– వికారాబాద్ జిల్లాలో ఘటన
– తన చావుకు ఎవరూ కారణం కాదంటూ సుసైడ్ నోట్
– పలు అనుమానాలు వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు
నవతెలంగాణ-ధరూర్
అనుమానాస్పద స్థితిలో మహిళా కానిస్టేబుల్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలోని గంగారం సాయిబాబా కాలనీలో శనివారం జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ పట్టణానికి చెందిన బలిజ జగదేవి, బసవరాజ్ దంపతులకు ముగ్గురు కూతుర్లు. బసవరాజ్ గతంలోనే చనిపోయాడు. వీరి చిన్న కూతురు బలిజ దివ్య (27) కోట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ, ప్రస్తుతం ధారూర్ సీఐ కార్యాలయానికి అటాచ్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో శనివారం ఉదయం తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడించనున్నట్టు చెప్పారు.
ఘటనా స్థలంలో సూసైడ్ నోట్
ఘటనా స్థలంలో దివ్య రాసిన సూసైడ్ నోట్ లభ్యమైంది. ఆమె తన తల్లికి, కుటుంబ సభ్యులను క్షమాపణలు కోరుతూ భావోద్వేగపూరితంగా లేఖ రాసింది. ‘నా నిర్ణయానికి ఎవరూ కారణం కాదు. మానసిక ఒత్తిడి కారణంగా తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నాను. అమ్మకి భారం కాకూడదనే ఆలోచన నన్ను వేధించింది. నాన్న ఉంటే బాగుండు అమ్మ. నాన్న లేనందుకే నాకు ఇన్ని కష్టాలు. నన్ను క్షమించు అమ్మా..’ అంటూ లేఖలో పేర్కొంది. దివ్య మృతి వార్త పోలీస్ శాఖలోనూ తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. విధుల్లో క్రమశిక్షణతో, అంకితభావంతో పనిచేసే ఆమె ఆకస్మిక మృతి పట్ల సహచరులు దిగ్భాంత్రి వ్యక్తం చేశారు.
అనుమానం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు
దివ్య మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. దివ్య అక్క శ్వేత మాట్లాడుతూ.. తన చెల్లి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని తెలిపారు. తనకు పోలీసు డిపార్ట్‌మెంట్‌లోనే పనిచేసే ఓ కానిస్టేబుల్‌తో పరిచయం ఉండేదని, అతను ఆమెను పెండ్లి చేసుకుంటానని కూడా చెప్పాడని, ఆ విషయం దివ్య తమకు చెప్పిందన్నారు. పెండ్లి గురించి కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని అనుకున్నామని తెలిపారు. కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని, ఆమె ఇలా చేస్తుందని ఎప్పుడూ ఊహించలేదన్నారు. ఈ కేసుపై సమగ్ర విచారణ జరిపి తన చెల్లి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



