కార్మికశాఖ పర్యవేక్షణలో నిర్మాతల మండలి పోరాటాన్ని భగ్నం చేసే కుట్రలు
నవతెలంగాణ హైదరాబాద్ : తమ న్యాయమైన డిమాండ్ల సాధనకోసం తెలుగు సినీ పరిశ్రమ కార్మికులు గత 18 రోజులుగా మొక్కవోని దీక్షతో పోరుబాట కొనసాగిస్తున్నారు. గతంలో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఏడాదికి 10 శాతం చొప్పున 2022 నుంచి 2025 వరకూ మూడేళ్లపాటు 30 శాతం వేతనాలు పెంచాలని కార్మికులు పోరాడుతున్నారు. తెలుగు ఫిలిం ఇండిస్టీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఆలిండియా ఫిలిం ఎంప్లాయీస్ కాన్ఫెడరేషన్-యుఎన్‌ఐ-ఎంఇఐ అనుబంధం) ఆధ్వర్యంలో ఫెడరేషన్ ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తోంది. ఈ పోరాటానికి మొత్తం 24 క్రాఫ్ట్‌ల పరిధిలోని ఆయా యూనియన్ నాయకులు నేతృత్వం వహిస్తున్నారు. ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్‌కుమార్ వల్లభనేని, ప్రధాన కార్యదర్శి అమ్మిరాజు కులిమిల్లి, కోశాధికారి టి.వి.అలెగ్జాండర్ (అలెక్స్), తెలుగు ఫిలిం ఇండిస్టీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కన్వీనర్ (తెలంగాణా, ఆంధ్రప్రదేశ్) కన్వీనర్ వెల్లంకి శ్రీనివాసకుమార్‌ల ఆధ్వర్యంలో ఈ పోరుబాట ఉధృతంగా కొనసాగుతోంది. 30 శాతం మేర వేతనాలు పెంచిన నిర్మాతలు తమ సినిమాలను అవసరమైన మేరకు కార్మికులను వినియోగించుకుని షూటింగ్‌లు చేసుకోవటానికి కార్మిక నేతలు అంగీకరించారు. కొంతమేరకు ఇవి జరుగుతున్నాయి. ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకూ గతంలో ఉండే ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల కాల్షీట్ల్ల పేరుతో మెలికపెట్టిన నిర్మాతలు దీనిని బలవంతంగా రుద్దేందుకు పూనుకుంటున్నారు. ఇప్పటికే కార్మిక నేతలు నిర్మాతల మండలి తరపున ఫిలిం ఫెడరేషన్ కార్యాలయాల్లో జరిగే చర్చలకు హాజరవుతున్నారు. మరో వైపు ఇరువైపుల నుంచి ఏర్పాటుచేసిన కోఆర్డినేషన్ కమిటీ కూడా తమవంతుగా కొంత ప్రయత్నం చేస్తోంది. చర్చలకు సానుకూలంగా లేని నిర్మాతలు కార్మికుల న్యాయమైన డిమాండ్లపై కనెర్ర చేస్తోంది. అసలు కార్మికులకు యూనియన్లే అవసరం లేదన్నట్లుగా మాట్లాడుతున్న నిర్మాతలు-కార్మిక నేతలపై కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటున్నారు.
అనిల్‌కుమార్ గృహనిర్బధం
కార్మికుల ఆందోళనతో తమకు రోజుకు రూ.కోటి వరకూ నష్టపోతున్నట్లుగా నిర్మాత టిజి విశ్వప్రసాద్ గతంలోనే ఫెడరేషన్ నేతలపై కేసు బనాయించారు. తాజాగా గురువారంనాడు పలువురు కార్మిక నేతలపై కేసులు బనాయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్‌కుమార్ వల్లభనేనిని పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. మిగతా నాయకుల ఇళ్ల వద్దా పోలీసులు పహారా కాస్తున్నారు. బయటకు రాకుండా చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు అనుబంధ సంఘాల్లోని నాయకులను బెదిరించటం ద్వారా బలవంతంగా షూటింగ్‌లకు ఒప్పించేందుకు కుట్ర జరుగుతోంది. కార్మికులను షూటింగ్‌కు రావాల్సిందిగా నిర్మాతల కార్యాలయాల నుంచి ఫోన్లు చేయిస్తున్నారు. నాయకులను ఇళ్లలో నుంచి బయటకు రాకుండా చేసి కార్మికులను నయానో, భయానో బెదిరించటం ద్వారా పోరుబాటకు ఫుల్‌స్టాఫ్ పెట్టేలా నిర్మాతలు కుట్రలు సాగిస్తున్నారు. నిర్మాతలు ఎన్ని ప్రలోభాలకు గురిచేస్తున్నా కార్మికులు మాత్రం తమ నేతలు లేకుండా చర్చలకు రాబోమనీ, షూటింగ్‌లకు హాజరుకాబోమని స్పష్టంచేస్తున్నారు. ఇప్పటికే తమ నేతలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తేయాలని డిమాండ్‌చేస్తున్నారు.
రంగంలోకి కార్మికశాఖ
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్మికశాఖ అధికారులు కూడా కార్మికులుానిర్మాతల విషయమై నెలకొన్న సమస్యపై దృష్టిసారించారు. మధ్యేమార్గంలో తెలంగాణా ప్రభుత్వం సూచించిన విధంగా 20 శాతం వేతనాలను ఒప్పించేందుకు కృషి జరుగుతున్న క్రమంలో నిర్మాతల మండలి తన అనైతిక పంథా వీడలేదు. కార్మికుల్లోనూ, వారి నాయకత్వాల్లో చీలికలు చేయటం ద్వారా, పోరుబాటకు బ్రేకులు వేయించేందుకు కుట్రలు సాగిస్తోంది. ఆఖరుకు కార్మికశాఖ ఆదేశాలను సైతం బేఖాతర్ చేస్తూ కార్మికుల పట్ల నియంతృత్వ ధోరణిని నిర్మాతలు ప్రదర్శిస్తున్నారు.

బెదిరింపులకు లొంగేది లేదు : ఫెడరేషన్ నేతలు
‘మేము అన్ని విధాలుగా చర్చలకు సిద్ధంగా ఉన్నాం. నిర్మాతల తీరే అప్రజాస్వామికంగా ఉంటోంది. ఈనెల 4 నుంచి కార్మికులు నిరవధిక నిరసనలో ఉన్నారు. నిర్మాతలు పెట్టిన షరతులు దాదాగా అన్నీ అంగీకరించాం. కేవలం ఒక్క కాల్షీట్ విషయంలోనే పాత విధానాన్ని మార్చి కొత్తది తెస్తే కార్మికులకు ఇప్పుడు వచ్చే వేతనాల్లో కోతపడుతుంది. ఈ విషయాన్నే మేము స్పష్టం చేశాం. పెరిగిన సమాయానికి మరో అర రోజు కాల్షీట్ మాత్రమే అడుగుతున్నాం. మేము ఇవ్వం. మీరు ఆందోళనలను మానేయాలని నిర్మాతలు బెదిరిస్తున్నారు. ఇదెక్కడి దుర్మార్గం. ఇప్పటికి వచ్చే వేతనాలు పెంచాల్సిందిపోయే వచ్చేదానిలో తగ్గిపోయే పరిస్థితులు ఉన్నాయి, కార్మికులు నష్టపోతారు. ఇలాంటి పరిస్థితుల్లో మేము కార్మికుల పక్షాన నిలబడాల్సిందే కదా..మేము అదే చేస్తున్నాం. నిర్మాతల వైఖరే సరిగా లేదు. మేము కూడా అన్ని విషయాలపై సానుకూలంగానే స్పందిస్తున్నాం. కేసులు పెడుతున్నారు. బెదిరిస్తున్నారు. కార్మికుల మధ్య అనైక్యత సృష్టించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసుల నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు. ఇదెక్కడి దుర్మార్గం. ఇప్పటికే నిర్మాతల వైఖరి మారాలనే మేము కోరుకుంటున్నాం. కార్మికుల వేతనాలు అగ్రిమెంట్ ప్రకారం పెంచాల్సిందే. పెంచకపోయే నిరవధిక బంద్‌కు దిగుతాం’ ఇదే విషయాన్ని మేము పలు సందర్భాల్లోనూ స్పష్టంచేశామని ఫెడరేషన్ నాయకులు వివరించారు.