నవతెలంగాణ – ముధోల్
రేపు టీ నుండి పర్టీలైజర్ బుకింగ్ యాప్ ద్వారా ఎరువులను పంపిణీ చేయనున్నట్లు ముధోల్ మండల వ్యవసాయ శాఖ అధికారిణి దాసరి రచన శనివారం ఒక ప్రకటన లోతెలిపారు. ఈ యాప్ ద్వారా పంపిణీలో పారదర్శకత పెరుగుతుందన్నారు. డీలర్, షాప్‌ల వద్ద గందరగోళం, క్యూ లైన్లు తగ్గుతాయన్నారు. పంట, భూమి విస్తీర్ణం ఆధారంగా న్యాయమైన కేటాయింపు జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా కౌలు రైతులకు కూడా యూరియా అందుబాటులోకి వస్తుందన్నారు. మండలం అందుబాటులో ఉన్న యూరియాను రైతులు వేసిన పంటను బట్టి వారికున్న విస్తీర్ణాన్ని బట్టి ఏ డీలర్ దగ్గర, ఏ సొసైటీలో అయినా అందుబాటులో ఉన్న యూరియాను నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఈ యాప్ ద్వారా రైతులకు పూర్తిస్థాయిలో ఎరువులు అందుబాటులోకి వస్తాయన్నారు.
ఒకసారి నమోదు చేసుకున్న తర్వాత 24 గంటల లోపు ఆ రైతు నమోదు చేసుకున్న డీలర్ దగ్గరికి వెళ్లి కొనుగోలు చేసుకోవచ్చునన్నారు. ఏదైనా పరిస్థితులలో 24 గంటల లోపు యూరియాను తీసుకోనట్లయితే ఆ యొక్క బుకింగ్ రద్దు అవుతుందని తెలిపారు. మళ్లీ రైతులు బుక్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు.ఇందులో పట్టాదారులు, పట్టా పుస్తకాలు లేని రైతులు, కౌలు రైతులు యూరియాను బుక్ చేసుకునే వెసులుబాటు ఉందని తెలిపారు. రైతు వేదికల వద్ద ఏఈవోలు యాప్ గురించి రైతులకు ప్రత్యేక అవగాహన కూడా కల్పించడానికి అందుబాటులో ఉంటారన్నారు. ఈ అవకాశంను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు



