Sunday, December 14, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవిందులు, వినోదాలు

విందులు, వినోదాలు

- Advertisement -

ఇంటింటికీ చికెన్‌, మటన్‌, మందు పంపిణీ
ఓటుకు రూ.3వేలు ఇస్తున్న అభ్యర్థులు

నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
రెండో విడత పంచాయతీ పోరులో పల్లెలు విందులు, వినోదాల్లో మునిగితేలుతున్నాయి. అభ్యర్థులు ఓటర్లను ఆకర్శించేందుకు ఇంటింటికీ చికెన్‌, మటన్‌, మందును పంపిణీ చేస్తున్నారు. రెండు, మూడు విడతల్లో ఎన్నికలు జరిగే గ్రామాల్లో పోటీ చేస్తున్న సర్పంచ్‌, వార్డు అభ్యర్థులు ఎలాగైనా గెలవాలనే కసితో ఉన్నారు. ఇందుకు తమ శక్తికి మించి ఖర్చు చేస్తున్నారు. దీంతో తడిసి మోపెడవుతోంది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఎన్నికలు జరిగే గ్రామాల్లో పొద్దున్నే టిఫిన్‌.. మధ్యాహ్నం చికెన్‌.. పొట్టేలు మాంసం.. రాత్రికి క్వార్టర్‌ బాటిల్‌.. ఇదీ అక్కడి పరిస్థితి.

ఇక మేజర్‌ గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన రాజకీయ పార్టీల మద్దతుదారులైన అభ్యర్థులు ఇంటింటికీ మాంసం పంపిణీ చేశారు. ఇంకొన్ని గ్రామాల్లో మధ్యాహ్నం చికెన్‌ రైస్‌, బిర్యానీ, రాత్రికి మందు దావతులు ఇస్తున్నారు. పల్లెల్లో ఎక్కడ చూసినా రోజంతా దావత్‌ల జోష్‌ నెలకొన్నది. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే కసితో అభ్యర్థుల శక్తికి మించి ఖర్చు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితులోనూ ఒక్క ఓటు కూడా చేజారకుండా ఉండేందుకు డబ్బులు పంపిణీ చేస్తూ ఓటర్లతో ఒట్టేయించుకుంటున్నారు. మద్యం బాటిళ్లు, చికెన్‌, మటన్‌ పార్శిల్‌ ఇంటింటికీ సప్లరు చేస్తున్నారు.

గ్రౌండ్‌ రిపోర్టు ఆధారంగా ప్రచారం..
తమ అనుచరులతో ఎప్పటి కప్పుడూ గ్రౌండ్‌ రిపోర్టు ఎలా ఉందో, ఓటర్ల మదిలో ఏముందోననే విషయాలను అభ్యర్థులు, నాయకులు తెలుసుకుంటున్నారు. తమకు వ్యతిరేకంగా ఉన్న వారిని ప్రత్యేకంగా పలుమార్లు కలిసి ఓట్లేయాలని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నారు. డబ్బుల పంపిణీలో కొత్త పుంతలు తొక్కుతున్నారు.

సంఘాల వారీగా తాయిలాలు..
వ్యక్తిగతంగా ఓటర్లను కలుస్తున్న అభ్యర్థులు, కుల సంఘాల వారీగా కూడా కలుస్తూ వారికి తాయిలాలు సమర్పిస్తున్నారు. తీర్చగలిగే కోరికలను తీర్చేస్తూ, మిగతా వాటిని గెలవగానే నెరవేరుస్తామంటూ బాండ్‌ రాసి ఇస్తున్నారు. కొన్ని సంఘాలకు సొంత భవనాల నిర్మాణాలకు నిధులు కావాలని అడిగి, వెంటనే రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు తీసుకుంటున్నారు.

ఓటు మాత్రం మాకే వేయండి
”మీ ఓటు మాకు ఎంతో విలువైంది.. ఓటుకు రూ.3 వేలైనా ఇస్తాం. అవసరమైతే అదనంగా మరికొంత ఇస్తాం కానీ, మీ ఓటు మాత్రం మాకే వేయండి” అంటూ చాలా గ్రామాల్లో సర్పంచ్‌ అభ్యర్థులు ఓట్ల కోసం తంటాలు పడుతున్నారు. ఓ సర్పంచ్‌ అభ్యర్థి వేసుకున్న అంచనాకు మించి ఖర్చవుతుండటంతో ఎకరం పొలాన్ని తాకట్టు పెట్టి రూ.40 లక్షలు అప్పు తీసుకొచ్చి ఖర్చు చేస్తున్నట్టు తన అనుచరుల వద్ద వాపోయినట్టు తెలిసింది. ఇలా చాలా చోట్ల జరుగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -