేట్లను ఎత్తి అంతే నీటిని కిందికి వదులుతున్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని రామన్నగూడెం పుష్కర ఘాట్‌ వద్ద గోదావరి శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు 15.280 మీటర్లకు చేరుకొని వరద ప్రవహిస్తుంది. దాంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వరద ఇదేవిధంగా పెరుగుతూ 17.33 మీటర్లకు చేరితే మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. కన్నాయిగూడెం మండలంలోని సమ్మక్క బ్యారేజీలోకి 8.35 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండటంతో అన్ని గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజీ నీటి మట్టం 83 మీటర్లకుగాను 82.85 మీటర్లకు వరద చేరింది. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని బెగుళూరు గ్రామానికి చెందిన మంద లక్ష్మి ఇంటి గోడ ప్రమాదవశాత్తు కూలిపోగా లక్ష్మి అక్కడికక్కడే మృతిచెందింది.

హైదరాబాద్‌లో రోడ్లపై భారీ వరద నీరు
ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి రోడ్లపై భారీగా వరద నీరు చేరింది. బేగంబజార్‌, కోఠి, నాంపల్లి, హిమాయత్‌నగర్‌, ఖైరతాబాద్‌, ట్యాంక్‌బండ్‌, సికింద్రాబాద్‌, యూసఫ్‌గూడ తదితర ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు చేరింది. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రిలోకి వరద నీరు చేరింది. ఆస్పత్రి ఆవరణలోని నాలా కొన్ని రోజులుగా పొంగిపొర్లుతుండటంతో భారీగా వరద నీరు వచ్చింది. దాంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీనిపై స్పందించిన జీహెచ్‌ఎంసీ, హైడ్రా అధికారులు వెంటనే రెండు యంత్రాలతో నాలాను తవ్వి నీరు సాఫీగా వెళ్లేటట్టు చేశారు. మూసీ వరద ఉధృతితో మూసారాంబాగ్‌ బ్రిడ్జిపై నుంచి వరదనీరు ప్రవహిస్తుండటంతో వాహనాలను నిలిచివేశారు.

జంట జలాశయాల్లోకి భారీగా వరద నీరు
హైదరాబాద్‌లోని జంట జలాశయాల్లోకి భారీగా వరద నీరు వస్తోంది. అప్రమత్తమైన జలమండలి అధికారులు జంట జలాశయాల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. హిమాయత్‌సాగర్‌ 9 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 14,446 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నారు. ఉస్మాన్‌సాగర్‌ 12 గేట్లను 9 ఆడుగల మేర ఎత్తి 10,668 క్యూ సెక్కుల నీరును దిగువకు విడుదల చేస్తున్నారు. ఉస్మాన్‌సాగర్‌ 1790 ఎఫ్‌టీఎల్‌ కాగా, హిమాయత్‌సాగర్‌ ఎఫ్‌టీఎల్‌ 1763.50. అలాగే, 26,000 క్యూసెక్కుల వరద నీటిని మూసీ నదిలోకి విడుదల చేస్తుండటంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇక ట్యాంక్‌బండ్‌ (హుస్సేన్‌ సాగర్‌) 514.75 అడుగులుకాగా, ప్రస్తుతం 513.45 వరకు నీరు చేరింది. ప్రస్తుతం 690 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. దాంతో 890 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు
ఎగువన కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు 2,48,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో 35 గేట్లను ఎత్తి 2,40,450 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్టు పీజేపీ అధికారులు తెలిపారు. మక్తల్‌ సంగంబండ ప్రాజెక్టుకు కర్నాటక నుంచి భారీగా వరద నీరు వస్తుంటంతో రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్టు ఈఈ సురేష్‌ కుమార్‌ తెలిపారు. సింగూరు ప్రాజెక్టుకు 89,305 క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో వస్తుండటంతో 10 గేట్లను ఎత్తి వచ్చిన నీరు వచ్చినట్టు దిగవకు విడుదల చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -