Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలి

ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలి

- Advertisement -

యూరియాను వెంటనే రైతులకు అందించాలి : సీపీఐ(ఎం) మాజీ ఎమ్మెల్యే జూలకంటి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే చెల్లించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నాయని తెలిపారు. ఆరేండ్ల నుంచి ఫీజులు పెండింగ్‌లో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా సకాలంలో ఫీజులను చెల్లించకుండా తాత్సారం చేస్తున్నదని విమర్శించారు. సుమారు రూ.8,158 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఎన్ని ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాలేజీ యాజమాన్యం ఖాతాలో కాకుండా డైరెక్ట్‌ బెనిఫిషియరీ ట్రాన్స్‌ఫర్‌ (డీబీటీ) పద్ధతిలో చెల్లిస్తామంటూ కొత్త విధానాన్ని తెచ్చిందని తెలిపారు. ఇందులో రాష్ట్రం 60 శాతం, కేంద్రం 40 శాతం నిధులను చెల్లిస్తాయని వివరించారు. కానీ రెండు ప్రభుత్వాలూ పట్టించు కోకపోవడంతో విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతు న్నదని పేర్కొన్నారు. చదువులు పూర్తయిన విద్యార్థులకు యాజమాన్యాలు ధ్రువపత్రాలను ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే ఫీజు బకాయిలను చెల్లించి విద్యార్థులను ఆదుకోవాలని కోరారు.
పంటలకు సరిపడా యూరియా ఇవ్వాలి
రాష్ట్రవ్యాప్తంగా వేసిన పంటలకు సుమారు 11 లక్షల టన్నుల యూరియా అవసరం ఉండగా, కేవలం తొమ్మిది లక్షల టన్నులు మాత్రమే కేటాయించి ఆరు లక్షల టన్నులు మాత్రమే సరఫరా చేశారని జూలకంటి తెలిపారు. దీనివల్ల బ్లాక్‌ మార్కెట్‌లో ప్రయివేటు వ్యాపారులు అధిక ధరలకు అమ్ముకుని రైతులను నష్టపరుస్తున్నారని పేర్కొ న్నారు. యూరియా సకాలంలో అందక రైతులు తీవ్ర పంటనష్టానికి గురయ్యే ప్రమాదముందని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టకుండా రాజకీయాలకతీతంగా ప్రస్తుతం వేసిన పంటలకు సరిపడా యూరియాను సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకోసం చొరవ చూపాలని కోరారు.
మొబైల్‌ మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేయాలి
కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల గ్రామాలు, మురికివాడలు, మారుమూల ప్రాంతాల్లో శానిటేషన్‌ లేకపోవడం వల్ల ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారని జూలకంటి తెలిపారు. పాలక మండళ్లు లేకపోవడం వల్ల స్థానికంగా పరిసరాలు అపరిశుభ్రంగా మారి దోమలు, ఈగల బెడదతో కాలనీలు దుర్గంధమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి పారిశుధ్యంపై దృష్టిపెట్టాలనీ, క్షేత్రస్థాయి అస్పత్రుల్లో వైద్య సౌకర్యాలు మెరుగుపర్చాలని కోరారు. అవసరమైన మందులు ఉచితంగా ఇవ్వాలని సూచించారు. గిరిజన ప్రాంతాలు, మురికివాడల్లో మొబైల్‌ మెడికల్‌ క్యాంపులను తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad